వింబుల్డన్ టైటిల్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లోనూ దూసుకుపోతున్నాడు. మరో విజయంతో వరుసగా 11వ ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రెండుసార్లు టైటిల్ గెలిచి, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన అతను ఎనిమిదోసారి ఫైనల్ బెర్త్ కోసం సెమీఫైనల్లో నిషికోరితో పోరుకు సిద్ధమయ్యాడు.
న్యూయార్క్: ప్రిక్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెడరర్‌ను మట్టికరిపించిన జాన్ మిల్‌మన్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వరుస సెట్‌లలో తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో వరుసగా 11వసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. రెండు గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–4తో ప్రపంచ 55వ ర్యాంకర్ మిల్‌మన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. మ్యాచ్ వరుస సెట్‌లలో ముగిసినా విజయం కోసం జొకోవిచ్ శ్రమించాల్సి వచ్చింది. ఈ మాజీ చాంపియన్ 20 బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని మాత్రమే అనుకూలంగా మల్చుకున్నాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 53 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే జొకోవిచ్ తప్పిదాలను మిల్‌మన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే చురు గ్గా కదులుతూ, బంతిని అందుకుంటూ సాధ్యమైన మేర ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. మిల్‌మన్ నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకోవడంతో తొలి సెట్ ఆరో గేమ్ 15 నిమిషాలపైగా సాగింది. రెండో సెట్‌లో ఆటగాళ్లిద్దరూ సుదీర్ఘ ర్యాలీలతో అలరించారు. కానీ ఫినిషింగ్‌లో జొకోవిచే పైచేయి సాధించాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో 2014 రన్నరప్ నిషికోరి 4 గంటల 8 నిమిషాల పోరులో 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందాడు. తద్వారా 2014 ఫైనల్లో సిలిచ్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తొలి సెట్‌ను త్వరగానే కోల్పోయి, రెండో సెట్‌లో 2–4తో వెనుకబడిన నిషికోరి ఒక్కసారిగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌నూ నెగ్గిన నిషికోరి నాలుగో సెట్‌లో తడబడ్డాడు. కానీ నిర్ణాయక ఐదో సెట్‌లో కోలుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్స్‌లో జొకోవిచ్‌తో నిషికోరి; రాఫెల్ నాదల్‌తో డెల్‌పొట్రో తలపడతారు.
సెమీస్‌లో కీస్...
మహిళల సింగిల్స్ విభాగంలో గతేడాది రన్నరప్ మాడిసన్ కీస్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కీస్ 6–4, 6–3తో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై విజయం సాధించింది. ఆరు ఏస్‌లు సంధించిన కీస్ రెండు సెట్‌లలో ఒక్కోసారి స్వారెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో జపాన్ అమ్మాయి నయోమి ఒసాకాతో కీస్; సెవస్తోవా (లాత్వియా)తో సెరెనా విలియమ్స్ తలపడతారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఒసాకా 6–1, 6–1తో లెసియా సురెంకో (ఉక్రెయిన్)ను అలవోకగా ఓడించింది. ఈ విజయంతో ఒసాకా 22 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో జపాన్ తరఫున సెమీఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1996లో కిమికో డాటె జపాన్ తరఫున వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. నిషికోరి, ఒసాకా రూపంలో జపాన్ క్రీడాకారులిద్దరు ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం కూడా ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment