♦ నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
♦ సా. గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
పారిస్ : తన ఖాతాలో లోటుగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకునేందుకు జొకోవిచ్... మరో సంచలన విజయంతో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో వావ్రింకా.... నేడు జరిగే పురుషుల సింగిల్స్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... హోరాహోరీ సెమీఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 6-3, 6-3, 5-7, 5-7, 6-1తో నెగ్గిన జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవడానికి ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.
ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్ అందని ద్రాక్షగా ఉంది. 2012, 2014లలో అతను ఫైనల్‌కు చేరుకున్నా నాదల్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి నాదల్, ఫెడరర్, ముర్రే అడ్డులేకపోవడంతో జొకోవిచ్ లక్ష్యం నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ప్రిక్వార్టర్స్‌లో బెర్డిచ్, క్వార్టర్స్‌లో ఫెడరర్, సెమీస్‌లో సోంగాను ఓడించిన వావ్రింకా అదే దూకుడును ఫైనల్లో కనబర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించిన వావ్రింకా మంచి ఫామ్‌లో ఉన్న జొకోవిచ్‌ను నిలువరించి ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ విజేతగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 18-3తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు.
జొకోవిచ్ X వావ్రింకా
Published Sun, Jun 7 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement