న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్ వేటను సెర్బియా దిగ్గజం జొకోవిచ్ అలవోక విజయంతో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6-2, 6-2, 6-4తో క్వాలిఫయర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, 23 విన్నర్స్ కొట్టాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ 6-2, 6-0తో వర్వరా గ్రచెవా (ఫ్రాన్స్)ను ఓడించగా... సబలెంకా 6-3, 6-3తో ప్రిసిల్లా హాన్ (ఆస్ట్రేలియా)పై, టాప్ సీడ్ స్వియాటెక్ 6-4, 7-6 (8/6)తో కామిలా రఖిమోవా (రష్యా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment