హోరాహోరీగా రెండో సెమీస్
♦ ఆధిక్యంలో జొకోవిచ్
♦ మ్యాచ్ నేటికి వాయిదా
వావ్రింకా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో శనివారమే తేలనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ వెలుతురు మందగించిన కారణంగా నేటికి వాయిదా పడింది. అప్పటికి జొకోవిచ్ తొలి రెండు సెట్‌లను 6-3, 6-3తో సొంతం చేసుకోగా... మూడో సెట్‌ను ముర్రే 7-5తో నెగ్గాడు. నాలుగో సెట్‌లో ఇద్దరూ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను కొనసాగించేందుకు తగినంత వెలుతురు లేకపోవడంతో నిర్వాహకులు ఆటను నిలిపి వేశారు.
శనివారం ఇదే స్కోరు నుంచి మ్యాచ్‌ను కొనసాగిస్తారు. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు నెగ్గి మరోసారి మ్యాచ్‌ను మూడు సెట్‌లలో ముగిస్తాడనిపించింది. అయితే మూడో సెట్‌లో ముర్రే అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 11వ గేమ్‌లో మ్యాచ్‌లోనే తొలిసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయి ప్రమాదం నుంచి గట్టెక్కిన ముర్రే స్కోరును 3-3తో సమం చేశాడు.