డసెల్‌డార్ఫ్ (జర్మనీ): గతవారం ప్రపంచకప్ టోర్నమెంట్‌లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రపంచ ర్యాపిడ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞానంద రాణించి తన జట్టు విజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో స్విస్ ఫార్మాట్‌లో 12 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జర్మనీ వ్యాపారవేత్త, చెస్ ప్లేయర్ అయిన వాదిమ్ రోసెన్‌స్టీన్ (డబ్ల్యూఆర్) జట్టు 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
డబ్ల్యూఆర్ జట్టుకు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా), నోదిర్‌బెక్ (ఉజ్బెకిస్తాన్), నిపోమ్‌నిషి (రష్యా), క్రిస్టాఫ్ (పోలాండ్), కీమర్ (జర్మనీ), హు ఇఫాన్ (చైనా), కోస్టెనిక్ (స్విట్జర్లాండ్), వాదిమ్ రోసెన్‌స్టీన్ (జర్మనీ) ప్రాతినిధ్యం వహించారు. ప్రజ్ఞానంద మొత్తం ఏడు గేమ్‌లు ఆడి ఆరు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించి 6.5 పాయింట్లు సాధించాడు.
భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, డానిల్ దుబోవ్ తదితరులు సభ్యులుగా ఉన్న ఫ్రీడమ్ జట్టు 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. పుణేకు చెందిన ఎంజీడీ1 జట్టు 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.
ఎంజీడీ1 జట్టు తరఫున భారత గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ, హారిక, అర్జున్, నిహాల్ సరీన్, రౌనక్, ఆదిత్య మిట్టల్, శ్రీనాథ్ నారాయణన్, గునే మమద్‌జాడా (అజర్‌బైజాన్) పోటీపడ్డారు. వ్యక్తిగత విభాగాలకొస్తే బోర్డు–1పై హరికృష్ణ కాంస్యం, బోర్డు–3పై విదిత్, అర్జున్ రజత, కాంస్య పతకాలను నెగ్గారు. బోర్డు–7పై హారిక రజత పతకం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment