కొత్త తారలు వచ్చారు | US Open women final : Madison Keys - Sloane Stephens | Sakshi
Sakshi News home page

కొత్త తారలు వచ్చారు

Published Sat, Sep 9 2017 12:34 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

కొత్త తారలు వచ్చారు

కొత్త తారలు వచ్చారు

తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో కీస్, స్టీఫెన్స్‌
∙ సెమీస్‌లో ఓడిన వీనస్, వాండవె


యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో  కొత్త చాంపియన్‌ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. సెమీస్‌లో సత్తా చాటిన అన్‌సీడెడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్, 15వసీడ్‌ మాడిసన్‌ కీస్‌ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరుకు అర్హత సాధించారు. అద్భుతమైన పోరాటపటిమతో స్టీఫెన్స్‌ తొమ్మిదో సీడ్‌ వీనస్‌ను కంగు తినిపించగా... వాండవెపై కీస్‌ అలవోక విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత ఇద్దరు అమెరికన్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుండటం విశేషం.

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికాకు చెందిన మాడిసన్‌ కీస్, స్లోన్‌ స్టీఫెన్స్‌ టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించారు. శుక్రవారం జరిగిన నలుగురు అమెరికన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లలో ఏడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, 9వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్, మరో అమెరికన్‌ కోకో వాండవె ఓటమి పాలయ్యారు. స్టీఫెన్స్‌ 6–1, 0–6, 7–5తో వీనస్‌ను కంగుతినిపించగా... కీస్‌ 6–1, 6–2తో కోకో వాండవెపై అలవోక విజయం సాధించింది. 2002 తర్వాత ఇద్దరు అమెరికా క్రీడాకారిణిల మధ్య టైటిల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ తుదిపోరులో సెరెనా విలియమ్స్‌... తన సోదరి వీనస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. స్టీఫెన్స్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో వీనస్‌ 3 ఏస్‌లను సంధించి, 6 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. అయితే ఏకంగా 51 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు స్టీఫెన్‌ 2 ఏస్‌లు సంధించి 17 విన్నర్లు కొట్టింది. 27 అనవసర తప్పిదాలు చేసినా చివరకు టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది.  

స్టీఫెన్స్‌ పోరాడిందిలా...: వీనస్‌ విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో స్లోన్‌ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. తొలి గేమ్‌ను గెలుచుకొని శుభారంభం చేసింది. ఇదే జోరులో 24 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో ముగించింది. అయితే రెండో సెట్‌లో వీనస్‌ తన అనుభవాన్నంత రంగరించి ప్రత్యర్థిని మట్టికరిపించింది. గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకొచ్చే సర్వ్‌లకు స్టీఫెన్స్‌ చేతులెత్తేసింది. దీంతో ఒక్కగేమైనా గెలవకుండానే 0–6తో సెట్‌ను చేజార్చుకుంది. 30 నిమిషాల్లో వీనస్‌ ఈ సెట్‌ గెలిచింది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. గంట 13 నిమిషాల పాటు ఈ సెట్‌ సాగింది. తొలి గేమ్‌లో వీనస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన స్టీఫెన్స్, తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. దీంతో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో గేమ్‌ సర్వీస్‌కు దిగిన వీనస్‌ అనవసర తప్పిదాలతో పాయింట్లను కోల్పోయింది.

అయితే తర్వాత మూడు గేమ్‌ పాయింట్లను సాధించి తొలిసారిగా పైచేయి సాధించింది వీనస్‌. ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడిన వెటరన్‌ స్టార్‌ ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటింది. అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సెట్‌లో 3–2తో జోరు పెంచింది. వెంటనే తేరుకున్న 24 ఏళ్ల స్టీఫెన్స్‌ వరుసగా 6, 7 గేములను గెలుచుకుంది. దీటుగా బదులిచ్చిన వీనస్‌ 8, 9 గేమ్‌లను కైవసం చేసుకోవడంతో ఆధిక్యం చేతులు మారింది. కానీ తర్వాత వరుసగా మూడు గేముల్లో స్టీఫెన్స్‌ అద్భుతంగా పోరాడింది. రెండు సార్లు తన సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె ఒక బ్రేక్‌ పాయింట్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

అలవోకగా ముగించిన కీస్‌: మరో సెమీఫైనల్లో 15వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ ప్రత్యర్థికేమాత్రం అవకాశమివ్వకుండా ఏస్‌లతో చెలరేగింది. 6–1తో తొలి సెట్‌ను 23 నిమిషాల్లోనే ముగించింది. తర్వాత సెట్‌లో వాండవె కాస్త పోరాడే ప్రయత్నం చేసినా కీస్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 43 నిమిషాల్లో 6–2తో రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కీస్‌ 5 ఏస్‌లను సంధించి, 25 విన్నర్స్‌ కొట్టింది. ఒకసారి మాత్రమే డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. మరో వైపు 22 అనవసర తప్పిదాలు చేసిన వాండవె కేవలం తొమ్మిదే విన్నర్స్‌ కొట్టింది.

సానియా కథ ముగిసింది
మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సానియా మీర్జా–షుయ్‌ పెంగ్‌ (చైనా) జోడి 4–6, 4–6తో రెండో సీడ్‌ మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)– యంగ్‌ జన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement