అందర్నీ చూడనివ్వు | Coco gauff Cant Cantrol After Title Winning in US Open | Sakshi
Sakshi News home page

అందర్నీ చూడనివ్వు

Published Wed, Sep 4 2019 6:30 AM | Last Updated on Wed, Sep 4 2019 10:56 AM

Coco gauff Cant Cantrol After Title Winning in US Open - Sakshi

శనివారం యు.ఎస్‌.ఓపెన్‌ థర్డ్‌ రౌండ్‌లో తను ఓడించిన కోకో గాఫ్‌ (కుడి) ను ఓదారుస్తున్న నవోమీ ఓసక

గెలిస్తే నీ ట్రోఫీని అందరికీ ఎత్తి చూపుతావు కదా.ఓడితే నీ కన్నీళ్లను ఎందుకు ఎవర్నీ చూడనివ్వవు? జీవితంలో నువ్వేం సాధించావో నీ ట్రోఫీ చెబుతుంది. జీవితాన్నినువ్వెంతగా ప్రేమిస్తున్నావో నీ కన్నీళ్లు చెబుతాయి.

ఓడిపోయి ఇప్పుడు కోకో గాఫ్‌ ఏడ్చినట్లుగా.. పన్నెండు నెలల క్రితం ఇదే యు.ఎస్‌. ఓపెన్‌లో, ఇదే ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో, ఇదే శనివారం జరిగిన ఫైనల్‌లో సెరెనా విలియమ్స్‌ని ఓడించినందుకు నవోమీ ఓసక ఏడుస్తూనే ఉంది. ఆఖరికి టైటిల్‌ ట్రోఫీ అందుకుంటున్నప్పుడు కూడా!

కోకో గాఫ్‌ పదిహేనేళ్ల పిల్ల. చూడ్డానికి సెరెనా విలియమ్స్‌కి చిట్టి చెల్లెల్లా ఉంటుంది. అమెరికన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌. నాలుగేళ్ల వయసులో టీవీ చూస్తున్నప్పుడు సెరెనా ఆమెను గట్టిగా పట్టేసుకుంది. 2009 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్స్‌లో సెరెనా తన ప్రత్యర్థి దినారా సఫీనా (రష్యన్‌ క్రీడాకారిణి) ను  6–0, 6–3 తేడాతో ఎలా పడగొట్టేసిందీ ఊపిరి బిగబట్టి చూసింది కోకో గాఫ్‌. అప్పట్నుంచీ టెన్నిసే ఆమె ఊపిరి అయింది. ఆ కోకో గాఫ్‌ శనివారం యు.ఎస్‌. ఓపెన్‌లో వరల్డ్‌  నం.1 నవోమీ ఓసక మీద 6–3, 6–0 తేడాతో ఓడిపోయింది. అదింకా థర్డ్‌ రౌండే. మొత్త ఏడు రౌండ్‌లు కదా ఉంటాయి.
ఆటలోకి వైల్డ్‌ కార్డ్‌తో ఎంటర్‌ అయింది కోకో గాఫ్‌. ఫస్ట్‌ రౌండ్‌లో పద్దెనిమిదేళ్ల రష్యన్‌ ప్లేయర్‌ని ఓడించింది. రెండో రౌండ్‌లో ఇరవై ఆరేళ్ల హంగేరియ¯Œ  ప్లేయర్‌పై గెలిచింది. మూడో రౌండ్‌లో ఆ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. 21 ఏళ్ల నవోమీ ఓసక ఈ అమ్మాయిని ఓడించింది. కోకో గాఫ్‌ చెంపల్నిండా జలపాతాలు! ఓటమిని తట్టుకోలేకపోయింది. కళ్లు తుడుచుకుంటోంది, మళ్లీ ఏడుస్తోంది. ఆన్‌కోర్ట్‌ ఇంటర్వ్యూ మొదలవగానే కోర్టునుంచి వెళ్లబోయింది కానీ, నవోమీ ఆమెను వెళ్లనివ్వలేదు. ‘నా పక్కనే ఉండు’ అంది. ఉండలేను అంది. ‘‘వాష్‌రూమ్‌కి వెళ్లి ఏడ్వడం కన్నా నయం.. కోర్టులోనే ఏడ్చేయడం. అందర్నీ చూడనివ్వు. ఆటను నువ్వెంత ప్రేమిస్తున్నావో..’’ అంది కోకో గాఫ్‌ని మృదువుగా హత్తుకుని! ఈమె కళ్లల్లోనూ నీళ్లు ఆ అమ్మాయి బాధ చూసి. గ్యాలరీలో కూర్చొని ఉన్న కోకో అమ్మానాన్నల వైపు తిరిగి ‘‘కోకో అద్భుతంగా ఆడింది. చక్కటి క్రీడాకారిణిగా మీరు తనని తీర్చిదిద్దారు’’ అని చెప్పింది నవోమీ. వాళ్ల కళ్లు మెరిశాయి. కోకో ఏడుపు ఆపకుండానే నవోమీకి థ్యాంక్యూ చెప్పింది.

కిందటేడాది యు.ఎస్‌.ఓపెన్‌లోనే ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించినందుకు విలపిస్తున్న నవోమీ ఓసక (జపాన్‌)
పన్నెండు నెలల క్రితం ఇదే యు.ఎస్‌. ఓపెన్‌లో, ఇదే ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో, ఇదే శనివారం జరిగిన ఫైనల్‌లో సెరెనా విలియమ్స్‌ని ఓడించినందుకు నవోమీ ఓసక ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది! సెరెనా కెరీర్‌కు అది కీలకమైన ఫైనల్‌. అది గెలిస్తే సెరెనా 24 టైటిళ్లు గెలిచినట్లవుతుంది. అది గెలిస్తే అప్పటివరకు మార్గరెట్‌ పేరు మీద ఉన్న 24 టైటిళ్ల రికార్డుకు సెరెనా ఈక్వల్‌ అవుతుంది. అది గెలిస్తే తల్లయ్యాక కూడా సెరెనా రాకెట్‌ పవరేం తగ్గలేదన్న సంకేతం ప్రపంచానికి వెళుతుంది. కానీ ఓడిపోయింది! 6–2, 6–4 తేడాతో 20 ఏళ్ల వయసులోని 20వ సీడ్‌ నవోమీ.. సీనియర్‌ మోస్ట్‌ సెరెనాపై గెలిచింది. దీర్ఘకాలం తర్వాత జపాన్‌కు వచ్చిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌! సెరెనాకు అది పెద్ద ఓటమి అయితే, నవోమీకి పెద్ద గెలుపు. కానీ ఆ పెద్ద గెలుపు సంతోషం ఆమెకు మిగల్లేదు. నవోమీ గెలవగానే గ్యాలరీలో ఉన్న సెరెనా అభిమానులు నవోమీని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ‘సెరెనానే ఓడిస్తావా?’ అన్నారు.  ‘వెంటనే మా కళ్ల ముందు నుంచి వెళ్లిపో’ అన్నారు. నవోమీ కళ్లు తుడుచుకుంటూనే స్టేజ్‌ మీదకు ఎక్కింది. కళ్లు తుడుచుకుంటూనే ట్రోఫీ అందుకుంది. ఎవరూ ఆమెను ఓదార్చలేదు. అందరూ సెరెనాను ఓదార్చేందుకే ప్రయత్నించారు. ఆఖరికి నవోమీ కూడా!! సెరెనా అభిమానుల వైపు చూసి ‘‘సారీ, ఇలా ముగిసింది’’ అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది నవోమీ. ఓడిపోయిన ప్లేయర్‌ని తట్టుకోవడం కష్టం. ఓడిపోయిన ప్లేయర్‌ అభిమానులను తట్టుకోవడం ఇంకా కష్టం. ఇక్కడ ఓడిపోయిన ఈ చిన్న పిల్ల కోకో గాఫ్‌కూ అభిమానులు లేకపోతారా? ‘సారీ.. ఇంత కఠినంగా ఆడినందుకు’ అని ఆమెను దగ్గరకు తీసుకుంది నవోమీ! నవోమీలోని విజేత.. నవోమీలోని కోకో గాఫ్‌ అభిమానికి చెప్పిన సారీ ఇది. గతం ఏడాది తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనాను, ఇప్పుడు తననీ ఓడించినందుకు ప్రతీకారంగా కోకో గాఫ్‌ పెరిగి పెద్దయి భవిష్యత్తులో నవోమీని ఓడిస్తే కనుక దానిని కూడా నవోమీ ఒక గెలుపుగానే తీసుకుంటుందని ఊహించడానికి ఈ ‘సారీ’లు చాలు. అమేజింగ్‌ ప్లేయర్‌ నవోమీ!  -మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement