
కుమారుడితో షరపోవా జంట(PC: Maria Sharapova Instagram)
తల్లైన మాజీ టెన్నిస్ స్టార్... ఆమె కొడుకు పేరేంటో తెలుసా?
Maria Sharapova Welcomes Son: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తల్లయ్యారు. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి పేరు థియోడర్ అని షరపోవా వెల్లడించారు.
కాగా 35 ఏళ్ల ఈ రష్యన్ బ్యూటీ షరపోవా.. బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ జంట జూలై 1న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘మా కుటుంబానికి అత్యంత అందమైన.. ఎంతో గొప్పదైన బహుమతి లభించింది.. థియోడర్’’ అంటూ తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తమ చిన్నారి పాపాయితో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఇక తన కెరీర్‌లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పదిహేడేళ్ల వయసులో 2004లో తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆమె.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌కు 2020లో ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు.
చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్