జొకోవిచ్‌కు షాక్‌ | Novak Djokovic defeat at US Open | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌కు షాక్‌

Published Sun, Sep 1 2024 4:09 AM | Last Updated on Sun, Sep 1 2024 7:41 AM

Novak Djokovic defeat at US Open

మూడో రౌండ్‌లో పాపిరిన్‌ చేతిలో ఓటమి

గ్రాండ్‌స్లామ్‌ లేకుండా సీజన్‌ ముగింపు

న్యూయార్క్‌: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌  గెలిచి ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసే లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఆ కల నెరవేరేందుకు మరికొంత ఆగాల్సిందే. పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణం తర్వాత అమిత విశ్వాసంతో ఈ టోర్నీ బరిలోకి దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన జొకోవిచ్‌ అనూహ్యంగా మూడో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.

పురుషుల సింగిల్స్‌లో క్రితం రోజు 2022 చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ నిష్క్ర మించగా... జొకో ఆట మూడో రౌండ్లో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో అతను 4–6, 4–6, 6–2, 4–6తో 28వ సీడ్‌ అలెక్సీ పాపిరిన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. 37 ఏళ్ల వెటరన్‌ స్టార్‌ 16 ఏస్‌లు సంధించినప్పటికీ అదేపనిగా 14 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 

దిగ్గజానికి దీటుగా 15 ఏస్‌లు కొట్టిన పాపిరిన్‌ కేవలం 6 డబుల్‌ ఫాల్ట్‌లే చేశాడు. జొకో 40 విన్నర్లకే పరిమితమైతే... 25 ఏళ్ల ఆ్రస్టేలియన్‌ 50 విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పదిసార్లు ఫైనల్‌ చేరిన రెండో సీడ్‌ జొకోవిచ్‌ ఇందులో నాలుగు టైటిళ్లు (2011, 2015, 2018, 2023) సాధించాడు. 2007, 2010, 2012, 2013, 2016, 2021లలో రన్నరప్‌గా నిలిచాడు. 

ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న సెర్బియన్‌ సూపర్‌స్టార్‌ 17 ఏళ్ల తర్వాత మూడో రౌండ్లో ఇంటిదారి పట్టాడు. యూఎస్‌ ఓపెన్‌ ఆడిన తొలినాళ్లలో రెండుసార్లు (2005, 2006) మాత్రమే అతను మూడో రౌండ్లో ని్రష్కమించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో రెండుసార్లు నాలుగో రౌండ్‌ మినహా ప్రతీసారి సెమీస్‌ లేదంటే ఫైనల్‌ చేరిన ఘనత జొకోవిచ్‌ సొంతం. 

మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 5–7, 7–5, 6–1, 6–3తో థామస్‌ ఎచెవెరి (అర్జెంటీనా)పై, ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–3, 7–5, 6–4తో జిరి లెహెక (చెక్‌రిపబ్లిక్‌)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6–7 (1/7), 3–6, 6–0, 6–3, 6–1తో జన్‌చెంగ్‌ షాంగ్‌ (చైనా)పై, 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సిస్కొ కొమెసన (అర్జెంటీనా)పై  విజయం సాధించారు. తొమ్మిదో సీడ్‌ గ్రిగొర్‌ డిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–3, 6–1తో టాలన్‌ గ్రీక్‌స్పూర్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడు. 

మూడో రౌండ్లోకి యూకీ బాంబ్రి జోడీ 
భారత టెన్నిస్‌ స్టార్లు రోహన్‌ బోపన్న, యూకీ బాంబ్రి పురుషుల డబుల్స్‌లో వారి భాగస్వాములతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో 2వ సీడ్‌ బోపన్న–ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) ద్వయం 6–2, 6–4తో కార్బలెస్‌ బేనా (స్పెయిన్‌)–ఫెడెరికొ కారియా (అర్జెంటీనా) జంటపై గెలిచింది. 

అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌)తో జోడీకట్టిన యూకీ బాంబ్రి రెండో రౌండ్లో 4–6, 6–3, 7–5తో 15వ సీడ్‌ క్రాజిసెక్‌ (అమెరికా)–జీన్‌ జులియెన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌) జంటపై విజయం సాధించింది. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–గైడో అండ్రియోజ్జి (అర్జెంటీనా) ద్వయం 6–7 (4/7), 4–6తో మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంట చేతిలో ఓడింది.

2002
తర్వాత ‘బిగ్‌–3’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్‌ ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కూడా గెలవని సీజన్‌గా 2024 నిలువనుంది. వరుసగా 21 ఏళ్ల పాటు (2003–2023) ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కనీసం ఒక గ్రాండ్‌స్లామ్‌ అయినా నెగ్గారు.  

2017
తర్వాత జొకోవిచ్‌ కనీసం ఒక్క గ్రాండ్‌స్లామ్‌ అయినా గెలవని సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌ ఫైనల్‌లలో ఓడిన జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గాయం కారణంగా క్వార్టర్‌ ఫైనల్‌కు ముందు తప్పుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement