Dominic Thiem
-
యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న థీమ్
డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్ నంబర్ 6 యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ బుడాపెస్ట్ (హంగేరీ)లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 150వ ర్యాంకర్ శ్రీజ 11–9, 11–6, 13–11తో ప్రపంచ 53వ ర్యాంకర్ బార్బొరా బలజోవా (స్లొవాక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన వరల్డ్ 60వ ర్యాంకర్ మనికా బాత్రాతో తలపడుతుంది. -
French Open: థీమ్‌కు షాక్...
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ పెను సంచలనంతో ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు రన్నరప్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల పాబ్లో అందుహర్ అసమాన పోరాటపటిమ కనబరిచి 4 గంటల 28 నిమిషాల్లో 4–6, 5–7, 6–3, 6–4, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ థీమ్‌ను బోల్తా కొట్టించాడు. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల థీమ్ ఈ టోర్నీ తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2016, 2017లలో సెమీఫైనల్ చేరిన థీమ్... 2018, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. థీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన ప్రపంచ 68వ ర్యాంకర్ పాబ్లో ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన పాబ్లో... థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో థీమ్ ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 61 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు కెరీర్లో 37వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న పాబ్లో తొలి రెండు సెట్లు ఓడిపోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 27వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ), కీ నిషికోరి (జపాన్), 11వ సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఒసాకాపై 15 వేల డాలర్ల జరిమానా మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఒసాకా 6–4, 7–6 (7/4)తో పాట్రిసియా మరియా టిగ్ (రొమేనియా)ను ఓడించింది. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లు ముగిశాక మీడియా సమావేశాలకు హాజరుకానని ప్రకటించిన ఒసాకా అలాగే చేసింది. తొలి రౌండ్లో గెలిచిన తర్వాత ఆమె మీడియా సమావేశానికి గైర్హాజరయింది. దాంతో టోర్నీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఒసాకాపై 15 వేల డాలర్ల (రూ. 10 లక్షల 86 వేలు) జరిమానా విధించారు. ఆమె గెలిచిన ప్రైజ్‌మనీలో నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. కెర్బర్ ఓటమి మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 26వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లో 2–6, 4–6తో కలినీనా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (3/7), 7–6 (7/5), 6–1తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై... మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–3తో అనా కొంజు (క్రొయేషియా)పై గెలిచారు. -
తక ధిమి థీమ్...
అనుభవం అద్భుతం చేసింది. నమ్మకం ముందుకు నడిపించింది. ఓటమి అంచుల నుంచి గట్టెక్కించింది. చివరకు విజేత హోదాలో ట్రోఫీని ముద్దాడేలా చేసింది. చరిత్ర పుటల్లోనూ స్థానం కల్పించింది. కెరీర్లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి మూడుసార్లూ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న ఆస్ట్రియా యోధుడు డొమినిక్ థీమ్ ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయ్యాడు. కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తన మిత్రుడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సుదీర్ఘంగా సాగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో థీమ్ పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లు ఓడిపోయి... మూడో సెట్లో ఆరంభంలోనే సర్వీస్ కోల్పోయి వెనుకబడిన థీమ్ ఆ తర్వాత అనూహ్య ఆటతీరుతో మ్యాచ్ గతిని మార్చేశాడు. చివరకు నిర్ణాయక సెట్లో ఒకదశలో 3–5తో ఓటమి అంచుల్లో నిలిచి ఆ వెంటనే కోలుకొని స్కోరును సమం చేసి చివరకు టైబ్రేక్‌లో విజయాన్ని అందుకున్నాడు. తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. న్యూయార్క్: ఒకదశలో నాలుగోసారి అందివచ్చిన ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం డొమినిక్ థీమ్ నుంచి చేజారిపోతుందా అనిపించింది. కానీ గత మూడు ‘గ్రాండ్’ ఫైనల్స్‌లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న థీమ్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా పైకి వచ్చాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి... ఐదో సెట్లో 3–5తో వెనుకబడి... పరాజయం ముంగిట నిలిచిన ఈ ఆస్ట్రియా ఆటగాడు తన స్వశక్తిపై, తన ఆటతీరుపై నమ్మకం కోల్పోకుండా ఆఖరి పాయింట్ వరకు పోరాడితే పోయేదేమీ లేదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. చివరకు చిరస్మరణీయ విజయంతో చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ డొమినిక్ థీమ్ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల థీమ్ 1949 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్ (అమెరికా) తన సహచరుడు టెడ్ ష్రోడెర్పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలైంది. శుభారంభం లభించినా... కెరీర్లో తొలి ‘గ్రాండ్’ ఫైనల్ ఆడుతున్న జ్వెరెవ్ తొలి గేమ్ నుంచే ఆకట్టుకున్నాడు. మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ తొలి సెట్ గెలిచేశాడు. రెండో సెట్లో మూడు, ఐదో గేముల్లో మళ్లీ థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన 23 ఏళ్ల జ్వెరెవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్ మూడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి జ్వెరెవ్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఆధిక్యాన్ని కాపాడుకొని ఉంటే చాంపియన్ అయ్యేవాడు. కానీ థీమ్ నెమ్మదిగా తేరుకున్నాడు. మూడో సెట్‌ను, నాలుగో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తాను సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెట్‌ను 6–3తో నెగ్గి విజేతగా నిలిచేవాడు. కానీ జ్వెరెవ్ తొమ్మిదో గేమ్‌ను థీమ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్కోరు 6–6తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో థీమ్‌దే పైచేయిగా నిలిచింది. ► 5 ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా థీమ్ నిలిచాడు. గతంలో గాస్టన్ గాడియో (గిలెర్మో కొరియాపై 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో); అగస్సీ (ఆండ్రీ మెద్వెదేవ్పై 1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో); ఇవాన్ లెండిల్ (మెకన్రోపై 1984 ఫ్రెంచ్ ఓపెన్‌లో); జాన్ బోర్గ్ (మాన్యుయెల్ ఒరాన్టెస్పై 1974 ఫ్రెంచ్ ఓపెన్‌లో) ఈ ఘనత సాధించారు. ► 1 1990 తర్వాత జన్మించి పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ థీమ్. ► 1 పురుషుల టెన్నిస్‌లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ల ఫైనల్ ఫలితాలు ఐదు సెట్లపాటు (2019 వింబుల్డన్; 2019 యూఎస్ ఓపెన్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) సాగిన మ్యాచ్‌ల ద్వారా వచ్చాయి. ► 2 థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ నిలిచాడు. ► 2 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఫైనల్లో టైబ్రేక్ ద్వారా ఫలితం రావడం ఇది రెండోసారి మాత్రమే. 2019 వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్‌పై జొకోవిచ్ టైబ్రేక్‌లో గెలిచాడు. వింబుల్డన్‌లో గతేడాదే చివరి సెట్లో స్కోరు 12–12 వద్ద సమం అయ్యాక ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. ► 6 ఆరేళ్ల వ్యవధి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించాడు. చివరిసారి 2014 యూఎస్ ఓపెన్‌లో మారిన్ సిలిచ్ రూపంలో కొత్త విజేత వచ్చాడు. 2015 నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ముందు వరకు జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో జొకోవిచ్, నాదల్, ఫెడరర్, ఆండీ ముర్రే, వావ్రింకాలలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తూ వచ్చారు. ► 1 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ తొలిసారి తొలి రెండు సెట్లు గెలిచి ఆ తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలి సారి. గతంలో అతను తొలి రెండు సెట్లు గెలిచాక 24 సార్లు మ్యాచ్‌ల్లో నెగ్గాడు. ఎలాగైతేనేం గట్టెక్కాను. ఫైనల్లో నా శరీరం ఒకదశలో అలసిపోయినా గెలుస్తానన్న నా నమ్మకమే చివరి వరకు నడిపించింది. తుది ఫలితంతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. 2014 నుంచి జ్వెరెవ్‌తో పరిచయం ఉంది. ఆ తర్వాత ఇద్దరం మంచి మిత్రులయ్యాం. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం. వాస్తవానికి ఫైనల్లో ఇద్దరు విజేతలు ఉండాల్సింది. మా ఇద్దరికీ టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా కెరీర్ కూడా ఫైనల్ మాదిరిగానే ఎత్తుపల్లాలతో సాగుతోంది. అయితే అంతిమ ఫలితం మాత్రం నాకు నచ్చింది. –డొమినిక్ థీమ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన థీమ్‌కు అభినందనలు. అతను మరిన్ని తప్పిదాలు చేసి ఉంటే నా చేతిలో విన్నర్స్ ట్రోఫీ ఉండేది. కానీ నేను రన్నరప్ ట్రోఫీతో ప్రసంగిస్తున్నాను. టోర్నీ ప్రారంభానికి ముందు నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారు నా వెంట రాలేకపోయారు. అయితే వారు కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషంగా ఉన్నాను. తొలి రెండు సెట్లు గెలిచాక కూడా ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నాకింకా 23 ఏళ్లే కాబట్టి భవిష్యత్‌లో తప్పకుండా నేను కూడా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఎత్తుకుంటానన్న నమ్మకం ఉంది. –అలెగ్జాండర్ జ్వెరెవ్ -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చరిత్ర
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రీడాకారుడు, రెండో సీడ్ డొమనిక్ థీమ్ చాంపియన్‌గా నిలిచాడు. భారతకాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో థీమ్ 2-6, 4-6, 6-4, 6-3, 7-6(8/6) తేడాతో జర్మనీ ప్లేయర్, ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలిచి యూఎస్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది థీమ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయిన థీమ్.. ఈసారి మాత్రం టైటిల్‌ను సాధించే వరకూ వదిలిపెట్టలేదు. తొలి రెండు సెట్లను కోల్పోయినా ఇక మిగతా మూడు సెట్లను తన ఖాతాలో వేసుకుని ట్రోఫీని ముద్దాడాడు.(చదవండి: నమో నయోమి) ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన థీమ్.. అంతకుముందు 2018, 2019ల్లో ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. అయితే ఈసారి టైటిల్‌ను సాధించే వరకు థీమ్ తన పోరాటాన్ని ఆపలేదు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడ్డ సమయంలో థీమ్ ఇరగదీశాడు. ప్రత్యర్థి జ్వెరెవ్ నుంచి అద్భుతమైన ఏస్‌లో దూసుకొస్తున్నా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కో గేమ్‌ను కైవసం చేసుకుంటూ వరుసగా రెండు సెట్లను గెలిచాడు.ఆపై చివరిసెట్ను టైబ్రేక్‌లో గెలిచి టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో ఒక ఆటగాడు తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత తేరుకుని టైటిల్ గెలవడం ఆ టోర్నీ ఓపెన్ ఎరాలో ఇదే తొలిసారి. ఫలితంగా థీమ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐదో సెట్లో హోరాహోరీ టైటిల్ నిర్ణయాత్మక ఐదో సెట్లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఇరువురు సమానంగా గేమ్‌లను గెలుచుకుంటూ స్కోరును కాపాడుకుంటూ వచ్చారు. దాంతో మ్యాచ్ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. ట్రైబ్రేకర్‌లో ఎనిమిది పాయింట్లతో ముందంజ వేసిన థీమ్.. జ్వెరెవ్‌ను ఆరు పాయింట్లకు పరిమితం చేసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఇక తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి చేరి టైటిల్ సాధిద్దామనుకున్న జ్వెరెవ్‌కు ఆశలకు బ్రేక్ పడింది. ఇరువురి మధ్య నాలుగు గంటలకు పైగా సాగిన పోరాటంలో చివరకు థీమ్ పైచేయి సాధించి ప్రతిష్టాత్మక ట్రోఫీని దక్కించుకున్నాడు. -
సరిలేరు నీకెవ్వరు!
ఎర్రమట్టి కోర్టులపై తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. టెన్నిస్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో 12వసారి సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గతేడాది ఫలితమే పునరావృతం అయింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ డొమినిక్ థీమ్‌ను ఓడించి నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. ఎలాంటి అద్భుతం జరగలేదు. మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు తానేనని రాఫెల్ నాదల్ మళ్లీ చాటి చెప్పాడు. ఈ స్పెయిన్ స్టార్ రికార్డుస్థాయిలో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ 6–3, 5–7, 6–1, 6–1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ తుది సమరంలో నాదల్ మూడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతడు 31 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు థీమ్ ఏడు ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీసును రెండుసార్లు బ్రేక్ చేయగలిగాడు. 31 విన్నర్స్ కొట్టిన అతడు 38 అనవసర తప్పిదాలు చేశాడు. విజేత రాఫెల్ నాదల్కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వేర్వేరు టోర్నమెంట్లలో నాలుగుసార్లు క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన రికార్డు కలిగిన డొమినిక్ థీమ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నాడు. గతేడాది వరుసగా మూడు సెట్లలో ఓడిపోయిన థీమ్‌కు ఈసారి మాత్రం ఒక సెట్‌ను గెలిచిన సంతృప్తి మిగిలింది. ఫైనల్ తొలి సెట్లో థీమ్ ఐదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ వెంటనే థీమ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మరోసారి థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఆఖరికి 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి థీమ్ సెట్‌ను 7–5తో దక్కించుకున్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న నాదల్ ఒక్కసారిగా విజృంభించాడు. థీమ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పూర్తి నియంత్రణతో ఆడుతూ మూడో సెట్లో ఒక గేమ్, నాలుగో సెట్లో ఒక గేమ్ కోల్పోయి గెలుపు ఖాయం చేసుకున్నాడు. ►1 టెన్నిస్ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో ఈ రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు. ►6 నాదల్ 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019) సాధించగా.... ఆరుసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్, థీమ్‌లపై రెండుసార్లు, రాబిన్ సోడెర్లింగ్, మరియానో పుయెర్టా, డేవిడ్ ఫెరర్, వావ్రింకాలపై ఒక్కోసారి గెలిచాడు. ►93 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. బరిలోకి దిగాక కేవలం రెండుసార్లు మాత్రమే నాదల్ (2009లో సోడెర్లింగ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లో; 2015లో జొకోవిచ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో) ఓడిపోయాడు. ►18 ఓవరాల్‌గా నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (12 ఫ్రెంచ్; 3 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్). అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు ఫెడరర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో 82 టైటిల్స్ సాధించాడు. 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకుంటున్న అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఫైనల్లో ఓడిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసు. ఏనాటికైనా నువ్వు (థీమ్) ఈ టైటిల్ సాధిస్తావు. – నాదల్ -
సెరెనా వచ్చింది... అయితే నాకేంటి!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల అత్యుత్సాహంపై ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఓ స్టార్ క్రీడాకారిణి వచ్చినంత మాత్రాన నా మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించుకొని వెళ్లాలా’ అని తీవ్ర స్థాయిలో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే... నాలుగో సీడ్ థీమ్ మూడో రౌండ్ గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. మ్యాచ్ అనంతరం ప్రధాన మీడియా హాల్లో అతను విలేకర్లతో ముచ్చటిస్తున్నాడు. మరోవైపు అమెరికన్ స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లో ఓడిపోయింది. మీడియా సమావేశం కోసం ఆ హాల్ దగ్గర వేచి ఉంది. దీంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా కోసం నిర్వాహకులు... థీమ్ విలేకర్లతో ముచ్చటిస్తుంటే త్వరగా ముగించుకొని వెళ్లాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. వెంటనే థీమ్ దీటుగా స్పందిస్తూ ‘ఏంటీ జోకా... ఆమె వచ్చిందని నన్ను ఉన్న పళంగా హాల్ ఖాళీ చేసి వెళ్లమంటారా? ఏంటి ఈ చోద్యం. నేను ముగించను. ఇక్కడి నుంచి వెళ్లను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని తీవ్ర స్థాయిలో స్పందించాడు. విషయం తెలుసుకున్న సెరెనా తనకు ప్రధాన హాల్ లేకపోయినా పర్లేదు ఏదో గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్వాహకులతో చెప్పింది. దీనిపై పలువురు దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు థీమ్‌ను వెనకేసుకొచ్చారు. మాజీ చాంపియన్ ఫెడరర్ మాట్లాడుతూ ‘థీమ్ అసహనానికి అర్థముంది. ఆగ్రహం వ్యక్తం చేయడానికి హక్కూ వుంది’ అని అన్నాడు. -
నాదల్... 11వ సారి ఫైనల్‌కు
పారిస్: మట్టి కోర్టులపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ నాదల్ 6–4, 6–1, 6–2తో ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. ఈ క్రమంలో రోజర్ ఫెడరర్ (11–వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రికార్డుస్థాయిలో 11వసారి ఫైనల్ చేరిన రెండో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. డెల్‌పొట్రోతో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో నాదల్కు తొలి సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అందివచ్చిన అవకాశాలను డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాదల్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డెల్‌పొట్రో వినియోగించుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో నాదల్ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీఫైనల్లో థీమ్ 7–5, 7–6 (12/10), 6–1తో సెచి నాటో (ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన సెచినాటో అదే జోరును కనబర్చలేకపోయాడు. 1995లో థామస్ ముస్టర్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాక మరో ఆస్ట్రియా ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. థీమ్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్ 6–3తో ఆధిక్యం లో ఉన్నాడు. అయితే థీమ్ చేతిలో నాదల్ ఓడిపోయిన మూడు మ్యాచ్‌లూ క్లే కోర్టులపైనే కావడం గమనార్హం. -
రామ్‌కుమార్ సంచలనం
ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌పై గెలుపు అంటాల్యా (టర్కీ): భారత యువ టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. అంటాల్యా ఓపెన్ ఏటీపీ గ్రాస్‌కోర్టు టోర్నమెంట్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, టాప్ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై రామ్‌కుమార్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 222వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 6–2తో థీమ్‌ను మట్టికరిపించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో రామ్‌కుమార్ 6–3, 6–4తో ప్రపంచ 68వ ర్యాంకర్ రొగెరియో దుత్రా సిల్వా (బ్రెజిల్)ను ఓడించాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం 3–6, 7–5, 11–9తో వెస్లీ కూల్‌హాఫ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు లండన్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో జరుగుతున్న ఎగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) జంట తమ ప్రత్యర్థి ఒస్టాపెంకో (లాత్వియా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీకి వాకోవర్ ఇచ్చింది.