యూఎస్ ఓపెన్‌కు జొకోవిచ్ సిద్ధం
నేటి నుంచి సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ
2008లో నొవాక్ జొకోవిచ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను గెలిచాడు. ఈ క్రమంలో వరుసగా గత 11 గ్రాండ్‌స్లామ్‌లను పంచుకున్న ఫెడరర్, నాదల్ జోరును నిలువరించాడు. 2011లో జొకోవిచ్ తొలి సారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన కొత్త అధ్యాయానికి తెర తీశాడు.
ఇప్పుడు 2024లో తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించేందుకు అతను సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్‌లో సమరానికి జొకోవిచ్ సై అంటున్నాడు. ట్రోఫీని అందుకొని జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరం.
న్యూయార్క్: సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా స్టార్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో అతను విజేతగా నిలిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 2023లో ఇక్కడ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తే ఫెడరర్ (2004–08) తర్వాత టైటిల్ నెలబెట్టుకున్న మొదటి ఆటగాడిగా కూడా నిలుస్తాడు.
తన తొలి రౌండ్‌లో 37 ఏళ్ల జొకోవిచ్ 138వ ర్యాంకర్ రాడు అల్బాట్ (మాల్డోవా)తో తలపడతాడు. 18వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడనున్న జొకోవిచ్ ఈ టోర్నీలో 2005లో తొలిసారి బరిలోకి దిగి మూడో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. అయితే 2011, 2015, 2018, 2023లలో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన అతను మరో ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘ఎప్పుడైనా గెలుపు ఒక్కటే లక్ష్యం. బాగా ఆడి ముందుగా ఫైనల్ వరకు చేరడం, ఆ తర్వాత టైటిల్ కోసం పోరాడటమే నాకు తెలుసు. ఈ తరహా దృక్పథంలో ఇప్పుడు కూడా ఎలాంటి మార్పూ లేదు’ అని జొకొవిచ్ అన్నాడు.
ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్న జొకోవిచ్ మరింత ఉత్సాహంతో యూఎస్ ఓపెన్‌కు సన్నద్ధమయ్యాడు. ‘నా జీవితంలో ఒలింపిక్ స్వర్ణం అతి పెద్ద ఘనత. నా కల నెరవేరింది. టెన్నిస్ కోర్టులో అలాంటి భావోద్వేగాలు నేను ఎప్పుడూ ప్రదర్శించలేదు. అంతకుముందు సెర్బియా ఫ్లాగ్‌బేరర్‌గా నిలబడిన ఘట్టం అన్ని గ్రాండ్‌స్లామ్ విజయాలకంటే మిన్న. అన్నీ గెలిచేశావు కదా ఇంకా ఏం కావాలి అని కొందరు అడుగుతున్నారు.
అయితే నాలో ఇంకా గెలవాలనే తపన ఉంది. మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటా. టెన్నిస్ ఆడేందుకు, చూసేందుకు ఇంకా చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా’ అని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలు టెన్నిస్‌కు మూలస్తంభాల్లాంటివని... ఇలాంటి చోట బాగా ఆడేందుకు ప్రేరణ లేకపోతే ఇంకెక్కడా ఆడలేరని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment