
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్‌లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.
సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేసింది.
ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..
ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్
ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్
ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్
ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్
ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్‌కే
ఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్‌కే
ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..
అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్
అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్
అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీ
అక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రా
అక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్
నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్
నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్
నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్