
లిమా (పెరూ): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) రెండో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం భారత షూటర్లు రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య బోర్సె రజత పతకాలు సాధించారు.
ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబూటా 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 253.4 పాయింట్లతో చైనా షూటర్ షెంగ్ లిహావో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. పెనీ మార్టన్ (హంగేరి; 229.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.
ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 104.8 పాయింట్లతో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య ద్వయం 11–17తో జెనెట్ హెగ్–జాన్ హెర్మన్ హెగ్ (నార్వే) జంట చేతిలో ఓడిపోయింది. సోమవారంతో ముగియనున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది.