ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరో నేడు తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్ స్టార్ నయోమి ఒసాకాతో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే చాలు... ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది.
ఇక ఈ టోర్నీలో అయితే కఠినమైన ప్రత్యర్థుల్ని, దిగ్గజాన్ని ఓడించి మరీ తుదిపోరుకు చేరుకుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన జపాన్ స్టార్... సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనాకు చెక్ పెట్టింది. నేటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఒసాకానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు బ్రాడీ ఓడించిందంతా అనామక క్రీడాకారిణిలనే. 25 ఏళ్ల అమెరికన్‌కు అసలు ఫైనల్ చేరిన అనుభవమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment