French Open final
-
Novak Djokovic: ఆ కుర్రాడి సలహాల వల్లే టైటిల్ నెగ్గాను.. అందుకే ఆ గిఫ్ట్
పారిస్: ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్.. ఓ చిన్నారి అభిమానికి తన విన్నింగ్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్ స్లామ్ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన అపురూపమైన బహుమతిని అందజేశాడు. తన పోరాటంలో కీలకపాత్ర పోషించిన చిన్నారి అభిమానికి కృతజ్ఞతగా విన్నింగ్ రాకెట్‌ను బహుకరించాడు. A gift to a great supporter 😄#RolandGarros | @DjokerNole pic.twitter.com/F04a5UDNQr — Roland-Garros (@rolandgarros) June 13, 2021 ఇదిలా ఉంటే, తన అభిమాన ఆటగాడి నుంచి ఊహించని గిఫ్ట్‌ను అందుకున్న ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టలేని సంతోషంతో గంతులేస్తూ కేరింతలు పెట్టాడు. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ తుది సమరంలో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో చారిత్రక విజయాన్ని సాధించాడు. టైటిల్ విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించింది. చదవండి: ఫైనల్‌కు కొద్ది నిమిషాల ముందే ఆ విషయం తెలిసింది.. -
ఫైనల్‌కు కొద్ది నిమిషాల ముందే ఆ విషయం తెలిసింది..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడిన గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్.. మ్యాచ్‌కు ముందు జరిగిన విషాదాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన నాన్నమ్మ చనిపోయినట్లు.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే తనకు విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చాడు. తన నాన్నమ్మలాంటి వ్యక్తిని తాను ఇప్పటి వరకూ చూడలేదని ఆయన తెలిపాడు. నాన్నమ్మ తననెప్పుడూ ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నించేదని, ఆమె లాంటి వ్యక్తులు కలలు కనడం నేర్పిస్తారని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Stefanos Tsitsipas (@stefanostsitsipas98) జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించామా లేదా అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కాగా, ఆ బాధను దిగమింగుతూనే ఫైనల్ బరిలో దిగిన సిట్సిపాస్.. తొలి రెండు సెట్లు గెలిచి గెలుపు దిశగా పయనించేలా కనిపించాడు. కానీ ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఓటమిపాలయ్యాడు. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై విజయం సాధించాడు. చదవండి: వీరోచితం... ‘జొకో’ విజయం -
అటు 20...ఇటు 18 వేటలో...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌కు అద్భుత ముగింపు ఇచ్చే సమయం వచ్చింది. టైటిల్ వేటలో ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమయ్యారు. నేడు జరిగే తుది పోరులో 12 సార్లు చాంపియన్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు. ఇక్కడ విజయం సాధిస్తే పలు అరుదైన ఘనతలు ఆయా ఆటగాళ్ల ఖాతాలో చేరతాయి. తనకు కోటలాంటి ఎర్రమట్టి కోర్టులో ఫైనల్ చేరిన ప్రతీ సారి విజేతగా నిలిచిన నాదల్ మళ్లీ గెలిస్తే అతని ఖాతాలో 13వ ఫ్రెంచ్ ఓపెన్ చేరుతుంది. పైగా రోలండ్ గారోస్‌లో అతను సరిగ్గా 100 విజయాలు పూర్తి చేసుకుంటాడు. అన్నింటికి మించి 20వ గ్రాండ్‌స్లామ్ విజయంతో రోజర్ ఫెడరర్ సరసన నిలుస్తాడు. ఇక జొకోవిచ్ గెలిస్తే అతని ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్ చేరుతుంది. దిగ్గజాల గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వరుస 20–19–18గా మారుతుంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో డిస్క్వాలిఫై కావడం మినహా ఆడిన మిగతా 37 మ్యాచ్‌లలో జొకోవిచ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సిట్సిపాస్‌పై సెమీ ఫైనల్లో 6–3, 6–2, 5–7, 4–6, 6–1తో ఐదు సెట్ల పాటు కొంత పోరాడి గెలిచాడు. జొకోవిచ్ తన కెరీర్లో ఒకే ఒక ఫ్రెంచ్ ఓపెన్ సాధించగా... అదీ 2016లో నాదల్ మూడో రౌండ్లోనే గాయంతో తప్పుకున్న ఏడాది వచ్చింది. ఇద్దరి మధ్య 55 మ్యాచ్‌లు జరగ్గా...నాదల్ 26 గెలిచాడు. జొకోవిచ్ 29 గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాదల్ 6–1తో ముందంజలో ఉన్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సిమోనాహలెప్
-
పట్టు వదలని ‘వావ్రి’మార్కుడు!
సాక్షి క్రీడావిభాగం ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు ముందు జొకోవిచ్పై వావ్రింకా గెలుస్తాడని భావించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ పక్కా ప్రణాళికతో వావ్రింకా ప్రపంచ నంబర్‌వన్‌ను కంగుతినిపించాడు. నిజానికి ఈ టోర్నీ అంతటా వావ్రింకా చాలా నిలకడగా ఆడాడు. ప్రిక్వార్టర్స్‌లో 12వ సీడ్ సిమోన్‌ను చిత్తు చేసిన వావ్రింకా... క్వార్టర్స్‌లో ఫెడరర్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత లోకల్ స్టార్ సోంగాపై గెలిచి... ఫైనల్లో జొకోవిచ్ భరతం పట్టాడు. క్లే కోర్టుల మీద తన ఆటతీరు మెరుగ్గా ఉంటుందని వావ్రింకా భావిస్తాడు. కారణం తను ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్స్ బాగా ఆడతాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్‌లో టెన్నిస్ అంటే ఫెడరర్ మాత్రమే. ఈసారి ఫ్రెంచ్ టైటిల్‌తో 30 ఏళ్ల వావ్రింకాకు కూడా ఫెడరర్ స్థాయి వచ్చేసింది. దీనికోసం అతను చాలా కష్టపడ్డాడు. వ్యవసాయ కుటుంబం: వావ్రింకా తండ్రి వోల్ఫ్రామ్ వ్యవసాయం చేస్తారు. వావ్రింకా ముత్తాత చెక్ రిపబ్లిక్ నుంచి స్విట్జర్లాండ్‌కు వలస వచ్చారు. తల్లి ఇసాబెల్ది స్విస్. వావ్రింకా తల్లిదండ్రులిద్దరూ ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో వికలాంగులైన చిన్నారులకు సాయం చేస్తారు. వావ్రింకా అన్న టెన్నిస్ కోచ్. 15 ఏళ్ల వయసులో వావ్రింకా చదువుకు గుడ్‌బై చెప్పేసి పూర్తిగా టెన్నిస్ మీద దృష్టి కేంద్రీకరించాడు. జూనియర్ స్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పలు టైటిళ్లు సాధించిన స్టాన్... జూనియర్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించగలిగాడు. 17 ఏళ్ల వయసులో 2002లో ప్రొఫెషనల్ టెన్నిస్ మొదలుపెట్టాడు. జొకోవిచ్పై గెలిచి తొలి టైటిల్: 2006లో వావ్రింకా క్రొయేషియా ఓపెన్‌లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాడు. యాదృచ్ఛికంగానే అయినా అప్పుడు కూడా ఫైనల్లో జొకోవిచ్‌పైనే గెలిచాడు. అదే ఏడాది ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి దూసుకొచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెడరర్‌తో కలిసి డబుల్స్‌లో స్విస్‌కు స్వర్ణం అందించాడు. 2010 వరకూ నాలుగేళ్ల పాటు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా... పలు టోర్నీల్లో సెమీస్, ఫైనల్ వరకూ వచ్చి ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. 2010లో హసన్ గ్రాండ్‌ప్రి, 2011లో చెన్నై ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాడు. 2012లో ఒక్క టైటిల్ కూడా దక్కలేదు. 2013లో ఒక ఏటీపీ టైటిల్ సాధించాడు. 2014లో చెన్నై ఓపెన్ టైటిల్ గెలిచిన వావ్రింకా... అదే జోరులో తొలిసారి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో) టైటిల్ సాధించాడు. తాజాగా ఫ్రెంచ్ విజయంతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. కుటుంబానికి దూరం: 2009లో వావ్రింకా వుయోలౌడ్ అనే మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తోంది. 2010లో వావ్రింకాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో టైటిల్స్ లేక ఆట గాడితప్పి వావ్రింకా ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెన్నిస్‌పై దృష్టి పెట్టేందుకు వావ్రింకా భార్యకు దూరంగా ఉంటున్నాడని స్విస్ మీడియాలో 2011లో తొలిసారి కథనం వచ్చింది. తర్వాత మళ్లీ కొంతకాలం కలిసి ఉన్నా... ఈ ఏప్రిల్‌లో భార్య నుంచి పూర్తిగా విడిపోతున్నట్లు వావ్రింకా ప్రకటించాడు. వాళ్ల సరసన చేరినట్లే(నా)! తాజాగా వావ్రింకా నాలుగో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్, ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నాదల్ పదో ర్యాంక్‌కు పడిపోయినా అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఈ నలుగురి సరసన చేరే స్థాయి తనకు లేదని అంటున్నాడు వావ్రింకా. ‘నా స్థాయికి నేను రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం సంతోషంగా ఉంది. ఆ నలుగురూ దిగ్గజాలు. వారిని అందుకోవడం చాలా కష్టం’ అని చెప్పాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఈ నలుగురితో పాటు వావ్రింకాను మినహాయిస్తే... మిగిలిన (నిషికోరి, బెర్డిచ్, ఫెరర్, సిలిచ్) వాళ్లందరిపై ఫ్రెంచ్ చాంపియన్ది పైచేయి. కాబట్టి అతన్ని ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్కు ప్రధాన పోటీ దారుగా టెన్నిస్ ప్రపంచం భావిస్తోంది. -
సెరెనా ‘సూపర్’
మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అమెరికా స్టార్ శనివారం సఫరోవాతో తుది పోరు ఇవనోవిచ్‌కు షాకిచ్చిన చెక్ భామ ఓవైపు తీవ్రమైన ఎండ.. మరోవైపు తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారిణి నుంచి గట్టిపోటీ... ఆటలో అపార అనుభవం ఉన్నా.. గతంలో మట్టి కోటలో ఆధిపత్యం చూపినా... ఈసారి మాత్రం ఆరంభంలో కాస్త తడబాటు... అయినా ఆత్మ విశ్వాసంతో పోరాడిన టాప్‌సీడ్ సెరెనా... 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో బాసిన్ిస్కీపై గెలిచి ఫైనల్‌కు చేరింది. మరోవైపు సెర్బియా సుందరి ఇవనోవిచ్‌కు చెక్ చిన్నది సఫరోవా సూపర్ షాకిచ్చింది. పారిస్: చివరి రెండు సెట్లలో అమోఘమైన పోరాట పటిమను చూపెట్టిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్... ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెరీర్లో 20వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 4-6, 6-3, 6-0తో 23వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై నెగ్గింది. ఆరంభంలో సర్వీస్‌లో తడబడటంతో తొలిసెట్‌ను చేజార్చుకున్న సెరెనా.. రెండోసెట్లో సత్తా చాటింది. స్కోరు 2-2గా ఉన్న దశలో బాసిన్‌స్కీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తర్వాత వరుసగా సర్వీస్‌లను నిలబెట్టుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అమెరికా ప్లేయర్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. బాసిన్స్కీకి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా సర్వీస్లతోనే అదరగొట్టింది. ఓవరాల్‌గా చివరి 10 గేమ్‌లను గెలిచి బాసిన్స్కీకి అడ్డుకట్ట వేసింది. కెరీర్లో తొలిసారి... చెక్ క్రీడాకారిణి లూసి సఫరోవా కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్ మ్యాచ్‌లో 13వ సీడ్ సఫరోవా 7-5, 7-5తో ఏడోసీడ్అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై నెగ్గింది. గంటా 52 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో ఇవనోవిచ్ ఆకట్టుకున్నా.. చివర్లో నిరాశపర్చింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఓ దశలో 4-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆరో గేమ్‌లో సఫరోవా రెండు బ్రేక్ పాయింట్లు కాచుకుని ఆధిక్యాన్ని 4-2కు తగ్గించింది. ఇక స్కోరు 5-5గా ఉన్న దశలో ఇవనోవిచ్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. దీంతో 6-5 ఆధిక్యంలో నిలిచిన సఫరోవా అద్భుతమైన వ్యాలీతో సెట్‌ను చేజిక్కించుకుంది. రెండోసెట్లో 1-1తో స్కోరు సమమైన తర్వాత సఫరోవా సూపర్ సర్వీస్‌తో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్కోరు 5-4గా ఉన్న దశలో మూడు డబుల్ ఫాల్ట్ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఇవనోవిచ్ చెలరేగాలని ప్రయత్నించినా... సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత తన సర్వీస్‌లో మూడో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 1981 (హనా మండికోవా) తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన తొలి చెక్ మహిళా క్రీడాకారిణి రికార్డులకెక్కింది. శనివారం జరిగే ఫైనల్లో సెరెనా... సఫరోవాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ప్రాంజల జోడి ఓటమి బాలికల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఏడోసీడ్ ఎడ్లపల్లి ప్రాంజల (భారత్)-వుషువాంగ్ జెంగ్ (చైనా) 1-6, 3-6తో టీచ్‌మన్ (స్విట్జర్లాండ్)-జుయ్ (చైనా) జోడి చేతిలో ఓడారు. నేటి పురుషుల సెమీస్ మ్యాచ్‌లు జొకోవిచ్ (1) ముర్రే (3) సోంగా (14) వావ్రింకా (8) నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్ సాయంత్రం గం. 5.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం