సెమీస్‌లో ఓడిన ముచొవా, నవారో
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది.
భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్‌తోనే ముగిసింది.
రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్‌స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది.
తొలి సెట్ కోల్పోయినా...
క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది.
తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్‌లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్‌తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను వశం చేసుకుంది. రెండో సెట్‌లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది.
కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది.
సబలెంక జోరు
మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్‌లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్‌లో చతికిలబడింది. తొలిసెట్‌ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్‌లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది.
అయితే టై బ్రేక్‌లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్‌లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment