వేదిక అదే. ప్రత్యర్థి మారాడంతే. తుది ఫలితం మాత్రం యథాతథం. ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. 36 ఏళ్ల వయస్సులో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 14వ సారి విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. 2005లో తన 19 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన నాదల్ 17 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో, అదే విజయకాంక్షతో బరిలోకి దిగి తన గెలుపు పాట వినిపించాడు.
ఫైనల్ చేరేలోపు తనను ఓడించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను హోరాహోరీ పోరాటాల్లో ఇంటిదారి పట్టించిన ఈ స్పెయిన్ సూపర్‌స్టార్ తుది సమరంలో మాత్రం చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న నార్వే ప్లేయర్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌ను నాదల్ హడలెత్తించాడు. రూడ్‌కు కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయిన నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించేసి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు.
పారిస్: మట్టికోటలో మహరాజు... నభూతో నభవిష్యత్... సరిలేరు నీకెవ్వరు... నమో నమః... ‘గ్రాండ్ సలాం’.. ఇంకా ఏమైనా విశేషణాలు ఉన్నాయంటే వాటిని కూడా స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌కు జత చేయాల్సిందే. ఒకవైపు తమ కెరీర్ మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడకుండానే.. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే కెరీర్‌ను ముగించేసిన టెన్నిస్ ఆటగాళ్లెందరో ఉంటే... మరోవైపు నాదల్ మాత్రం ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్‌ను ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... మూడుసార్లు కాదు... ఏకంగా 14సార్లు గెలిచి అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాఫెల్ నాదల్ ఆదివారం ఈ జాబితాలో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో 6–3, 6–3, 6–0తో గెలిచాడు.
తద్వారా ఫ్రెంచ్ ఓపెన్‌ను 14వసారి సొంతం చేసుకోవడంతోపాటు తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన 14 సార్లూ నాదలే గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఏకపక్షంగా...
ఫైనల్ చేరే క్రమంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచిన నాదల్‌కు ఫైనల్లో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన నాదల్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదిసార్లు రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 37 విన్నర్స్ కొట్టిన నాదల్ కేవలం 18 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రూడ్ 16 విన్నర్స్ కొట్టి, 26 అనవసర తప్పిదాలు చేశాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..!
Find someone who looks at you the way Rafa looks at the Coupe des Mousquetaires 🥰#RolandGarros pic.twitter.com/2ajSJ4aPyb
— Roland-Garros (@rolandgarros) June 5, 2022
Comments
Please login to add a commentAdd a comment