న్యూయార్క్: ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో తన అది్వతీయ ఫామ్‌ను కొనసాగిస్తూ వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–2, 6–4, 4–6, 6–2తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొమ్మిదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలు (53, 19, 22, 31, 16 షాట్‌లు) సాగాయి. అయితే కీలకదశలో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు.
ఈ సెర్బియా స్టార్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు జ్వెరెవ్ సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టినా, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ‘ఇంకొక్క మ్యాచే మిగిలి ఉంది. దానినీ జయిద్దాం. ఆ చివరి మ్యాచ్‌లో నా సర్వశక్తులూ ఒడ్డి పోరాడతా’ అని గతంలో మూడుసార్లు యూఎస్ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 6–4, 7–5, 6–2తో 12వ సీడ్ ఫిలిక్స్ ఉగర్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గి జొకోవిచ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో మెద్వెదేవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
పురుషుల టెన్నిస్ చరిత్రలో ఒకేరోజు రెండు రికార్డులు సృష్టించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోరీ్నలలో విజేతగా నిలిచిన జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధిస్తే... రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) 20 చొప్పున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు.
రాడుకాను చరిత్ర సృష్టించేనా?
మహిళల సింగిల్స్ విభాగంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు టీనేజర్లు, అన్‌సీడెడ్ క్రీడాకారిణులు లేలా ఫెర్నాండెజ్ (కెనడా–19 ఏళ్లు), ఎమ్మా రాడుకాను (బ్రిటన్–18 ఏళ్లు) టైటిల్ పోరుకు అర్హత పొందారు. సెమీఫైనల్స్‌లో లేలా ఫెర్నాండెజ్ 7–6 (7/3), 4–6, 6–4తో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రాడుకాను 6–1, 6–4తో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి తమ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరారు. ఓపెన్ శకంలో క్వాలిఫయర్ హోదాలో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా... వర్జీనియా వేడ్ (1977లో వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా రాడుకాను గుర్తింపు పొందింది. ఫైనల్లో లేలాపై రాడుకాను గెలిస్తే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
లేలా, రాడుకాను
Comments
Please login to add a commentAdd a comment