యూఎస్ ఓపెన్-2024 పురుషుల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోనే ఇంటిబాటపట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ ర్యాంకర్ అలెక్సీ పాప్రిన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలెక్సీ 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జొకోవిచ్‌పై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.
కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ జొకోవిచ్.. 18 ఏళ్ల చరిత్రలో ఇలా ఆరంభ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. తద్వారా.. రికార్డు స్థాయిలో ఇరవై ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకునే సువర్ణావకాశాన్ని ప్రస్తుతానికి కోల్పోయాడు.
అత్యంత చెత్తగా ఆడాను.. అందుకే ఇలా
ఈ నేపథ్యంలో జొకోవిచ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లోనే అత్యంత చెత్తగా ఆడిన సందర్భం ఇది. ఆరంభం నుంచి మూడో రౌండ్ దాకా బాగానే ఆడినా.. ఇక్కడ మాత్రం తడబడ్డాను. ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఇక్కడకు రావడం ప్రభావం చూపింది.
శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. యూఎస్ ఓపెన్‌లో కచ్చితంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతానికైతే ఎటువంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు’’ అని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్లో కార్లోస్ అల్‌కరాజ్‌ను ఓడించి జొకోవిచ్ పసిడి పతకం గెలిచిన విషయం తెలిసిందే.
25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అప్పుడు అలా చేజారింది
ఆస్ట్రేలియా ఓపెన్-2024లో జెనిక్ సినర్‌తో సెమీస్‌లో జొకోవిచ్ ఓడిపోగా.. సినర్ ఫైనల్లో గెలిచి చాంపియన్ అయ్యాడు. అంతకుముందు.. కార్లోజ్ అల్‌కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, వింబుల్డన్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.
అల్‌కరాజ్ కూడా ఇంటికే!
ఇక ఈ ఏడాది యూఎస్ పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్‌కరాజ్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. మూడో సీడ్ అల్‌కరాజ్‌ను నెదర్లాండ్స్ టెన్నిస్ ప్లేయర్, 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్‌లలో ఓడించి తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment