అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ పాపులర్ డైలాగ్‌కు రఫేల్ నాదల్ ఓ ఉదాహరణ. 19 ఏళ్ళ టీనేజ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఎర్రమట్టి కోర్టులో నాదల్ తొలిసారి అడుగుపెట్టినప్పుడు ఆ టెన్నిస్ అద్భుతాన్ని ముందే ఎంత మంది పసిగట్టారో తెలియదు కానీ, 36వ ఏట రికార్డుల ఆసామిగా మారిన ఇవాళ ఆయన గురించి ఎవరికీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. పట్టుదల, క్రమశిక్షణ ఆలంబనగా 2005లో మొదలైన ఆ మేజిక్ మొన్న ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ కొనసాగడం అభిమానులకు మరపు రాని అనుభవం. 2010 నుంచి వరుసగా రెండు గ్రాండ్ స్లామ్‌లు గెలవని రఫా తన 36వ ఏట తన సొగసైన ఆటతీరులో ఆ విన్యాసం చేసి చూపారు. వేధిస్తున్న ఎడమ పాదపు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు తీసుకొని మరీ గత రెండువారాల్లో 7 మ్యాచ్‌లాడారు. ఫైనల్‌లో వరుస సెట్లలో 23 ఏళ్ళ నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్‌పై అలవోకగా గెలిచారు. 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు.
కరోనా కష్టం, పక్కటెముకల్లో స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో 6 వారాలు రాకెట్ ముట్టలేని బాధ, ఎర్రమట్టి కోర్టుల్లో సన్నాహక టోర్నమెంట్లలో పాల్గొనలేని వైనం, తిరగబెట్టిన ఎడమ పాదం గాయం... ఇవన్నీ పళ్ళబిగువున భరించి రఫా (నాదల్) టెన్నిసే ఊపిరిగా కదిలారు. జకోవిచ్ సహా టాప్ 10 ఆటగాళ్ళలో నలుగురిని దాటుకొని, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. ఆ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడయ్యారు. గతంలో మరో ఇద్దరు (2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్, 1982 ఫ్రెంచ్ ఓపెన్‌లో విలాండర్) మాత్రమే ఇలా టాప్ 10లో నలుగురిని ఒక గ్రాండ్ స్లామ్‌లో ఓడించారనేది గమనార్హం. ఇప్పటికి 18 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగితే, 14 సార్లు టైటిల్ గెలిచి, తాను ఎర్ర మట్టి కోర్టులో కింగ్‌నని నిరూపించారు. అందుకే ఇది ఓ అద్భుతం. ఓ చరిత్ర. ప్రతి రంగంలో క్షణా నికో కొత్త తార మఖలో పుట్టి పుబ్బలో పోతున్న ఈ రోజుల్లో నాదల్ సుదీర్ఘకాలంగా సత్తా చాటి, సిసలైన టెన్నిస్ స్టార్‌గా నిలిచారు. ఒక్క ఫ్రెంచ్ ఓపెన్‌లోనే 115 సార్లు బరిలోకి దిగితే 112 సార్లు గెలిచి, 97 శాతం విజయాలు నమోదు చేసిన ఘనత ఆయనది. ప్రత్యర్థులైన తోటి టెన్నిస్ స్టార్లు ఫెదరర్, జకోవిచ్‌లను మించిన ప్రతిభ, గౌరవనీయ వర్తనతో రఫా ప్రత్యేక స్థానం సంపాదించారు.
శారీరకంగా బాధల పాలైనా, తీవ్రంగా శ్రమించి గంటల కొద్దీ ఆడి ఓడినా – వాటిని తట్టుకొని ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా నాదల్ పైకి లేచిన తీరు ఆటగాళ్ళకే కాదు... జీవనపోరాటంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. గెలుపు ఓటములను నిర్ణయించేవి పరిస్థితులు కాదు... మన క్రమశిక్షణ, ఆట పట్ల మన వైఖరి. సొంత అంకుల్ అయిన మరో టెన్నిస్ ఆటగాడు టోనీ నాసిరకం కోర్టుల్లో, తీసికట్టు బంతులతో కఠోర శిక్షణనిచ్చినప్పుడే ఆ పాఠం నాదల్ వంటబట్టించుకున్నారు. అతి కొద్దిమందే అగ్రస్థానానికి చేరుకోగలుగుతారనే స్పృహతో, చిన్న చిన్న విజయాలతో తృప్తిపడకుండా ముందుకు సాగారు. వేధిస్తున్న గాయాల వల్ల ఆటకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చి పలుమార్లు కన్నీటి పర్యంతమైనా, ప్రతిసారీ యోధుడిగా తిరిగొచ్చారు. ఈ ఏడాదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముందూ అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు వరుసగా ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లు గెలిచారు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌ల దిశగా అడుగులు వేస్తున్నారు. పాదాల ఎముకలను శిథిలం చేసే అనారోగ్యాన్ని అధిగమించి వాటిలోనూ ఇలాగే గెలిస్తే, అది మరో రికార్డు.
ఒకటీ రెండు కాదు... ఏకంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా పురుషుల్లో నాదల్‌దే ఇప్పుడు రికార్డు. తోటి స్టార్లు జకోవిచ్, ఫెదరర్‌ల (20 స్లామ్‌ల) కన్నా రెండడుగులు ఆయన ముందున్నారు. సెర్బియాకు చెందిన అపూర్వ ప్రతిభావంతుడు జకోవిచ్ ఈ ఏడాదో, ఆ తర్వాతో ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చు. రికార్డులు చెరిగిపోవచ్చు కానీ, టెన్నిస్ క్రీడాంగణంపై నాదల్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది. మైదానంలో ప్రతిభే కాదు... మానవీయ బాహ్యవర్తనా మరపురానిది. అయిదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో కలివిడిగా బతికిన ఉమ్మడి కుటుంబ విలువలతో పెరిగిన ఆయన ఒక్కోసారి మన భారతీయ ఉమ్మడి కుటుంబాలకూ, విలువలకూ సన్నిహితుడిగా అనిపిస్తారు. స్వీయప్రచారం, ప్రతిదానికీ చప్పట్లు, తక్షణలబ్ధి కోరుకోవడం ఆధునిక ప్రపంచ లక్షణానికి భిన్నంగా, తాత్త్విక దృష్టితో జీవితాన్ని నాదల్ చూసే తీరు ప్రత్యేకమైనది. జీవితంలో బాధ, నష్టం అనివార్యమనీ, అవీ జీవితంలో భాగమనీ ఎరుక ఆయనది. ఆయన ప్రతిభకు ఆ సమభావం, క్రమశిక్షణ కవచాలు. నేటికీ నిత్య పోరాటస్ఫూర్తి ఆయన పాశుపతాస్త్రమైంది.
గెలుపు ఓటములను సమంగా స్వీకరిస్తూ, శారీరక బాధను అంగీకరిస్తూ, స్వీయ నియంత్రణ కోల్పోకుండా మెలగడం ఈ ఆటగాడిని ఆల్‌టైమ్ గ్రేట్‌ను చేసింది. 2011లో వెలువడ్డ ‘రఫా – మై స్టోరీ’ ఆత్మకథ చదివినా, ఆయన సుదీర్ఘ ప్రయాణం చూసినా ఇదే అర్థమవుతుంది. మరి ఏ ఇతర టెన్నిస్ ఆటగాడు కానీ, ఈ శతాబ్దపు అత్యుత్తమ అథ్లెట్లలో కొందరైన టైగర్ వుడ్, మైకేల్ ఫెల్ప్స్, ఉసేన్ బోల్ట్, సెరీనా విలియమ్స్ లాంటివారు కానీ – తమ ఆటల్లో నాదల్ స్థాయిలో ఆధిపత్యం చలాయించలేదని విశ్లేషకుల మాట. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ అపూర్వమైన ఆటతీరును మరోసారి చూసిన స్పెయిన్ రాజు సంతోషంలో ఒకటే అన్నారు – ‘స్పెయిన్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్ నాదల్. రాబోయే తరాలు ఆయనకు నీరాజనాలు పడతారు. టెన్నిస్ ప్రపంచానికి ఆయన మహారాజు’. అది సత్యం. నాదల్ ఓ అద్భుతం. ఆయన పట్టుదల, పరిశ్రమ అనేక విధాల ఆదర్శం!
Comments
Please login to add a commentAdd a comment