World Cup Tournament
-
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై (చైనా): ఆర్చరీ సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత క్రీడాకారుల గురి అదిరింది. మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు స్వర్ణ పతకాల రేసులో నిలిచాయి. బుధవారం జరిగిన టీమ్ విభాగాల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత జట్లు నిలకడగా రాణించాయి.ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–230 పాయింట్ల తేడాతో టర్కీ జట్టును ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో సురేఖ బృందం 235–230 పాయింట్ల తేడాతోనే ఎస్టోనియా జట్టుపై గెలిచింది.శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో భారత మహిళల జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన సురేఖ జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది.మరోవైపు అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు తొలి రౌండ్లో 233–227తో ఫిలిప్పీన్స్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్ జట్టుపై, సెమీఫైనల్లో 235–233తో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుపై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోటీపడుతుంది. -
ప్రజ్ఞానంద జట్టుకు టైటిల్
డసెల్డార్ఫ్ (జర్మనీ): గతవారం ప్రపంచకప్ టోర్నమెంట్లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రపంచ ర్యాపిడ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞానంద రాణించి తన జట్టు విజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో స్విస్ ఫార్మాట్లో 12 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జర్మనీ వ్యాపారవేత్త, చెస్ ప్లేయర్ అయిన వాదిమ్ రోసెన్‌స్టీన్ (డబ్ల్యూఆర్) జట్టు 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. డబ్ల్యూఆర్ జట్టుకు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా), నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్), నిపోమ్‌నిషి (రష్యా), క్రిస్టాఫ్ (పోలాండ్), కీమర్ (జర్మనీ), హు ఇఫాన్ (చైనా), కోస్టెనిక్ (స్విట్జర్లాండ్), వాదిమ్ రోసెన్‌స్టీన్ (జర్మనీ) ప్రాతినిధ్యం వహించారు. ప్రజ్ఞానంద మొత్తం ఏడు గేమ్‌లు ఆడి ఆరు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించి 6.5 పాయింట్లు సాధించాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, డానిల్ దుబోవ్ తదితరులు సభ్యులుగా ఉన్న ఫ్రీడమ్ జట్టు 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. పుణేకు చెందిన ఎంజీడీ1 జట్టు 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఎంజీడీ1 జట్టు తరఫున భారత గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ, హారిక, అర్జున్, నిహాల్ సరీన్, రౌనక్, ఆదిత్య మిట్టల్, శ్రీనాథ్ నారాయణన్, గునే మమద్‌జాడా (అజర్బైజాన్) పోటీపడ్డారు. వ్యక్తిగత విభాగాలకొస్తే బోర్డు–1పై హరికృష్ణ కాంస్యం, బోర్డు–3పై విదిత్, అర్జున్ రజత, కాంస్య పతకాలను నెగ్గారు. బోర్డు–7పై హారిక రజత పతకం దక్కించుకుంది. -
తొలిసారి ఫైనల్లో ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈసారి కొత్త జట్టు చాంపియన్‌గా అవతరించనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. తద్వారా మూడో ప్రయత్నంలో ఆ జట్టు తొలిసారి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 2015, 2019 టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ తరఫున ఎల్లా టూన్ (36వ ని.లో), లౌరెన్ హెంప్ (71వ ని.లో), అలెసియా రుసో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు సామ్ కెర్ (63వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 1–0తో స్వీడన్ జట్టును ఓడించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ప్రపంచకప్ టోర్నీ జరగ్గా... నాలుగుసార్లు అమెరికా (1991, 1999, 2015, 2019)... రెండుసార్లు జర్మనీ (2003, 2007), ఒక్కోసారి నార్వే (1995), జపాన్ (2011) జట్లు టైటిల్ సాధించాయి. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు
ఇప్పటి వరకు 92 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో ఆఫ్రికా ఖండానికి చెందిన 13 దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి. మూడు దేశాలు కామెరూన్, ఘనా, సెనెగల్ ఒక్కోసారి క్వార్టర్ ఫైనల్ చేరి అక్కడి నుంచే ఇంటిదారి పట్టాయి. ఎట్టకేలకు 49వ ప్రయత్నంలో మొరాకో రూపంలో ఓ ఆఫ్రికా జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో మొరాకో తలపడుతుంది. దోహా: లీగ్ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుపై తాము సాధించిన విజయం... గత రన్నరప్ క్రొయేషియాను 0–0తో నిలువరించడం... గాలివాటమేమీ కాదని ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆరోసారి పోటీపడిన మొరాకో ఈసారి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది. తద్వారా ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్ దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. విఖ్యాత ప్లేయర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై హ్యాట్రిక్ చేసిన గొన్సాలో రామోస్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మొరాకో డిఫెన్స్ కూడా పటిష్టంగా ఉండటంతో పోర్చుగల్ జట్టు ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై గురి చూసి కొట్టలేకపోయారు. చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. -
Women Hockey World Cup: ఇంగ్లండ్‌ను నిలువరించిన భారత్
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. పూల్ ‘బి’లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్స్ వద్ద ‘డ్రా’ చేసుకుంది. ఆట తొమ్మిదో నిమిషంలో ఇసాబెల్లా పెటర్ గోల్‌తో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 28వ నిమిషంలో లభించిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను వందన కటారియా గోల్‌గా మల్చడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పూల్ ‘బి’లోని నాలుగు జట్లు (చైనా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్) ఒక్కో పాయింట్‌తో సమంగా ఉన్నాయి. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడుతుంది. -
భారత షూటర్ల పసిడి గురి
బీజింగ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మూడో రోజు భారత యువ షూటర్లు అదరగొట్టారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఫైనల్లో 16–6తో పాంగ్ వె–జియాంగ్ రాన్‌జిన్ (చైనా) జంటను ఓడించి పసిడి పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్–దివ్యాంశ్ సింగ్ జోడీ 17–15తో లియు రుజువాన్–యాంగ్ హావోరన్ (చైనా) ద్వయంపై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. -
జీతూకు ఆరోస్థానం
రియో డి జనీరో: భారత మేటి షూటర్ జీతూ రాయ్ ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ టోర్నమెంట్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల 50 మీ. పిస్టల్ షూటింగ్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జీతూ రాయ్ ఆరోస్థానంలో నిలిచాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో 563 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.