
జొకోవిచ్- కుటుంబంతో కోబీ బ్రియాంట్ (ఫైల్ ఫొటో)
Novak Djokovic Pays Glorious Tribute To Kobe Bryant: ‘‘మీ అందరి ముందు నిలబడి నేను 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గురించి మాట్లాడతానని ఏనాడూ ఊహించలేదు. ఇది నిజమవుతుందని కూడా అనుకోలేదు. కానీ గత రెండేళ్లలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం నా ముందు ఉందనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాను.
నా శరీరం సహకరించినంత వరకు, నా శిక్షణ సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారం ఉన్నంతవరకు ఈ జైత్రయాత్రను కొనసాగిస్తాను. అత్యున్నతస్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదు. ఈ విజయాన్ని నా ఆప్త మిత్రుడు, మూడేళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్‌కు అంకితం ఇస్తున్నాను.
24వ గ్రాండ్‌స్లామ్
యూఎస్ ఓపెన్ గెలిస్తే కోబీ బ్రయాంట్ ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ట్రోఫీ ప్రదానోత్సవంలో ధరించాలని అనుకున్నాను’’ అని సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. యూఎస్ ఓపెన్-2023లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్.. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి చరిత్రకెక్కాడు. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు.
వరల్డ్‌నంబర్ 1
తద్వారా యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జొకోవిచ్.. తన స్నేహితుడు కోబీ బ్రియాంట్‌ను గుర్తు చేసుకున్నాడు. అతడి ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి నివాళి అర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
రికార్డుల జొకోవిచ్
కాగా ఈ విజయంతో ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌ను నాలుగుసార్లు చొప్పున (2011, 2015, 2021, 2023) సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. అదే విధంగా.. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో కానర్స్ (109; అమెరికా), ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత జొకోవిచ్(96) మూడో స్థానంలో ఉన్నాడు.
తీరని విషాదం
‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కోబీ కుటుంబం సహా అతడి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ ఘటన జరిగి మూడేళ్లకు పైనే అయింది.
చదవండి: వాళ్లను ఉతికి ఆరేశారు! పాక్ మరీ చెత్తగా.. శ్రీలంక తక్కువేం కాదు!
Novak hits 24 and pays tribute to the late Kobe Bryant 💙 pic.twitter.com/rDXVUvYe1Z
— US Open Tennis (@usopen) September 10, 2023