తొలి రెండు మ్యాచ్‌ల్లో అతి కష్టమ్మీద గట్టెక్కిన మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా మూడో రౌండ్‌లో మాత్రం ఆ అద్భుతం చేయలేకపోయింది.
డబుల్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న కాటరీనా సినియకోవాతో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్‌లలోనే చేతులెత్తేసిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్ వరుస సెట్‌లలో సెరెనాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శనివారం పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ... పదో సీడ్, మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) పోరాటం మూడో రౌండ్‌లోనే ముగిసింది. డబుల్స్ నంబర్‌వన్, సింగిల్స్‌లో 42వ ర్యాంకర్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ధాటికి ఒసాకా ఇంటిముఖం పట్టింది. 77 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సినియకోవా 6–4, 6–2తో ఒసాకాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 35వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 6–2, 7–5తో సెరెనాను బోల్తా కొట్టించింది. ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి, తర్వాతి రెండు సెట్‌లు గెలిచి నిలిచింది.
కానీ మూడో మ్యాచ్‌లో మాత్రం అది సాధ్యం కాలేదు. ఒసాకా దూకుడుకు పగ్గాలు వేస్తూ సినియకోవా తొలి సెట్‌లో ఒకసారి... రెండో సెట్‌లో రెండుసార్లు సర్వీస్ బ్రేక్ సాధించింది. మరోవైపు ఒసాకా ఏకంగా 38 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సినియకోవా సర్వీస్‌లో బ్రేక్ సాధించేందుకు ఏడు సార్లు అవకాశం వచ్చినా ఈ జపాన్ స్టార్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేదు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఇగా స్వియాటెక్ (పోలాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. హలెప్ 6–2, 6–1తో సురెంకో (ఉక్రెయిన్)పై, కీస్ 6–3, 6–7 (5/7), 6–4తో బ్లిన్‌కోవా (రష్యా)పై, స్వియాటెక్ 0–6, 6–3, 6–3తో మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో)పై గెలిచారు.
సీడెడ్ ఆటగాళ్ల జోరు...
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో కరుసో (ఇటలీ)పై, ఆరో సీడ్ సిట్సిపాస్ 7–5, 6–3, 6–7 (5/7), 7–6 (8/6)తో క్రాజినోవిచ్ (సెర్బియా)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 4–6, 6–2, 7–5తో పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)పై, ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–2, 4–6, 1–6, 6–2తో లాజోవిచ్ (సెర్బియా)పై, తొమ్మిదో సీడ్ ఫాగ్‌నిని 7–6 (7/5), 6–4, 4–6, 6–1తో అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా), మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎనిమిదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)–బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) జంట 0–6, 6–4, 3–6తో మూడో సీడ్ కబాల్–ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment