ఏ లక్ష్యంతో న్యూయార్క్‌లో అడుగుపెట్టిందో ఆలక్ష్యాన్ని అందుకుంది జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా. కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి లేదా జాతి వివక్ష కారణంగా తమ ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయులకు ఒసాకా తన విజయంతో ఘనమైన నివాళులు అర్పించింది. పోలీసుల చేతుల్లో లేదంటే జాతి వివక్ష కారణంగా మరణించిన పలువురు నల్లజాతీయుల్లో ఏడుగురిని (ఏడు రౌండ్‌లలో గెలిస్తే విజేత అవుతారు) ఎంచుకున్న ఒసాకా ఆ ఏడుగురి పేర్లు రాసి ఉన్న మాస్క్‌లను ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడతానని... ఆ ఏడుగురికీ నివాళులు ఇవ్వాలంటే టైటిల్ గెలవాల్సి ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే ప్రతి మ్యాచ్‌లో ఒక్కో బాధితుడి పేరు రాసి ఉన్న మాస్క్‌ను ధరించి ఆడింది. ఆఖరికి తన వద్ద ఉన్న చివరిదైన ఏడో మాస్క్‌ను ధరించి ఆడి విజేతగా నిలిచింది. తాను అనుకున్న రెండు లక్ష్యాలనూ సాధించి ఒసాకా ఔరా అనిపించింది. మరో వైపు యూఎస్ ఓపెన్ ఫైనల్లో మూడో సారి ఓడిన అజరెంకా తీవ్ర నిరాశతో వెనుదిరిగింది.
న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా ఆడిన జపాన్ యువతార నయోమి ఒసాకా తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగో సీడ్ ఒసాకా చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 22 ఏళ్ల ఒసాకా గంటా 53 నిమిషాల్లో 1–6, 6–3, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 27వ ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఒసాకా కెరీర్‌లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆమె 2018లోనూ చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంకాకు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొలి సెట్ కోల్పోయినా...
26 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో నెగ్గిన అజరెంకా ఆ తర్వాత రెండో సెట్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అజరెంకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఉంటే సెట్‌తోపాటు, మ్యాచ్‌నూ సొంతం చేసుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడేది. కానీ ఒసాకా అలా జరగనీయలేదు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్‌లో 0–2తో వెనుకబడి... మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌లో 30–40తో గేమ్‌ను కోల్పోయే దశ నుంచి ఒసాకా కోలుకుంది. గేమ్ కోల్పోయే స్థితి నుంచి తేరుకున్న ఒసాకా మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–2తో స్కోరును సమం చేసింది.
అనంతరం అదే జోరులో ఒసాకా రెండో సెట్‌ను 41 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్ నాలుగో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జపాన్ అమ్మాయి తన సర్వీస్‌ను కాపాడుకొని 4–1తో ముందంజ వేసింది. అయితే అజరెంకా కూడా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఏడో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అజరెంకా ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. అయితే ఒసాకా వెంటనే ఎనిమిదో గేమ్‌లోనే అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌నూ కాపాడుకొని 46 నిమిషాల్లో మూడో సెట్‌ను కైవసం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది.
ఆ ఏడుగురు...
అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్ష పట్ల ఓ క్రీడాకారిణిగా నయోమి యూఎస్ ఓపెన్‌లో అద్భుత రీతిలో స్పందించింది. కొన్నేళ్లుగా పోలీసుల చేతుల్లో బలైన నల్ల జాతీయుల్లో ఏడుగురిని ఎంచుకొని వారి పేర్లను తన మాస్క్‌పై రాసుకొని మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత వాటిని ధరించి సంఘీభావం తెలిపింది. తొలి రౌండ్‌లో బ్రెనా టేలర్... రెండో రౌండ్‌లో ఎలిజా మెక్లెయిన్... మూడో రౌండ్‌లో జార్జి ఫ్లాయిడ్... నాలుగో రౌండ్‌లో అహెమౌద్ ఆర్బెరీ... క్వార్టర్ ఫైనల్లో ట్రెవన్ మార్టిన్... సెమీఫైనల్లో ఫిలాండో క్యాజిల్ బాధితుల పేర్లు రాసి ఉన్న మాస్క్‌లు ధరించిన ఒసాకా... ఫైనల్లో మాత్రం 2014లో క్లీవ్‌లాండ్‌లో పోలీసుల చేతుల్లో చనిపోయిన 12 ఏళ్ల బాలుడు తామిర్ రైస్‌కు నివాళిగా మాస్క్‌ను ధరించింది.
తమను వీడి వెళ్లిపోయిన వారిని ఒసాకా మరోసారి గుర్తు చేసిందని ఈ సందర్భంగా ఆయా బాధితుల తల్లిదండ్రులు జపాన్ క్రీడాకారిణిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. నయోమి ఒసాకా తల్లి తమాకి జపాన్ దేశస్థురాలు కాగా తండ్రి లెనార్డ్ ఫ్రాన్సువా హైతీ దేశానికి చెందిన వ్యక్తి. ఒసాకా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్నా నయోమి జపాన్ పౌరసత్వం కలిగి ఉంది. తనను అమెరికన్‌గా కాకుండా జపనీయురాలిగానే గుర్తించాలని నయోమి కోరుకుంటోంది.
‘గొప్ప క్రీడాకారులందరూ ఫైనల్లో గెలిచిన వెంటనే కోర్టులో పడిపోయి ఆకాశంవైపు ఎందుకు చూసేవారో ఆలోచించేదాన్ని. వాళ్లకేమి కనిపించేదో తెలుసుకోవాలని గెలిచిన వెంటనే నేనూ అలాగే చేశాను. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడ్డాను. శ్రమకు తగ్గ ఫలితం ఎందుకు రాకూడదో ప్రయత్నించి సఫలమయ్యాను. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్‌లో వెనుకబడిన దశలో ఆందోళన చెందకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించాను. నేనిక్కడ ఒక లక్ష్యంతో వచ్చాను. ఫైనల్‌కు వచ్చినందుకు 1–6, 0–6తో ఓడిపోయి ఇంటికి వెళ్లకూడదని అనుకున్నాను.’ – నయోమి ఒసాకా
► 3 ఆసియా నుంచి మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) నయోమి ఒసాకా. నా లీ (చైనా) రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది.
► 1 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక టాప్–20 క్రీడాకారిణులను ఎదుర్కోకుండా యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణి ఒసాకానే.
► 5 తమ కెరీర్‌లో ఫైనల్ చేరుకున్న తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ గెలిచిన ఐదో క్రీడాకారిణి ఒసాకా. మోనికా సెలెస్ అయితే వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది.
► 3 యూఎస్ ఓపెన్ ఫైనల్లో అత్యధికంగా మూడుసార్లు ఓడిపోయిన రెండో క్రీడాకారిణి అజరెంకా. ఇవాన్ గూలాగాంగ్ (ఆస్ట్రేలియా) అత్యధికంగా నాలుగు యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment