ఎర్రమట్టి కోర్టులపై తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. టెన్నిస్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో 12వసారి సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గతేడాది ఫలితమే పునరావృతం అయింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ డొమినిక్ థీమ్‌ను ఓడించి నాదల్ చాంపియన్‌గా నిలిచాడు.
పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. ఎలాంటి అద్భుతం జరగలేదు. మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు తానేనని రాఫెల్ నాదల్ మళ్లీ చాటి చెప్పాడు. ఈ స్పెయిన్ స్టార్ రికార్డుస్థాయిలో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ 6–3, 5–7, 6–1, 6–1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ తుది సమరంలో నాదల్ మూడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతడు 31 అనవసర తప్పిదాలు చేశాడు.
మరోవైపు థీమ్ ఏడు ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీసును రెండుసార్లు బ్రేక్ చేయగలిగాడు. 31 విన్నర్స్ కొట్టిన అతడు 38 అనవసర తప్పిదాలు చేశాడు. విజేత రాఫెల్ నాదల్‌కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వేర్వేరు టోర్నమెంట్‌లలో నాలుగుసార్లు క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన రికార్డు కలిగిన డొమినిక్ థీమ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నాడు. గతేడాది వరుసగా మూడు సెట్‌లలో ఓడిపోయిన థీమ్‌కు ఈసారి మాత్రం ఒక సెట్‌ను గెలిచిన సంతృప్తి మిగిలింది. ఫైనల్ తొలి సెట్‌లో థీమ్ ఐదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
కానీ వెంటనే థీమ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మరోసారి థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఆఖరికి 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి థీమ్ సెట్‌ను 7–5తో దక్కించుకున్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న నాదల్ ఒక్కసారిగా విజృంభించాడు. థీమ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పూర్తి నియంత్రణతో ఆడుతూ మూడో సెట్‌లో ఒక గేమ్, నాలుగో సెట్‌లో ఒక గేమ్ కోల్పోయి గెలుపు ఖాయం చేసుకున్నాడు.
►1 టెన్నిస్ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో ఈ రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు.
►6 నాదల్ 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019) సాధించగా.... ఆరుసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్, థీమ్‌లపై రెండుసార్లు, రాబిన్ సోడెర్లింగ్, మరియానో పుయెర్టా, డేవిడ్ ఫెరర్, వావ్రింకాలపై ఒక్కోసారి గెలిచాడు.
►93 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. బరిలోకి దిగాక కేవలం రెండుసార్లు మాత్రమే నాదల్ (2009లో సోడెర్లింగ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లో; 2015లో జొకోవిచ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో) ఓడిపోయాడు.
►18 ఓవరాల్‌గా నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (12 ఫ్రెంచ్; 3 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్). అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు ఫెడరర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో 82 టైటిల్స్ సాధించాడు.
12వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకుంటున్న అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఫైనల్లో ఓడిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసు. ఏనాటికైనా నువ్వు (థీమ్) ఈ టైటిల్ సాధిస్తావు.
– నాదల్
Comments
Please login to add a commentAdd a comment