Wawrinka
-
ఫ్రెంచ్ ఓపెన్‌కు మాజీ విజేత వావ్రింకా దూరం
పారిస్‌లో ఈనెల 30న మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తాను ఆడటంలేదని 2015 చాంపియన్, ప్రపంచ 24వ ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మంగళవారం ప్రకటించాడు. గత మార్చిలో వావ్రింకా ఎడమ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించపోవడంతో ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నానని... జూన్ 28న మొదలయ్యే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో పునరాగమనం చేస్తానని 36 ఏళ్ల వావ్రింకా తెలిపాడు. -
రెండున్నరేళ్ల తర్వాత...
యాంట్‌వర్ప్ (బెల్జియం): ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన యూరోపియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243వ ర్యాంకర్ ముర్రే 3–6, 6–4, 6–4తో ప్రపంచ 18వ ర్యాంకర్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేత ముర్రేకు 1,09,590 యూరోలు (రూ. 87 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వావ్రింకాతో ఫైనల్లో తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 1–3తో వెనుకబడిన ముర్రే ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 2017 మార్చిలో దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించాక ముర్రే ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ముర్రే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆగస్టులో సిన్సినాటి మాస్టర్స్ టోరీ్నతో పునరాగమనం చేశాక మరో ఐదు టోర్నీల్లో పాల్గొన్న అతను ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే యూరోపియన్ ఓపెన్‌లో అతను ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచాడు. -
నాదల్ & వావ్రింకా
-
నాదల్ & వావ్రింకా
►పదో సారి ఫైనల్లోకి నాదల్ ►వావ్రింకాతో అమీతుమీ రేపు ►ఫ్రెంచ్ ఓపెన్ ఇటు వావ్రింకా, అటు నాదల్ తమ ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు. తమ ప్రతీకారానికి ఫ్రెంచ్ ఓపెన్‌ను వేదికగా చేసుకున్నారు. గతేడాది ఇదే వేదికపై బ్రిటన్ స్టార్ ముర్రే చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ ఏడాది వావ్రింకా బదులు తీసుకుంటే... మూడువారాల క్రితం రోమ్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో థీమ్ చేతిలో చవిచూసిన పరాజయానికి నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పారిస్: స్పానిష్ సంచలనం రాఫెల్ నాదల్... మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ఈ క్లేకోర్టు సూపర్ చాంపియన్ పదో టైటిల్ కోసం స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకాతో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4, 6–0తో డొమినిక్ థీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే థీమ్ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. ఇద్దరు తమ తమ ప్రత్యుర్థులపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఫైనల్ పరంగా చూస్తే కూడా ఇద్దరి గణాంకాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పటి దాకా ఫైనల్ చేరిన ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ వావ్రింకా ఓడిపోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) ఫైనల్లో నాదల్‌ను కంగుతినిపించిన వావ్రింకా... ఫ్రెంచ్ ఓపెన్ (2015), యూఎస్ ఓపెన్ (2016) ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ది ఎదురులేని రికార్డు. ఫైనల్ చేరిన 9 సార్లు టైటిల్ చేజిక్కించుకున్నాడు. వారెవ్వా వావ్రింకా గతేడాది... ఇదే టోర్నీ... డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి వావ్రింకా... క్వార్టర్స్ దాకా ఎదురేలేని పయనం. కానీ సెమీస్‌లో చుక్కెదురు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చేతిలో ఓటమి. వరుసగా రెండో టైటిల్ గెలుద్దామనుకున్న ఆశలకు తెర! అందుకేనేమో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. ఏడాది తిరిగేలోపే లెక్క సరిచేశాడు. ముర్రే కథను అదే టోర్నీ సెమీస్‌లో ముగించాడు. వారెవ్వా వావ్రింకా అనిపించుకున్నాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2015 చాంపియన్ స్విస్ స్టార్ 3–2 సెట్లతో గతేడాది రన్నరప్ ముర్రేను కంగుతినిపించాడు. జోరు మీదున్న వావ్రింకాకు ఇది వరుసగా పదో విజయం కావడం గమనార్హం. ఇద్దరి పోరాటంతో నాలుగున్నర గంటలపాటు ఈ మ్యాచ్ సాగింది. మొదటి సెట్ నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో రెండు సెట్లు టైబ్రేక్ దారి తీశాయి. చివరకు వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. బ్రిటన్ స్టార్ ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టుబిగించే ప్రయత్నం చేశాడు. అయితే వావ్రింకా కూడా దీటుగా బదులివ్వడంతో ప్రతీపాయింట్కు చెమటోడ్చాల్సివచ్చింది. అయితే ఈ సెట్లో స్విస్ స్టార్ పదే పదే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. టైబ్రేక్‌లోనూ సరిదిద్దుకోలేని తప్పులతో తొలిసెట్‌ను కోల్పోయాడు. తర్వాత రెండో సెట్‌ను మాత్రం దూకుడుగా ప్రారంభించిన వావ్రింకా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మళ్లీ ముర్రేదే పైచేయి అయ్యింది. ముర్రే మూడు బ్రేక్ పాయింట్లను సాధించగా... వావ్రింకా మళ్లీ నియంత్రణే లేని అనవసర తప్పిదాలతో సెట్‌ను కోల్పోవాల్సివచ్చింది. ఇక నాలుగో సెట్లో మళ్లీ ఇద్దరు అసాధారణ ప్రదర్శన కనబరచడంతో ఇది సుదీర్ఘంగా సాగింది. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసినప్పటికీ వావ్రింకా దూకుడుగా ఆడి సెట్‌ను ముగించాడు. ఇద్దరూ వీరోచిత పోరాటంతో 2–2తో సమంగా నిలిచారు. నిర్ణాయక ఐదో సెట్లో వావ్రింకా జోరు ముందు ముర్రే తేలిపోయాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని వావ్రింకా 5–0తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌ను ముర్రే బ్రేక్ చేసినా... ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన స్విస్ ఆటగాడు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. -
గట్టెక్కిన వావ్రింకా
ఐదు సెట్ల పోరులో విజయం శ్రమించిన ఫెడరర్, ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టార్ క్రీడాకారులకు తొలి రోజే కఠిన పరీక్ష ఎదురైంది. మాజీ చాంపియన్, నాలుగో సీడ్ వావ్రింకా, ఐదో సీడ్ కీ నిషికోరి, యూఎస్ ఓపెన్ మాజీ విజేత, ఏడో సీడ్ మారిన్ సిలిచ్ తొలి రౌండ్నుఅతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్(స్విట్జర్లాండ్), టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా విజయం కోసం కష్ట పడాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో మాత్రం నాలుగో సీడ్ సిమోనా హలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మెల్బోర్న్: ఒకవైపు మండుతున్న ఎండలు... మరోవైపు ఊహించనిరీతిలో కఠిన ప్రత్యర్థులు... దాంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు సీడెడ్ క్రీడాకారులకు కష్టాలు తప్పలేదు. 2014 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), 2014 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీ నిషికోరి (జపాన్) ఐదు సెట్లపాటు తీవ్రంగా పోరాడి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించడంలో సఫలమయ్యారు. 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 4–6, 6–4, 7–5, 4–6, 6–4తో క్లిజాన్ (స్లొవేకియా)పై గెలుపొందగా... 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిషికోరి 5–7, 6–1, 6–4, 6–7 (6/8), 6–2తో కుజ్నెత్సోవ్ (రష్యా)ను ఓడించాడు. 3 గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో సిలిచ్ 4–6, 4–6, 6–2, 6–2, 6–3తో జనోవిచ్ (పోలండ్)పై విజయం సాధించాడు. క్లిజాన్తో జరిగిన పోరులో వావ్రింకా 21 ఏస్‌లు సంధించగా... ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 43 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే 7–5, 7–6 (7/5), 6–2తో మర్చెంకో (ఉక్రెయిన్)ను ఓడించగా... గతంలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన 17వ సీడ్ ఫెడరర్ 7–5, 3–6, 6–2, 6–2తో జర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. 2 గంటల ఐదు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 19 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, మెల్జర్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 14వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా), పదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), 23వ సీడ్ జాక్ సాక్ (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. మళ్లీ తొలి రౌండ్లోనే హలెప్‌కు చుక్కెదురు... హిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 3–6, 1–6తో షెల్బీ రోజర్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న హలెప్‌కు ఈ టోర్నీ అంతగా కలిసిరాలేదు. గతంలో ఈ టోర్నీలో ఆమె రెండుసార్లు మాత్రమే తొలి రౌండ్‌ను దాటగలిగింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–2, 5–7, 6–2తో సురెంకో (ఉక్రెయిన్)పై కష్టపడి గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7–5, 6–4తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)పై, 13వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 7–5తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై, ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6–0, 6–1తో డుకీ మరినో (కొలంబియా)పై, పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6–2, 6–2తో సెపెలోవా (స్లొవేకియా)పై గెలిచారు. -
'వావ్'రింకా
కొన్నేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వచ్చిందంటే జొకోవిచ్, ఫెడరర్, నాదల్, ముర్రేలను టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది. గత 47 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఈ నలుగురే 43 టైటిల్స్‌ను పంచుకోవడం వారి ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఇక నుంచి ఆ నలుగురితోపాటు వావ్రింకాను కూడా కచ్చితమైన ఫేవరెట్స్ జాబితాలో పరిగణించే సమయం వచ్చేసింది. ఇన్నాళ్లూ ‘ఆ నలుగురి’ ఆధిపత్యంలో ప్రాచుర్యం పొందలేకపోయిన స్విస్ స్టార్ యూఎస్ ఓపెన్ టైటిల్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. జొకోవిచ్‌కు మళ్లీ షాక్ * యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్విస్ స్టార్ * రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు మరోసారి భంగపాటు ఎదురైంది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తనను ఓడించి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ అవకాశాన్ని అడ్డుకున్న స్టానిస్లాస్ వావ్రింకా(స్విట్జర్లాండ్)నే మరోసారి ఈ సెర్బియా యోధుడికి షాక్ ఇచ్చాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా 6-7 (1/7), 6-4, 7-5, 6-3తో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా వావ్రింకా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), జొకోవిచ్‌కు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఏకంగా 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో వావ్రింకా పోరాటపటిమ ముందు జొకోవిచ్ తలవంచక తప్పలేదు. ఈ టోర్నీలో డానియల్ ఇవా న్స్ (బ్రిటన్)తో జరిగిన మూడో రౌండ్లో వావ్రింకా మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్నాడు. ఆఖరికి టోర్నీ విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఓవరాల్‌గా వావ్రింకాకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను వావ్రింకా గెలిచాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచే క్రమంలో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌ను వావ్రింకా ఓడించాడు. జొకోవిచ్పై గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్స్‌లో వావ్రింకాకు టైటిల్ దక్కడం విశేషం. నెమ్మదిగా మొదలుపెట్టి... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు సెట్లు ఆడి ఫైనల్‌కు చేరిన వావ్రింకా తుది పోరులోనూ ఆరంభంలో తడబడ్డాడు. ఒకదశలో 2-5తో వెనుకబడ్డాడు. అరుుతే నెమ్మదిగా జోరు పెంచి స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం చలాయించి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో వావ్రింకా ఆటతీరు మెరుగైంది. తన ప్రధాన ఆయుధమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో ఈ స్విస్ స్టార్ చెలరేగిపోయాడు. నాలుగో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకొని 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన వావ్రింకా రెండో సెట్‌ను 47 నిమిషాల్లో గెలుపొంది ఫామ్‌లోకి వచ్చాడు. మూడో సెట్లో ఇద్దరూ ప్రతి పారుుంట్ కోసం పోరాడారు. చివరకు 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వావ్రింకా ఈ సెట్‌ను 76 నిమిషాల్లో దక్కించుకున్నాడు. నాలుగో సెట్ వచ్చేసరికి ఇద్దరూ అలసిపోరుునట్లు కనిపించారు. జొకోవిచ్ పాదానికి గాయం కావడంతో అతను చురుకుగా కదల్లేకపోయాడు. మరోవైపు వావ్రింకా అలసిపోరుునా పట్టువదలకుండా పోరాడుతూ జొకోవిచ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొమ్మిదో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌లో జొకోవిచ్ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో ఈ స్విస్ స్టార్‌కు విజయం ఖాయమైంది. బాధను ఆస్వాదించా... ‘‘ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్‌ను ఓడించాలంటే శాయశక్తులా పోరాడాలి. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మ్యాచ్ ముగిశాక నా వద్ద ఎలాంటి శక్తి మిగల్లేదు. అంతా మ్యాచ్‌లోనే ధారపోశాను. ఫైనల్ సందర్భంగా నా బలహీనతలు ప్రదర్శించకూడాదని నిర్ణయించుకున్నాను. కండరాలు పట్టేసినా, నొప్పి ఉన్నా భరించాను. బాధను ఆస్వాదిస్తూ ఆడాను. ఆఖరికి విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.’’ - వావ్రింకా 11 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో మూడింటిని నెగ్గిన 11వ ప్లేయర్ వావ్రింకా. 2 కెన్ రోజ్‌వెల్ (35 ఏళ్లు-1970లో) తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా వావ్రింకా (31 ఏళ్లు) నిలిచాడు. 5 30 ఏళ్లు దాటాక కనీసం రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ వావ్రింకా. 1 యూఎస్ ఓపెన్‌లో తొలి సెట్ గెలిచాక మ్యాచ్ ఓడిపోవడం జొకోవిచ్‌కిదే తొలిసారి. -
మళ్లీ గట్టెక్కిన ముర్రే
► రెండో రౌండ్లోనూ ఐదు సెట్ల పోరులో నెగ్గిన బ్రిటన్ స్టార్ ► మూడో రౌండ్లో వావ్రింకా, నిషికోరి ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: క్లే కోర్టులపై కూడా సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడి, విజయం సాధించే సత్తా తనలో ఉందని బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మరోసారి నిరూపించుకున్నాడు. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రెండో సీడ్ ప్లేయర్ వరుసగా రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరులో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ‘వైల్డ్ కార్డు’ ఆటగాడు మథియాస్ బుర్గూతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 6-2, 2-6, 4-6, 6-2, 6-3తో నెగ్గి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు 45 అనవసర తప్పిదాలు చేశాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. రాడెక్ స్టెపానెక్‌తో జరిగిన తొలి రౌండ్లోనూ ముర్రే ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ నిషికోరి (జపాన్), తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో వావ్రింకా 7-6 (9/7), 6-3, 6-4తో డానియల్ (జపాన్)పై, నిషికోరి 6-3, 6-3, 6-3తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై, గాస్కే 6-1, 7-6 (7/3), 6-3తో ఫ్రాటెన్జెలో (అమెరికా)పై గెలిచారు. ముగురుజా ముందుకు మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ హలెప్ (రుమేనియా), రెండో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ముగురుజా 6-2, 6-0తో మిర్టిలి జార్జెస్ (ఫ్రాన్స్)పై, హలెప్ 7-6 (7/5), 6-2తో దియాస్ (కజకిస్తాన్)పై, రద్వాన్‌స్కా 6-2, 6-4తో గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-1తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై, 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 6-1, 6-3తో హితెర్ వాట్సన్ (బ్రిటన్)పై నెగ్గారు. -
వావ్రింకాకు రావ్‌నిచ్ షాక్
మెల్బోర్న్: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) పోరాటం ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ముందే ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6-4, 6-3, 5-7, 4-6, 6-3తో వావ్రింకాపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-4, 6-4, 7-6 (7/4)తో టామిక్ (ఆస్ట్రేలియా)పై, ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-4, 6-4, 7-5తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై, మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7-5, 3-6, 6-3, 7-6 (7/4)తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో 14వ సీడ్ అజరెంకా (బెలారస్)తోపాటు ఏడో సీడ్ కెర్బర్ (జర్మనీ), కొంటా (బ్రిటన్), షుయె జాంగ్ (చైనా) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్‌లో సానియా జోడీ మహిళల డబుల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-1, 6-3తో కుజ్నెత్సోవా (రష్యా) -విన్సీ (ఇటలీ) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్) -యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) 4-6, 6-3, 10-6తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)-కుబోట్ (పోలండ్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో ప్రాంజల బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల (భారత్) 7-6 (7/5), 6-3తో మిరా అంటోనిష్ (ఆస్ట్రియా)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల-కర్మాన్ ద్వయం 6-4, 6-3 తో హులె-సెలీనా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది. -
చెన్నై ఓపెన్‌కు వావ్రింకా
ఎనిమిదోసారి బరిలోకి... చెన్నై : డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా ఎనిమిదోసారి చెన్నై ఓపెన్‌లో బరిలో దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో అతను పాల్గొంటాడని నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ స్విస్ ప్లేయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ముచ్చటగా మూడోసారి చెన్నై టైటిల్‌పై కన్నేశాడు. చెన్నై ఓపెన్‌తో సీజన్‌ను ప్రారంభించడం అద్భుతంగా ఉటుందని వావ్రింకా అన్నాడు. ‘టోర్నీపై దృష్టిపెట్టా. చివరి రెండేళ్లు చాలా ప్రత్యేకం. ఎందుకంటే చెన్నై ట్రోఫీతో సీజన్ మొదలుపెట్టాక కచ్చితంగా ఓ గ్రాండ్‌స్లామ్ గెలుస్తున్నా. మూడోసారి కూడా టైటిల్ గెలిచి వచ్చే ఏడాది మరింత ప్రత్యేకంగా నిలుపుకుంటా’ అని వావ్రింకా వ్యాఖ్యానించాడు. -
‘స్విస్’ షో...
♦ సెమీస్‌లో ఫెడరర్, వావ్రింకా ‘ఢీ’ ♦ క్వార్టర్స్‌లో అలవోక విజయాలు ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ తమ ప్రత్యర్థులకు ఆద్యంతం తేరుకునే అవకాశం ఇవ్వకుండా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, స్టానిస్లాస్ వావ్రింకా అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెడరర్ ధాటికి 12వ సీడ్ రిచర్డ్ గాస్కే... వావ్రింకా దూకుడుకు 15వ సీడ్ అండర్సన్ చేతులెత్తేశారు. ఫెడరర్, వావ్రింకా భీకరమైన ఫామ్‌లో ఉండటంతో ఈ ఇద్దరు మిత్రుల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సూపర్ షో కొనసాగుతోంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-3, 6-1తో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ను చిత్తుగా ఓడించాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క సెట్ కూడా కోల్పోని ఫెడరర్, ఓవరాల్‌గా తన సర్వీస్‌లో ప్రత్యర్థులకు కేవలం రెండు గేమ్‌లు మాత్రమే సమర్పించుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించిన గాస్కే... ఫెడరర్‌తో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. 87 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఏకంగా 16 ఏస్‌లు సంధించడంతోపాటు 50 విన్నర్స్ కొట్టాడు. కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసిన అతను ప్రత్యర్థికి ఒక్కసారి కూడా తన సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు గాస్కే సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 28 సార్లు నెట్ వద్దకు వచ్చి 23 సార్లు పాయింట్లు సంపాదించడం విశేషం. పదోసారి యూఎస్ ఓపెన్‌లో కనీసం సెమీస్‌కు చేరిన ఫెడరర్ ఐదుసార్లు టైటిల్ సాధించి, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-4, 6-0తో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన అండర్సన్ ఈ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న అండర్సన్ 12 ఏస్‌లు సంధించినప్పటికీ, తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ముర్రేలాంటి స్టార్ ప్లేయర్‌ను ఓడించిన అండర్సన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడిన వావ్రింకా అనుకున్న ఫలితాన్ని సాధించాడు. అండర్సన్ శక్తివంతమైన సర్వీస్‌లకు చక్కని రిటర్న్‌లతో సమాధానం ఇచ్చిన వావ్రింకా అతని సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. సెమీఫైనల్లో తన దేశానికే చెందిన ఫెడరర్‌తో వావ్రింకా తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 16-3తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించిన వావ్రింకాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. హలెప్ అద్భుత విజయం మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 20వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-3, 4-6, 6-4తో విజయం సాధించి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత పొందింది. 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్స్‌లో హలెప్ మూడో సెట్ ఆరంభంలో తన సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనకబడింది. ఈదశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తర్వాత హలెప్ పుంజుకొని స్కోరును 2-2తో సమం చేసింది. ఈ తర్వాత మరోసారి అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. 1997లో ఇరీనా స్పిర్లియా తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి రుమేనియా ప్లేయర్‌గా హలెప్ గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రొబెర్టా విన్సీ (ఇటలీ)తో సెరెనా విలియమ్స్; ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)తో సిమోనా హలెప్ తలపడతారు. -
యూఎస్ ఓపెన్‌లో స్విస్ వీరుల జోరు
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, వావ్రింకా ముందంజ వేశారు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లలో ప్రత్యర్ధులను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ఆరో టైటిల్ పై కన్నేసిన రెండో సీడ్ ఫెదరర్ 7-6, 7-6, 7-5 స్కోరు తేడాతో యూఎస్ ప్లేయర్, 13 వ సీడ్ జాన్ ఇస్నర్‌పై విజయం సాధించాడు. రోజర్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ప్రత్యర్ధికి కోల్పోకపోవడం గమనార్హం. స్విట్జర్లాండ్ మరో ఆటగాడు, ఐదో సీడ్ వావ్రింకా కూడా యూఎస్ ఓపెన్ లో జోరు కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 6-4, 1-6, 6-3, 6-4 తేడాతో అమెరికాకు చెందిన డొనాల్డ్ యంగ్‌ను మట్టికరిపించాడు. కానీ టోర్నీలో తొలిసారిగా ఓ సెట్‌ను ప్రత్యర్ధికి కోల్పోయాడు. అయితేనేం, తొమ్మిది గ్రాండ్ స్లామ్లలో వరుసగా ఎనిమిదో సారి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్‌ను మట్టికరిపించి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకుని జోరుమీదున్న ఈ స్విస్ వీరుడు ఇదే దూకుడు కొనసాగిస్తే మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉందని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఫెడరర్... ఫటాఫట్...
♦ వరుసగా 15వసారి ప్రిక్వార్టర్స్‌లోకి ♦ ముర్రే, వావ్రింకా కూడా ముందంజ ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ కొత్త వ్యూహాలకు పదును పెడుతూ... అనుభవాన్ని రంగరిస్తే... వయసుతో సంబంధం లేకుండా తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించి అలవోక విజయాలు సాధించవచ్చని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నిరూపిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వింబుల్డన్ టోర్నీలో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతను యూఎస్ ఓపెన్‌లో ఈసారి దూసుకెళ్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థికి సెట్ కోల్పోకుండా ఈ ఐదుసార్ల మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఫెడరర్‌తోపాటు మాజీ విజేత ఆండీ ముర్రే, ఐదో సీడ్ వావ్రింకా, ఆరో సీడ్ బెర్డిచ్లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. న్యూయార్క్ : గతంలో తనకెంతో కలిసొచ్చిన వేదికపై ఫెడరర్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తనకు ఎదురైన అనుకూల ‘డ్రా’ను సద్వినియోగం చేసుకుంటూ, పక్కాగా ఆడుతూ ఒక్కో అడ్డంకిని దాటుతున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ స్విట్జర్లాండ్ స్టార్ వరుసగా 15వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-4, 6-4తో 29వ సీడ్ ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు. గంటా 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 34 ఏళ్ల ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. అయితే ఫెడరర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. వింబుల్డన్ టోర్నమెంట్ తర్వాత ఫెడరర్ తన సర్వీస్‌ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక కోల్ష్రైబర్తో ఇప్పటివరకు ఆడిన 10 సార్లూ ఫెడరరే నెగ్గడం విశేషం. ఈసారీ ఫెడరర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడు తూ కోల్ష్రైబర్పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. పదునైన సర్వీస్‌లు సంధిస్తూ... శక్తివంతమైన రిటర్న్ షాట్లు కొడుతూ... నెట్ వద్దకు తరచూ దూసుకువచ్చిన ఫెడరర్ నిలకడగా పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో ఫెడరర్ ప్రత్యర్థి ఆటగాళ్ల సర్వీస్‌ను రిటర్న్ చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. అతని ఆటతీరును చూశాక మునుపటి ఫెడరర్ కనిపిస్తున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 4-1తో ఆధిక్యంలో ఉన్నాడు. మూడో రౌండ్లో జాన్ ఇస్నెర్ 6-3, 6-4తో తొలి రెండు సెట్లు గెలిచాక, అతని ప్రత్యర్థి వాసెలి (చెక్ రిపబ్లిక్) మెడ నొప్పి కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. చెమటోడ్చిన బెర్డిచ్ మరోవైపు మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 30వ సీడ్ థామస్ బెలూచి (బ్రెజిల్)తో జరిగిన మూడో రౌండ్లో ముర్రే 6-3, 6-2, 7-5తో విజయం సాధించాడు. రెండు గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తన సర్వీస్‌లో ఒకే గేమ్‌ను కోల్పోయాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/5), 6-4తో బెమెల్మన్స్ (బెల్జియం)పై గెలుపొందగా... ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (2/7), 7-6 (9/7), 6-3, 6-3తో 31వ సీడ్ లోపెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బెర్డిచ్, రెండోసెట్‌ను టైబ్రేక్‌లోనే నెగ్గి పుంజుకున్నాడు. క్వార్టర్స్‌లో సిలిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సిలిచ్ 6-3, 2-6, 7-6 (7/2), 6-1తో 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-1తో 24వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో 20వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ డొనాల్డ్ యంగ్ (అమెరికా) 4-6, 0-6, 7-6 (7/3), 6-2, 6-4తో 22వ సీడ్ ట్రయెస్కీ (సెర్బియా)ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్లో 11వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్)ను ఓడించిన మాది రిగానే ఈ మ్యాచ్‌లోనూ యంగ్ తొలి రెండు సెట్లు కోల్పోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి విజేతగా నిలిచాడు. మరో ముగ్గురు అవుట్... మహిళల సింగిల్స్ విభాగంలో తాజాగా 11వ సీడ్ కెర్బర్, 16వ సీడ్ సారా ఎరాని, 18వ సీడ్ పెట్కోవిచ్ మూడో రౌండ్లోనే నిష్ర్కమించారు. 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 7-5, 2-6, 6-4తో కెర్బర్‌ను ఓడించింది. రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-2, 6-3తో రోజర్స్ (అమెరికా)పై, జొహనా కొంటా (బ్రిటన్) 7-6 (7/2), 6-3తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 7-5, 2-6, 6-1తో సారా ఎరాని (ఇటలీ)పై, లిసికి (జర్మనీ) 6-4, 4-6, 7-5తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, 24వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 1-6, 6-1, 6-4తో సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నారు. మూడో రౌండ్లో పేస్-హింగిస్ జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో యూజిన్ బౌచర్డ్ (కెనడా)-కిరియోస్ (ఆస్ట్రేలియా) జోడీ నుంచి పేస్-హింగిస్‌లకు వాకోవర్ లభించింది. క్రీడాకారులకు కేటాయించిన లాకర్ గదిలో కెనడా అమ్మాయి బౌచర్డ్ పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. దాంతో రెండో రౌండ్లో కిరియోస్-బౌచర్డ్ జంట బరిలోకి దిగలేదు. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయం 3-6, 6-3, 10-8తో కుద్రయెత్సెవా (రష్యా) -పెయా (ఆస్ట్రియా) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 6-3, 7-6 (7/4)తో ఫ్రిస్టెన్బర్గ్ (పోలండ్)-గొంజాలెజ్ (మెక్సికో) జంటపై గెలిచింది. -
క్వార్టర్స్‌లో పేస్-వావ్రింకా జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్-వావ్రింకా జంట 7-6 (7/4), 3-6, 10-3(సూపర్ టైబ్రేక్)తో వాసెక్ పోస్పిసిల్ (కెనడా)-జాక్ సోక్ (అమెరికా) జోడీపై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
పట్టు వదలని ‘వావ్రి’మార్కుడు!
సాక్షి క్రీడావిభాగం ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు ముందు జొకోవిచ్పై వావ్రింకా గెలుస్తాడని భావించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ పక్కా ప్రణాళికతో వావ్రింకా ప్రపంచ నంబర్‌వన్‌ను కంగుతినిపించాడు. నిజానికి ఈ టోర్నీ అంతటా వావ్రింకా చాలా నిలకడగా ఆడాడు. ప్రిక్వార్టర్స్‌లో 12వ సీడ్ సిమోన్‌ను చిత్తు చేసిన వావ్రింకా... క్వార్టర్స్‌లో ఫెడరర్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత లోకల్ స్టార్ సోంగాపై గెలిచి... ఫైనల్లో జొకోవిచ్ భరతం పట్టాడు. క్లే కోర్టుల మీద తన ఆటతీరు మెరుగ్గా ఉంటుందని వావ్రింకా భావిస్తాడు. కారణం తను ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్స్ బాగా ఆడతాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్‌లో టెన్నిస్ అంటే ఫెడరర్ మాత్రమే. ఈసారి ఫ్రెంచ్ టైటిల్‌తో 30 ఏళ్ల వావ్రింకాకు కూడా ఫెడరర్ స్థాయి వచ్చేసింది. దీనికోసం అతను చాలా కష్టపడ్డాడు. వ్యవసాయ కుటుంబం: వావ్రింకా తండ్రి వోల్ఫ్రామ్ వ్యవసాయం చేస్తారు. వావ్రింకా ముత్తాత చెక్ రిపబ్లిక్ నుంచి స్విట్జర్లాండ్‌కు వలస వచ్చారు. తల్లి ఇసాబెల్ది స్విస్. వావ్రింకా తల్లిదండ్రులిద్దరూ ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో వికలాంగులైన చిన్నారులకు సాయం చేస్తారు. వావ్రింకా అన్న టెన్నిస్ కోచ్. 15 ఏళ్ల వయసులో వావ్రింకా చదువుకు గుడ్‌బై చెప్పేసి పూర్తిగా టెన్నిస్ మీద దృష్టి కేంద్రీకరించాడు. జూనియర్ స్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పలు టైటిళ్లు సాధించిన స్టాన్... జూనియర్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించగలిగాడు. 17 ఏళ్ల వయసులో 2002లో ప్రొఫెషనల్ టెన్నిస్ మొదలుపెట్టాడు. జొకోవిచ్పై గెలిచి తొలి టైటిల్: 2006లో వావ్రింకా క్రొయేషియా ఓపెన్‌లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాడు. యాదృచ్ఛికంగానే అయినా అప్పుడు కూడా ఫైనల్లో జొకోవిచ్‌పైనే గెలిచాడు. అదే ఏడాది ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి దూసుకొచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెడరర్‌తో కలిసి డబుల్స్‌లో స్విస్‌కు స్వర్ణం అందించాడు. 2010 వరకూ నాలుగేళ్ల పాటు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా... పలు టోర్నీల్లో సెమీస్, ఫైనల్ వరకూ వచ్చి ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. 2010లో హసన్ గ్రాండ్‌ప్రి, 2011లో చెన్నై ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాడు. 2012లో ఒక్క టైటిల్ కూడా దక్కలేదు. 2013లో ఒక ఏటీపీ టైటిల్ సాధించాడు. 2014లో చెన్నై ఓపెన్ టైటిల్ గెలిచిన వావ్రింకా... అదే జోరులో తొలిసారి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో) టైటిల్ సాధించాడు. తాజాగా ఫ్రెంచ్ విజయంతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. కుటుంబానికి దూరం: 2009లో వావ్రింకా వుయోలౌడ్ అనే మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తోంది. 2010లో వావ్రింకాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో టైటిల్స్ లేక ఆట గాడితప్పి వావ్రింకా ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెన్నిస్‌పై దృష్టి పెట్టేందుకు వావ్రింకా భార్యకు దూరంగా ఉంటున్నాడని స్విస్ మీడియాలో 2011లో తొలిసారి కథనం వచ్చింది. తర్వాత మళ్లీ కొంతకాలం కలిసి ఉన్నా... ఈ ఏప్రిల్‌లో భార్య నుంచి పూర్తిగా విడిపోతున్నట్లు వావ్రింకా ప్రకటించాడు. వాళ్ల సరసన చేరినట్లే(నా)! తాజాగా వావ్రింకా నాలుగో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్, ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నాదల్ పదో ర్యాంక్‌కు పడిపోయినా అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఈ నలుగురి సరసన చేరే స్థాయి తనకు లేదని అంటున్నాడు వావ్రింకా. ‘నా స్థాయికి నేను రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం సంతోషంగా ఉంది. ఆ నలుగురూ దిగ్గజాలు. వారిని అందుకోవడం చాలా కష్టం’ అని చెప్పాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఈ నలుగురితో పాటు వావ్రింకాను మినహాయిస్తే... మిగిలిన (నిషికోరి, బెర్డిచ్, ఫెరర్, సిలిచ్) వాళ్లందరిపై ఫ్రెంచ్ చాంపియన్ది పైచేయి. కాబట్టి అతన్ని ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్కు ప్రధాన పోటీ దారుగా టెన్నిస్ ప్రపంచం భావిస్తోంది. -
ఎర్రకోటలో కొత్త రాజు
♦ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా ♦ ఫైనల్లో జొకోవిచ్పై అద్భుత విజయం ♦ రూ. 12 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ♦ సెర్బియా స్టార్‌కు మళ్లీ నిరాశ సౌండ్ చేయకుండా ‘సెలైంట్ కిల్లర్’లా ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టానిస్లాస్ వావ్రింకా పెను సంచలనమే సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... సెమీఫైనల్లో ఆండీ ముర్రే అడ్డంకిని తొలగించుకొని... ఇక ‘ఫ్రెంచ్ కిరీటం’ తనదే అనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆశలను ఆవిరి చేసి వావ్రింకా ఎర్రకోటలో కొత్త రాజుగా అవతరించాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్ టెన్నిస్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొచ్చేవాడు. ఇక నుంచి ఆ స్థానంలో వావ్రింకా పేరు కూడా మదిలో మెదులుతుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను విజేతగా నిలువడం గాలివాటమేమీ కాదని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో వావ్రింకా నిరూపించాడు. పారిస్ : అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించిన నొవాక్ జొకోవిచ్‌కు ఫైనల్లో మాత్రం చుక్కెదురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వావ్రింకా 4-6, 6-4, 6-3, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన వావ్రింకా ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 18 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 9 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 41 లక్షలు) లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ అంతిమ సమరంలో తొలి సెట్‌ను నెగ్గి శుభారంభం చేశాడు. ఏడో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని జొకోవిచ్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి వావ్రింకా పుంజుకున్నాడు. చూడచక్కనైన బ్యాక్‌హ్యాండ్ షాట్లు, పదునైన ఏస్‌లతో చెలరేగిన అతను పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత మూడో సెట్, నాలుగో సెట్లోనూ వావ్రింకా కీలకదశల్లో పైచేయి సాధించి జొకోవిచ్ ఓటమిని ఖాయం చేశాడు. విశేషాలు ►1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలు ర సింగిల్స్ టైటిల్‌తోపాటు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా వావ్రింకా గుర్తింపు పొందాడు. 2003లో వావ్రింకా ఇదే టోర్నీలో జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. ►1990లో ఆండ్రీ గోమెజ్ (ఈక్వెడార్) తర్వాత పెద్ద వయస్సులో (30 ఏళ్లు) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా వావ్రింకా నిలిచాడు. ► 2005లో రాఫెల్ నాదల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు వావ్రింకా. ► ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్‌స్లామ్’ సాధించాలని ఆశించిన జొకోవిచ్‌కు మూడోసారీ నిరాశే ఎదురైంది. 2012, 2014లలో నాదల్ చేతిలో ఫైనల్లో ఓడిన జొకోవిచ్‌కు ఈసారి వావ్రింకా షాక్ ఇచ్చాడు. ‘ఇదో గొప్ప అనుభూతి. గతంలో నేను ఎన్నడూ ఇంత ఉద్వేగానికి గురి కాలేదు. ఇంతకుముందు ఈ మైదానంలో ఫైనల్ ఆడినా విజేత కాలేని నా కోచ్ మాగ్నస్ నార్మన్కు ఈ టైటిల్‌ను అంకితం ఇస్తున్నాను’ -వావ్రింకా ‘ఈ సమయంలో మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఇదో అద్భుతమైన టోర్నీ. ఈ ట్రోఫీ కోసం వచ్చే ఏడాది కూడా నా పోరాటం కొనసాగిస్తా. చాంపియన్‌లా ఆడిన వావ్రింకాకు నా అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు’ -జొకోవిచ్ -
ఫ్రెంచ్ ఓపెన్ విజేత వావ్రింకా
-
జొకోవిచ్ X వావ్రింకా
♦ నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ♦ సా. గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : తన ఖాతాలో లోటుగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకునేందుకు జొకోవిచ్... మరో సంచలన విజయంతో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో వావ్రింకా.... నేడు జరిగే పురుషుల సింగిల్స్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... హోరాహోరీ సెమీఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 6-3, 6-3, 5-7, 5-7, 6-1తో నెగ్గిన జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవడానికి ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్ అందని ద్రాక్షగా ఉంది. 2012, 2014లలో అతను ఫైనల్‌కు చేరుకున్నా నాదల్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి నాదల్, ఫెడరర్, ముర్రే అడ్డులేకపోవడంతో జొకోవిచ్ లక్ష్యం నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ప్రిక్వార్టర్స్‌లో బెర్డిచ్, క్వార్టర్స్‌లో ఫెడరర్, సెమీస్‌లో సోంగాను ఓడించిన వావ్రింకా అదే దూకుడును ఫైనల్లో కనబర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించిన వావ్రింకా మంచి ఫామ్‌లో ఉన్న జొకోవిచ్‌ను నిలువరించి ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ విజేతగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 18-3తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు. -
హోరాహోరీగా రెండో సెమీస్
♦ ఆధిక్యంలో జొకోవిచ్ ♦ మ్యాచ్ నేటికి వాయిదా వావ్రింకా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో శనివారమే తేలనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ వెలుతురు మందగించిన కారణంగా నేటికి వాయిదా పడింది. అప్పటికి జొకోవిచ్ తొలి రెండు సెట్లను 6-3, 6-3తో సొంతం చేసుకోగా... మూడో సెట్‌ను ముర్రే 7-5తో నెగ్గాడు. నాలుగో సెట్లో ఇద్దరూ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను కొనసాగించేందుకు తగినంత వెలుతురు లేకపోవడంతో నిర్వాహకులు ఆటను నిలిపి వేశారు. శనివారం ఇదే స్కోరు నుంచి మ్యాచ్‌ను కొనసాగిస్తారు. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు నెగ్గి మరోసారి మ్యాచ్‌ను మూడు సెట్లలో ముగిస్తాడనిపించింది. అయితే మూడో సెట్లో ముర్రే అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 11వ గేమ్‌లో మ్యాచ్‌లోనే తొలిసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయి ప్రమాదం నుంచి గట్టెక్కిన ముర్రే స్కోరును 3-3తో సమం చేశాడు. -
వారె‘వావ్రింకా’
తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు సెమీస్‌లో సోంగాపై విజయం ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తున్న వావ్రింకా అదే జోరుతో ఫైనల్‌కు చేరాడు. ఫెడరర్‌నే మట్టికరిపించిన వావ్రింకా ముందు సోంగా నిలబడలేకపోయాడు. జొకోవిచ్, ముర్రేల మధ్య సెమీస్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో వావ్రింకా తలపడతాడు. పారిస్ : గతేడాది తొలి రౌండ్లోనే ఓడిన వావ్రింకా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-7 (1/7), 7-6 (7/3), 6-4తో 14వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీలో అడుగుపెట్టిన వావ్రింకా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ అంతిమ పోరాటానికి చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఈ స్విట్జర్లాండ్ ప్లేయర్ పురుషుల విభాగంలోనూ ఈ ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్నాడు. ఈ స్విస్ ఆటగాడి దూకుడుతో ఫ్రాన్స్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 1988లో హెన్రీ లెకొంటె తర్వాత సోంగా రూపంలో మరో ఫ్రాన్స్ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరుకుంటాడని భావించినా అది సాధ్యపడలేదు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను, క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్)ను ఓడించిన సోంగా సెమీస్‌లోనూ పోరాడినా కీలకదశలో తడబడ్డాడు. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను వరుస సెట్లలో చిత్తు చేసిన వావ్రింకా అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతోపాటు పదునైన ఏస్‌లతో చెలరేగిన వావ్రింకా మ్యాచ్ మొత్తంలో మూడుసార్లు సోంగా సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో వావ్రింకా కెరీర్లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. 2014లో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. -
ఫైనల్ కు చేరిన వావ్రింకా
-
ఫైనల్ కు చేరిన వావ్రింకా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో వావ్రింకా ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా శుక్రవారం సోంగాతో జరిగిన పోరులో వావ్రింకా జయభేరి మోగించాడు. వావ్రింకా 6-3, 6-7(1-7), 7-6, 6-4 తేడాతో సోంగాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైయ్యాడు. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన వావ్రింకా.. రెండో గేమ్ ను కోల్పోయాడు. వావ్రింకా అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను సోంగాకు అప్పగించాడు. అయితే ఆ తరువాత వరుసుగా మూడు, నాలుగు సెట్లలో మాత్రం సోంగాకు వావ్రింకా చుక్కలు చూపించాడు. దీంతో జకోవిచ్-ముర్రే సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో వావ్రింకా ఆమీతుమీకి సిద్దమైయ్యాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో నువాక్ జోకోవిచ్ ఫైనల్ కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జోకోవిచ్ 7-6(7-1),3-6, 6-4, 4-6, 6-0 తేడాతో వావ్రింకాను ఓడించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండో సెమీ ఫైనల్లో జోకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. టై బ్రేక్ దారి తీసిన తొలి సెట్ లో జోకోవిచ్ సునాయాసంగా విజయంగా సాధించాడు. అయితే ఆ ఆశలకు సెకెండ్ సెట్ లో గండికొట్టాడు వావ్రింకా. రెండో సెట్ ను వావ్రింకా గెలుచుకుని జోకోవిచ్ కు సవాల్ విసిరాడు. అనంతరం మూడు సెట్ జోకోవిచ్ కైవశం చేసుకున్నా.. నాల్గో సెట్ ను మాత్రం కోల్పోయాడు. దీంతో నాలుగు సెట్ లు పూర్తయ్యే సరికి ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. ఈ సెట్ లో ఏమాత్రం పొరపాట్లను దరిచేరనీయని జోకోవిచ్ సునాయాసంగా గెలుచుకుని తుది పోరుకు సిద్దమయ్యాడు.జోకోవిచ్-ఆండీ ముర్రేల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
వావ్రింకాకు ‘చేదు’ అనుభవం!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం అంటే అన్నింటికీ లెసైన్స్ వచ్చేసినట్లే అని భావించినట్లున్నాడు వావ్రింకా. పాపం...నాదల్లాంటి దిగ్గజాన్ని ఓడించిన ఘనత సాధించి కొన్ని గంటలైనా గడవక ముందే అతనికి ఆసీస్ గడ్డపై చేదు అనుభవం ఎదురైంది. అతను ఎంత గొప్ప విజయం అందుకున్నా... అవన్నీ జాన్తానై, రూల్స్ అంటే రూల్సే అని ఒక బార్లో తెలిసొచ్చింది. వివరాల్లోకెళితే...విజేతగా నిలిచిన రాత్రి ఒంటి గంట తర్వాత మందు పార్టీ చేసుకునేందుకు వావ్రింకా దాదాపు 20 మంది స్నేహితులతో కలిసి మెల్బోర్న్ నగరంలో తిరిగాడు. అయితే ఒక బార్లో మాత్రం ఈ స్విస్ స్టార్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాబీలో షాంపేన్ గ్లాస్ అందుకొని స్నేహితులతో బార్లోకి వెళుతుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడ చాలా స్థలం ఖాళీగా ఉన్నా వీరికి అనుమతి లభించలేదు. దాంతో అసహనంతో షాంపేన్ పారబోసిన వావ్రింకా, లాంజ్‌లోనే గ్లాస్ పడేసి వెళ్లిపోయాడు. అతను ఎవరైనా తమకు... తమ నిబంధనలు మారవని అని యాజమాన్యం తేల్చేసింది. ఇంతకీ కారణమేమిటంటే...ఒకే సమయంలో గరిష్టంగా అక్కడ 12 మందిని అనుమతిస్తారు కాబట్టి వావ్రింకాను వెనక్కి పంపించామని బార్ వాళ్లు జవాబిచ్చారు! చివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు తమకు తెలిసిన బార్ల సమాచారం ఇచ్చారు. అక్కడ అతనికి గౌరవ మర్యాదలు లభించాయి. పట్టలేని ఆనందంతో ఉదయం 5 గంటల వరకు వావ్రింకా అక్కడ చిత్తుగా తాగుతూనే కూర్చున్నాడట! -
‘చెన్నై’ కింగ్ వావ్రింకా
చెన్నై: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్‌లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ వావ్రింకా 7-5, 6-2తో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ విజయంతో కార్లోస్ మోయా (2004, 05); మారిన్ సిలిచ్ (2009, 10) తర్వాత చెన్నై ఓపెన్‌ను రెండుసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు. 2011లో ఈ స్విస్ స్టార్ తొలిసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. కెరీర్లో 500వ మ్యాచ్ ఆడిన వావ్రింకాకు ఫైనల్లోనూ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన క్రమంలో అతను తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 95 నిమిషాలపాటు సాగిన ఫైనల్ ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే స్కోరు 5-5వద్ద ఉన్నదశలో వాసెలిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వావ్రింకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 72,490 డాలర్లు (రూ. 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. డబుల్స్ టైటిల్‌ను బ్రున్స్ట్రోమ్ (స్వీడన్)-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్) జోడి గెల్చుకుంది. ఫైనల్లో ఈ జంట 6-2, 4-6, 10-7తో పావిక్-ద్రగంజా (క్రొయేషియా) ద్వయంపై నెగ్గింది. -
డిఫెండింగ్ చాంపియన్ ముర్రేపై సంచలన విజయం
ముర్రే మెరుపులకు బ్రేక్ పడింది. తాను ఆడిన చివరి నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకొని రెండింటిలో టైటిల్ సాధించిన ఈ బ్రిటన్ స్టార్ యూఎస్ ఓపెన్‌లో నమ్మశక్యంకాని రీతిలో ఓడిపోయాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నీడలో అంతగా గుర్తింపు పొందలేకపోయిన వావ్రింకా తన కెరీర్లో చిరస్మరణీయ విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ముర్రేను వరుస సెట్లలో ఓడించి యూఎస్ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం నమోదు చేశాడు. న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేశాడు. తొమ్మిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) నమ్మశక్యంకానిరీతిలో ఆడుతూ వరుస సెట్లలో 6-4, 6-3, 6-2తో ముర్రేను బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో వావ్రింకా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. వరుసగా 35వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న వావ్రింకా ఈ మెగా ఈవెంట్స్‌లో అత్యుత్తమంగా మూడుసార్లు (2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2010 యూఎస్ ఓపెన్) క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 2004లో ఆండీ రాడిక్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. ఏకపక్షంగా... ఈసారి టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ముర్రే క్వార్టర్ ఫైనల్లో పేలవ ఆటతీరును కనబరిచాడు. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఆద్యంతం దూకుడుగా ఆడటంతో ఈ బ్రిటన్ స్టార్ ఏదశలోనూ తేరుకోలేకపోయాడు. తొలి సెట్లో, రెండో సెట్లో ఒక్కోసారి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ మూడో సెట్లో రెండుసార్లు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు మ్యాచ్ మొత్తంలో ముర్రేకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా రాలేకపోవడం గమనార్హం. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 30 అనవసర తప్పిదాలు చేసిన ముర్రేకు తానాడిన 146 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం కేవలం ఇది రెండోసారి మాత్రమే. 2008 వింబుల్డన్ టోర్నీలో నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ముర్రేకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు. వరుసగా 14వ సారి సెమీస్‌లోకి పురుషుల సింగిల్స్‌లోని మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 3-6, 6-0తో 21వ సీడ్ యూజ్నీ (రష్యా)పై గెలిచాడు. తన కెరీర్లో వరుసగా 14వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, వరుసగా ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. అయితే ఈ టోర్నీలో తొలిసారి ప్రత్యర్థికి ఒక సెట్‌ను కోల్పోయాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో వావ్రింకాతో జొకోవిచ్; గాస్కేతో నాదల్ ఆడతారు. సానియా జోడి ఓటమి యూఎస్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా-జెంగ్ జీ (చైనా) జోడి 2-6,2-6తో యాష్లే బార్తీ-కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఒక్కో సెట్లో మూడేసిసార్లు తమ సర్వీస్‌లను కోల్పోయింది.