పట్టు వదలని ‘వావ్రి’మార్కుడు!
సాక్షి క్రీడావిభాగం
ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు ముందు జొకోవిచ్‌పై వావ్రింకా గెలుస్తాడని భావించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ పక్కా ప్రణాళికతో వావ్రింకా ప్రపంచ నంబర్‌వన్‌ను కంగుతినిపించాడు. నిజానికి ఈ టోర్నీ అంతటా వావ్రింకా చాలా నిలకడగా ఆడాడు. ప్రిక్వార్టర్స్‌లో 12వ సీడ్ సిమోన్‌ను చిత్తు చేసిన వావ్రింకా... క్వార్టర్స్‌లో ఫెడరర్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత లోకల్ స్టార్ సోంగాపై గెలిచి... ఫైనల్లో జొకోవిచ్ భరతం పట్టాడు. క్లే కోర్టుల మీద తన ఆటతీరు మెరుగ్గా ఉంటుందని వావ్రింకా భావిస్తాడు. కారణం తను ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్స్ బాగా ఆడతాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్‌లో టెన్నిస్ అంటే ఫెడరర్ మాత్రమే. ఈసారి ఫ్రెంచ్ టైటిల్‌తో 30 ఏళ్ల వావ్రింకాకు కూడా ఫెడరర్ స్థాయి వచ్చేసింది. దీనికోసం అతను చాలా కష్టపడ్డాడు.
వ్యవసాయ కుటుంబం: వావ్రింకా తండ్రి వోల్‌ఫ్రామ్ వ్యవసాయం చేస్తారు. వావ్రింకా ముత్తాత చెక్ రిపబ్లిక్ నుంచి స్విట్జర్లాండ్‌కు వలస వచ్చారు. తల్లి ఇసాబెల్‌ది స్విస్. వావ్రింకా తల్లిదండ్రులిద్దరూ ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో వికలాంగులైన చిన్నారులకు సాయం చేస్తారు. వావ్రింకా అన్న టెన్నిస్ కోచ్. 15 ఏళ్ల వయసులో వావ్రింకా చదువుకు గుడ్‌బై చెప్పేసి పూర్తిగా టెన్నిస్ మీద దృష్టి కేంద్రీకరించాడు. జూనియర్ స్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పలు టైటిళ్లు సాధించిన స్టాన్... జూనియర్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించగలిగాడు. 17 ఏళ్ల వయసులో 2002లో ప్రొఫెషనల్ టెన్నిస్ మొదలుపెట్టాడు.
జొకోవిచ్‌పై గెలిచి తొలి టైటిల్: 2006లో వావ్రింకా క్రొయేషియా ఓపెన్‌లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాడు. యాదృచ్ఛికంగానే అయినా అప్పుడు కూడా ఫైనల్లో జొకోవిచ్‌పైనే గెలిచాడు. అదే ఏడాది ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి దూసుకొచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెడరర్‌తో కలిసి డబుల్స్‌లో స్విస్‌కు స్వర్ణం అందించాడు. 2010 వరకూ నాలుగేళ్ల పాటు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా... పలు టోర్నీల్లో సెమీస్, ఫైనల్ వరకూ వచ్చి ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. 2010లో హసన్ గ్రాండ్‌ప్రి, 2011లో చెన్నై ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాడు. 2012లో ఒక్క టైటిల్ కూడా దక్కలేదు. 2013లో ఒక ఏటీపీ టైటిల్ సాధించాడు. 2014లో చెన్నై ఓపెన్ టైటిల్ గెలిచిన వావ్రింకా... అదే జోరులో తొలిసారి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో) టైటిల్ సాధించాడు. తాజాగా ఫ్రెంచ్ విజయంతో ప్రపంచాన్ని ఆకర్షించాడు.
కుటుంబానికి దూరం: 2009లో వావ్రింకా వుయోలౌడ్ అనే మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తోంది. 2010లో వావ్రింకాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో టైటిల్స్ లేక ఆట గాడితప్పి వావ్రింకా ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెన్నిస్‌పై దృష్టి పెట్టేందుకు వావ్రింకా భార్యకు దూరంగా ఉంటున్నాడని స్విస్ మీడియాలో 2011లో తొలిసారి కథనం వచ్చింది. తర్వాత మళ్లీ కొంతకాలం కలిసి ఉన్నా... ఈ ఏప్రిల్‌లో భార్య నుంచి పూర్తిగా విడిపోతున్నట్లు వావ్రింకా ప్రకటించాడు.
వాళ్ల సరసన చేరినట్లే(నా)!
తాజాగా వావ్రింకా నాలుగో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్, ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నాదల్ పదో ర్యాంక్‌కు పడిపోయినా అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఈ నలుగురి సరసన చేరే స్థాయి తనకు లేదని అంటున్నాడు వావ్రింకా. ‘నా స్థాయికి నేను రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం సంతోషంగా ఉంది. ఆ నలుగురూ దిగ్గజాలు. వారిని అందుకోవడం చాలా కష్టం’ అని చెప్పాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఈ నలుగురితో పాటు వావ్రింకాను మినహాయిస్తే... మిగిలిన (నిషికోరి, బెర్డిచ్, ఫెరర్, సిలిచ్) వాళ్లందరిపై ఫ్రెంచ్ చాంపియన్‌ది పైచేయి. కాబట్టి అతన్ని ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్‌కు ప్రధాన పోటీ దారుగా టెన్నిస్ ప్రపంచం భావిస్తోంది.