సూపర్‌ జ్వెరెవ్‌ | Alexander Zverev Reaches First Time Into Final In US Open Grand Slam | Sakshi
Sakshi News home page

సూపర్‌ జ్వెరెవ్‌

Published Sun, Sep 13 2020 2:46 AM | Last Updated on Sun, Sep 13 2020 3:36 AM

Alexander Zverev Reaches First Time Into Final In US Open Grand Slam - Sakshi

మూడేళ్ల క్రితం జర్మనీ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రపంచ మూడో ర్యాంకర్‌గా ఎదిగిన సమయంలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో నయా తార అవతరించాడని టెన్నిస్‌ క్రీడా పండితులు విశ్లేషించారు. కానీ గత మూడేళ్లలో 23 ఏళ్ల జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరి తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఏడు నెలలు తిరిగేలోపు జ్వెరెవ్‌ మరో మెట్టు ఎక్కాడు.

తన అత్యుత్తమ ‘గ్రాండ్‌’ సెమీస్‌ ప్రదర్శనను సవరించి ఈసారి ఏకంగా ‘గ్రాండ్‌’గా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు కేవలం విజయం దూరంలో నిలిచాడు. మరోవైపు మూడేళ్లుగా ‘బిగ్‌ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్‌ నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆస్ట్రియా స్టార్‌ డొమినిక్‌ థీమ్‌ తన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కలను సాకారం చేసుకోవడానికి నాలుగోసారి సిద్ధమయ్యాడు. జ్వెరెవ్, థీమ్‌ మధ్య ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరిస్తారు.

న్యూయార్క్‌: తమ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కలను నిజం చేసుకోవడానికి పురుషుల టెన్నిస్‌ భవిష్యత్‌ ఆశాకిరణాలు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) ఒక్క విజయం దూరంలో నిలిచారు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో ఐదో సీడ్‌ జ్వెరెవ్‌ 3 గంటల 23 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–3తో 20వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై, రెండో సీడ్‌ థీమ్‌ 2 గంటల 55 నిమిషాల్లో 6–2, 7–6 (9/7), 7–6 (7/5)తో గత ఏడాది రన్నరప్, మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)పై గెలుపొందారు. ముఖాముఖి రికార్డులో థీమ్‌ 7–2తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల్లో మూడు సార్లు తలపడగా... మూడు సార్లూ్ల థీమ్‌నే విజయం వరించింది.

రెండు సెట్‌లు చేజార్చుకొని... 
కరెనో బుస్టాతో జరిగిన సెమీఫైనల్లో జ్వెరెవ్‌ తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న దశలో పుంజుకున్నాడు. శక్తిమంతమైన సర్వీస్‌లతో, పదునైన రిటర్న్‌ షాట్‌లతో ఒక్కసారిగా విజృంభించాడు. మూడో సెట్‌లోని నాలుగో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ నెగ్గాడు. నాలుగో సెట్‌లోని ఏడో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఈ జర్మనీ యువతార 4–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 6–4తో సెట్‌ను గెల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్‌లోనూ జ్వెరెవ్‌ నియంత్రణ కోల్పోకుండా ఆడాడు.

తొలి గేమ్‌లో, ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో బుస్టా సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  జ్వెరెవ్‌ తన కెరీర్‌లో తొలిసారి వరుసగా తొలి రెండు సెట్‌లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే ప్రథమం. మ్యాచ్‌ మొత్తంలో 24 ఏస్‌లు సంధించాడు. 8 డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 57 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే 71 విన్నర్స్‌ కొట్టడం, నెట్‌ వద్దకు 50 సార్లు దూసుకొచ్చి 37 సార్లు పాయింట్లు గెలవడం, ఎనిమిది బ్రేక్‌ పాయింట్లు సంపాదించడం జ్వెరెవ్‌కు విజయాన్ని అందించాయి.

తడబడి... నిలబడి...
ఇప్పటికే మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓడిపోయిన డొమినిక్‌ థీమ్‌ ఈసారి ఎలాగైనా విన్నర్స్‌ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. గతేడాది రన్నరప్‌ మెద్వెదేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో థీమ్‌ ఆటలో ఇది స్పష్టంగా కనిపించింది. రెండో సెట్‌లో, మూడో సెట్‌లో సెట్‌ పాయింట్లు కాపాడుకున్న విధానం అతని సానుకూల దృక్పథాన్ని సూచిస్తోంది. రెండో సెట్‌లో మెద్వెదేవ్‌ తన సర్వీస్‌లో 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు సర్వీస్‌ నిలబెట్టుకొని ఉంటే సెట్‌ గెలిచేవాడు. కానీ థీమ్‌ అతని సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించాడు. ఇక మూడో సెట్‌లో ఒకదశలో థీమ్‌ 2–5తో వెనుకబడ్డాడు. కానీ థీమ్‌ ఒత్తిడికి లోనుకాకుండా మెద్వెదేవ్‌ సర్వీస్‌ను తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. మళ్లీ టైబ్రేక్‌లో తన ఆధిపత్యం చాటుకొని గెలిచాడు.

సిగెముండ్‌–జ్వొనరేవా జంటకు ‘డబుల్స్‌
మహిళల డబుల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌  జోడీ లౌరా సిగెముండ్‌ (జర్మనీ)–వెరా జ్వొనరేవా (రష్యా) విజేతగా నిలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6–4, 6–4తో మూడో సీడ్‌ నికోల్‌ మెలికార్‌ (అమెరికా)–యిఫాన్‌ షు (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేత సిగెముండ్‌–జ్వొనరేవా ద్వయంకు 4,00,000 డాలర్లు (రూ. 2 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

6 యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు నెగ్గి ఫైనల్‌ చేరిన ఆరో క్రీడాకారుడు జ్వెరెవ్‌. గతంలో జొకోవిచ్‌ (2011లో ఫెడరర్‌పై); ఆండీ రాడిక్‌ (2003లో నల్బందియాన్‌పై); జాన్‌ బోర్గ్‌ (1980లో యోహాన్‌ క్రీక్‌పై); వైటస్‌‡ జెరులైటిస్‌ (1979లో రోస్కో ట్యానర్‌పై); మాన్యుయెల్‌ ఒరాంటెస్‌ (1975లో గిలెర్మో విలాస్‌పై) ఈ ఘనత సాధించారు.

2 ఫైనల్లో థీమ్‌ విజయం సాధిస్తే థామస్‌ ముస్టర్‌ (1995లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో ఆస్ట్రియా ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

26 యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో 26 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ గుర్తింపు పొందాడు. 1994లో చివరిసారి మైకేల్‌ స్టిచ్‌ రూపంలో జర్మనీ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్‌ చేరి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.

2 ఫైనల్లో జ్వెరెవ్‌ గెలిస్తే బొరిస్‌ బెకర్‌ (1989లో) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన రెండో జర్మనీ ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన జర్మనీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 1991లో చివరిసారి జర్మనీ క్రీడాకారులు బొరిస్‌ బెకర్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌), మైకేల్‌ స్టిచ్‌ (వింబుల్డన్‌) ఈ ఘనత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement