![Rafael Nadal and Novak Djokovic in French Open final Today - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/11/pp.jpg.webp?itok=IRlhhoef)
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌కు అద్భుత ముగింపు ఇచ్చే సమయం వచ్చింది. టైటిల్ వేటలో ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమయ్యారు. నేడు జరిగే తుది పోరులో 12 సార్లు చాంపియన్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు. ఇక్కడ విజయం సాధిస్తే పలు అరుదైన ఘనతలు ఆయా ఆటగాళ్ల ఖాతాలో చేరతాయి. తనకు కోటలాంటి ఎర్రమట్టి కోర్టులో ఫైనల్ చేరిన ప్రతీ సారి విజేతగా నిలిచిన నాదల్ మళ్లీ గెలిస్తే అతని ఖాతాలో 13వ ఫ్రెంచ్ ఓపెన్ చేరుతుంది.
పైగా రోలండ్ గారోస్‌లో అతను సరిగ్గా 100 విజయాలు పూర్తి చేసుకుంటాడు. అన్నింటికి మించి 20వ గ్రాండ్‌స్లామ్ విజయంతో రోజర్ ఫెడరర్ సరసన నిలుస్తాడు. ఇక జొకోవిచ్ గెలిస్తే అతని ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్ చేరుతుంది. దిగ్గజాల గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వరుస 20–19–18గా మారుతుంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో డిస్‌క్వాలిఫై కావడం మినహా ఆడిన మిగతా 37 మ్యాచ్‌లలో జొకోవిచ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సిట్సిపాస్‌పై సెమీ ఫైనల్లో 6–3, 6–2, 5–7, 4–6, 6–1తో ఐదు సెట్‌ల పాటు కొంత పోరాడి గెలిచాడు. జొకోవిచ్ తన కెరీర్‌లో ఒకే ఒక ఫ్రెంచ్ ఓపెన్ సాధించగా... అదీ 2016లో నాదల్ మూడో రౌండ్‌లోనే గాయంతో తప్పుకున్న ఏడాది వచ్చింది. ఇద్దరి మధ్య 55 మ్యాచ్‌లు జరగ్గా...నాదల్ 26 గెలిచాడు. జొకోవిచ్ 29 గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాదల్ 6–1తో ముందంజలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment