న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్‌లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు.
3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
కెరీర్‌లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్‌లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు.
తొలి సెట్‌లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది.
టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment