
సెపక్‌తక్రా ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకం
పురుషుల రెగూ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన టీమిండియా
పాట్నా: సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో పురుషుల రెగూ ఈవెంట్‌లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్‌పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది.
తొలి సెట్‌లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్‌లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్‌కప్‌లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది.
మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్‌డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.