బీజింగ్: మహిళల టెన్నిస్‌లో ఈ ఏడాది సిమోనా హలెప్ రూపంలో ఐదో క్రీడాకారిణి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకుంది. చైనా ఓపెన్‌లో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా హలెప్... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ముగురుజా (స్పెయిన్) నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది.
సెమీఫైనల్లో హలెప్ 6–2, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)తో హలెప్ ఆడుతుంది. టాప్ ర్యాంక్ ఖాయం చేసుకున్నందుకు నిర్వాహకులు హలెప్‌కు నంబర్‌వన్ అంకె రూపంలో ఉన్న పూల బోకేను అందజేశారు.
1975లో కంప్యూటర్ ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక టాప్ ర్యాంక్‌లో నిలువనున్న 25వ క్రీడాకారిణిగా, రొమేనియా తరఫున తొలి ప్లేయర్‌గా హలెప్ గుర్తింపు పొందనుంది. ‘నా కల నిజమైంది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా కోరిక నెరవేరడంతో కోర్టులోనే తొలిసారి ఆనందభాష్పాలు వచ్చేశాయి. ఇక నా తదుపరి లక్ష్యం గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం’ అని 26 ఏళ్ల హలెప్ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది కెర్బర్ (జర్మనీ), సెరెనా (అమెరికా), ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన్) నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment