అనుభవం అద్భుతం చేసింది. నమ్మకం ముందుకు నడిపించింది. ఓటమి అంచుల నుంచి గట్టెక్కించింది. చివరకు విజేత హోదాలో ట్రోఫీని ముద్దాడేలా చేసింది. చరిత్ర పుటల్లోనూ స్థానం కల్పించింది. కెరీర్‌లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి మూడుసార్లూ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న ఆస్ట్రియా యోధుడు డొమినిక్ థీమ్ ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయ్యాడు.
కెరీర్‌లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తన మిత్రుడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సుదీర్ఘంగా సాగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో థీమ్ పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్‌లు ఓడిపోయి... మూడో సెట్‌లో ఆరంభంలోనే సర్వీస్ కోల్పోయి వెనుకబడిన థీమ్ ఆ తర్వాత అనూహ్య ఆటతీరుతో మ్యాచ్ గతిని మార్చేశాడు. చివరకు నిర్ణాయక సెట్‌లో ఒకదశలో 3–5తో ఓటమి అంచుల్లో నిలిచి ఆ వెంటనే కోలుకొని స్కోరును సమం చేసి చివరకు టైబ్రేక్‌లో విజయాన్ని అందుకున్నాడు. తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు.
న్యూయార్క్: ఒకదశలో నాలుగోసారి అందివచ్చిన ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం డొమినిక్ థీమ్ నుంచి చేజారిపోతుందా అనిపించింది. కానీ గత మూడు ‘గ్రాండ్’ ఫైనల్స్‌లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న థీమ్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా పైకి వచ్చాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయి... ఐదో సెట్‌లో 3–5తో వెనుకబడి... పరాజయం ముంగిట నిలిచిన ఈ ఆస్ట్రియా ఆటగాడు తన స్వశక్తిపై, తన ఆటతీరుపై నమ్మకం కోల్పోకుండా ఆఖరి పాయింట్ వరకు పోరాడితే పోయేదేమీ లేదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.
చివరకు చిరస్మరణీయ విజయంతో చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ డొమినిక్ థీమ్ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల థీమ్ 1949 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్ (అమెరికా) తన సహచరుడు టెడ్ ష్రోడెర్‌పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలైంది.
శుభారంభం లభించినా...
కెరీర్‌లో తొలి ‘గ్రాండ్’ ఫైనల్ ఆడుతున్న జ్వెరెవ్ తొలి గేమ్ నుంచే ఆకట్టుకున్నాడు. మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ తొలి సెట్ గెలిచేశాడు. రెండో సెట్‌లో మూడు, ఐదో గేముల్లో మళ్లీ థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన 23 ఏళ్ల జ్వెరెవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్ మూడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి జ్వెరెవ్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఆధిక్యాన్ని కాపాడుకొని ఉంటే చాంపియన్ అయ్యేవాడు.
కానీ థీమ్ నెమ్మదిగా తేరుకున్నాడు. మూడో సెట్‌ను, నాలుగో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తాను సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెట్‌ను 6–3తో నెగ్గి విజేతగా నిలిచేవాడు. కానీ జ్వెరెవ్ తొమ్మిదో గేమ్‌ను థీమ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్కోరు 6–6తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో థీమ్‌దే పైచేయిగా నిలిచింది.
► 5 ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి టైటిల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా థీమ్ నిలిచాడు. గతంలో గాస్టన్ గాడియో (గిలెర్మో కొరియాపై 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో); అగస్సీ (ఆండ్రీ మెద్వెదేవ్‌పై 1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో); ఇవాన్ లెండిల్ (మెకన్రోపై 1984 ఫ్రెంచ్ ఓపెన్‌లో); జాన్ బోర్గ్ (మాన్యుయెల్ ఒరాన్‌టెస్‌పై 1974 ఫ్రెంచ్ ఓపెన్‌లో) ఈ ఘనత సాధించారు.
► 1 1990 తర్వాత జన్మించి పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ థీమ్.
► 1 పురుషుల టెన్నిస్‌లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ల ఫైనల్ ఫలితాలు ఐదు సెట్‌లపాటు (2019 వింబుల్డన్; 2019 యూఎస్ ఓపెన్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) సాగిన మ్యాచ్‌ల ద్వారా వచ్చాయి.
► 2 థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ నిలిచాడు.
► 2 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఫైనల్లో టైబ్రేక్ ద్వారా ఫలితం రావడం ఇది రెండోసారి మాత్రమే. 2019 వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్‌పై జొకోవిచ్ టైబ్రేక్‌లో గెలిచాడు. వింబుల్డన్‌లో గతేడాదే చివరి సెట్‌లో స్కోరు 12–12 వద్ద సమం అయ్యాక ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు.
► 6 ఆరేళ్ల వ్యవధి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించాడు. చివరిసారి 2014 యూఎస్ ఓపెన్‌లో మారిన్ సిలిచ్ రూపంలో కొత్త విజేత వచ్చాడు. 2015 నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ముందు వరకు జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో జొకోవిచ్, నాదల్, ఫెడరర్, ఆండీ ముర్రే, వావ్రింకాలలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తూ వచ్చారు.
► 1 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ తొలిసారి తొలి రెండు సెట్‌లు గెలిచి ఆ తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలి సారి. గతంలో అతను తొలి రెండు సెట్‌లు గెలిచాక 24 సార్లు మ్యాచ్‌ల్లో నెగ్గాడు.
ఎలాగైతేనేం గట్టెక్కాను. ఫైనల్లో నా శరీరం ఒకదశలో అలసిపోయినా గెలుస్తానన్న నా నమ్మకమే చివరి వరకు నడిపించింది. తుది ఫలితంతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. 2014 నుంచి జ్వెరెవ్‌తో పరిచయం ఉంది. ఆ తర్వాత ఇద్దరం మంచి మిత్రులయ్యాం. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం. వాస్తవానికి ఫైనల్లో ఇద్దరు విజేతలు ఉండాల్సింది. మా ఇద్దరికీ టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా కెరీర్ కూడా ఫైనల్ మాదిరిగానే ఎత్తుపల్లాలతో సాగుతోంది. అయితే అంతిమ ఫలితం మాత్రం నాకు నచ్చింది. –డొమినిక్ థీమ్
తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన థీమ్‌కు అభినందనలు. అతను మరిన్ని తప్పిదాలు చేసి ఉంటే నా చేతిలో విన్నర్స్ ట్రోఫీ ఉండేది. కానీ నేను రన్నరప్ ట్రోఫీతో ప్రసంగిస్తున్నాను. టోర్నీ ప్రారంభానికి ముందు నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారు నా వెంట రాలేకపోయారు. అయితే వారు కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషంగా ఉన్నాను. తొలి రెండు సెట్‌లు గెలిచాక కూడా ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నాకింకా 23 ఏళ్లే కాబట్టి భవిష్యత్‌లో తప్పకుండా నేను కూడా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఎత్తుకుంటానన్న నమ్మకం ఉంది. –అలెగ్జాండర్ జ్వెరెవ్
Comments
Please login to add a commentAdd a comment