
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్‌ను ముగించాడు.
బ్యాటర్‌గా సూపర్ హిట్
తన పద్నాలుగేళ్ల కెరీర్‌లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.
తన అద్బుత బ్యాటింగ్‌తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధించాడు.
టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.
చిరస్మరణీయ విజయాలు
2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్‌లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్‌గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.
సారథిగా మొత్తంగా 68 మ్యాచ్‌లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.
ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు
భారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.
అసలైన టార్చ్‌బేరర్ నువ్వే
కెప్టెన్‌గా నువ్వు కేవలం మ్యాచ్‌లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్‌నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్‌లో అసలైన టార్చ్‌బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.
చదవండి: కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు