Australia tour
-
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో....
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో 28 మంది ఆటగాళ్లతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జాబితా నుంచి రబిచంద్ర సింగ్‌ను తప్పించి మిగతా 27 మందితో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు పెర్త్ వేదికగా ఏప్రిల్ 1, 6, 7, 10, 12, 13వ తేదీల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు); హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్, సుమిత్, అమీర్ అలీ (డిఫెండర్లు); మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్‌కుమార్ పాల్ (మిడ్ ఫీల్డర్లు); ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, బాబీ సింగ్ ధామి (ఫార్వర్డ్స్). -
PAK Tour Of AUS: డబుల్ సెంచరీతో చెలరేగిన పాక్ కొత్త కెప్టెన్
నూతనంగా ఎంపిక చేయబడిన పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ డబుల్ సెంచరీతో (201) చెలరేగాడు. మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో నిన్న (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మసూద్‌తో పాటు అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40), సర్ఫరాజ్ అహ్మద్ (41) ఓ మోస్తరుగా రాణించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 5 వికెట్లతో విజృంభించగా.. స్టీకిటీ, మెక్ ఆండ్రూ, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్‌లో తొలి టెస్ట్ జరుగుతుంది. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. -
ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’
పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్), దీపక్ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... రోహిత్ (3), ఓపెనర్‌గా ఆడిన పంత్ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. -
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
ICC T20 World Cup: ‘ఆల్ ది బెస్ట్’
ముంబై: భారత క్రికెట్ అభిమానుల ఆశలు మోస్తూ టి20 ప్రపంచ కప్ వేటలో టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని బృందం గురువారం ముంబైనుంచి బయల్దేరి వెళ్లింది. 14 మంది జట్టు సభ్యులతో పాటు మరో 16 మంది సహాయక సిబ్బంది కూడా టీమ్‌తో ఉన్నారు. వరల్డ్‌కప్‌లోని ఇతర జట్లతో పోలిస్తే భారత్ చాలా ముందుగా ఆసీస్ గడ్డపై అడుగు పెడుతోంది. మెగా టోర్నీకి ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన దీపక్ హుడా పూర్తిగా కోలుకొని జట్టుతో చేరాడు. మరో వైపు బుమ్రా స్థానంలో ఇంకా ఎవరినీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో 14 మందే ఆసీస్‌కు వెళ్లారు. పెర్త్‌లో జట్టుకు వారం రోజుల పాటు కండిషనింగ్ క్యాంప్ జరుగుతుంది. -
ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా
టాన్స్విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేల్లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి పర్యటక జట్టు తప్పించుకుంది. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆస్ట్రేలియా 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(94) మినహా మిగితా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. కాగా అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రెగిస్ చకబ్వా (37 నటౌట్), ఓపెనర్ తాడివానాషే మారుమని (35) పరుగులతో రాణించారు. 8 ఏళ్ల తర్వాత తొలి విజయం 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని జింబాబ్వే నమోదు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వేకు ఇది మూడో విజయం కావడం విశేషం. తొలి సారిగా 1983 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. అనంతరం 2014లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయ భేరి మోగించింది. చదవండి: AUS vs ZIM: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..! -
24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై సిరీస్
పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా 24 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సిరీస్ ఆడనుంది. వచ్చే మార్చి- ఏప్రిల్ నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒప్పందం చేసుకున్నాయి. వాస్తవానికి గతేడాది నవంబర్లోనే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నప్పటికి సెక్యురిటీ కారణాల రిత్యా ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకుంది. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ కాగా తొలుత టెస్టు సిరీస్‌తో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన టి20 మ్యాచ్‌తో ముగుస్తుంది. తొలి టెస్టు రావల్పిండి.. రెండో టెస్టు కరాచీ.. మూడో టెస్టు లాహోర్ వేదికగా జరగనుంది. మూడు వన్డేలు సహా ఏకైక టి20 మ్యాచ్ రావల్పిండి వేదికగానే నిర్వహించనున్నారు. కాగా మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు చివరిసారిగా 1998లో పాకిస్తాన్లో పర్యటించింది. అప్పట్లో పాక్ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌ను 4-0తో గెలుచుకొని సూపర్ ఫామ్‌లో ఉంది. చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు ఆస్ట్రేలియా టూర్ ఆప్ పాకిస్తాన్: మార్చి 4-8: తొలి టెస్టు, రావల్పిండి మార్చి 12-16: రెండో టెస్టు, కరాచీ మార్చి 21-25: మూడో టెస్టు, లాహోర్ మార్చి 29: తొలి వన్డే, రావల్పిండి మార్చి 31: రెండో వన్డే,రావల్పిండి ఏప్రిల్ 2: మూడో వన్డే, రావల్పిండి ఏప్రిల్ 5: ఏకైక టి20 మ్యాచ్, రావల్పిండి -
తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం
మెక్కే: 3 వన్డేల సిరీస్‌లో భాగంగా హారప్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఆసీస్ మహిళా జట్టు మరో 9 ఓవర్లు మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33), మోలినెక్స్(2/ 39), డిర్లింగ్టన్(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 24న) జరుగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు.. -
ఆసీస్‌తో చారిత్రక సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్‌లో శిక్షణ శిబిరం ఉంది. భారత్‌తో సిరీస్ తర్వాత బిగ్‌బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్‌లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
నాన్నకు బాగా లేకపోవడం వల్లే...
ముంబై: రోహిత్ శర్మ తన సహరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని బీసీసీఐ కొత్తగా తేల్చి చెప్పింది. రోహిత్ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. ‘తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్ ఐపీఎల్ తర్వాత నేరుగా ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి రోహిత్ ఎన్సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడు’ అని బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్ 11న రోహిత్ ఫిట్నెస్ను మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది. ఇషాంత్ పూర్తిగా దూరం... గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాంత్ శర్మ మిగిలిన రెండు టెస్టులనుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పక్కటెముకల గాయంనుంచి పూర్తిగా కోలుకున్నా...టెస్టు మ్యాచ్‌లు ఆడే ఫిట్నెస్ స్థాయిని అతను ఇంకా అందుకోలేదని బోర్డు వెల్లడించింది. -
భారత్ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...
ముంబై: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. టూర్ మధ్యలో వెనక్కి రాకుండా సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. ‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్‌తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని సిరాజ్ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్‌కు అండగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సిరాజ్‌కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 1 వన్డే, 3 టి20లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. -
వంద శాతం ఫిట్‌గా మారేందుకే..
భారత క్రికెట్‌కు సంబంధించి ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన అంశం రోహిత్ శర్మ ఫిట్నెస్... ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అతను గాయపడి నాలుగు మ్యాచ్‌లకు దూరం కావడం... ఫిట్‌గా లేడంటూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం...ఆపై పూర్తిగా కోలుకోకుండానే రోహిత్ బరిలోకి దిగడం... గంగూలీ హెచ్చరిక, రవిశాస్త్రి వ్యాఖ్య... మళ్లీ టెస్టు జట్టులో చోటు... ఇలా ఎక్కడా అతని గాయంపై స్పష్టత లేకుండా వ్యవహారం సాగింది. చివరకు జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) చేరుకున్న రోహిత్... తొలిసారి తన గాయం తీవ్రతపై పెదవి విప్పాడు. వంద శాతం ఫిట్‌గా మారేందుకే ఆస్ట్రేలియా వన్డే, టి20లకు దూరమైనట్లు వెల్లడించిన అతను... తన గాయం వివాదంగా మారడం పట్ల అసంతృప్తిని ప్రదర్శించాడు. బెంగళూరు: ఐపీఎల్లో తాను కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విషయాన్ని అటు బీసీసీఐకి, ఇటు ముంబై ఇండియన్స్‌కు స్పష్టంగా తెలియజేసినట్లు భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ అంశంపై బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అతను చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో బయట అసలు ఏం జరుగుతుందో, అందరూ దేని గురించి చర్చించుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌కి గాయం గురించి స్పష్టంగా వివరించాను. గాయమైన తర్వాత నేను తర్వాతి మ్యాచ్‌లు ఆడగలనా లేదా అని ఆలోచించాను. అయితే మైదానంలో దిగితే తప్ప దాని తీవ్రత తెలీదు. టి20 ఫార్మాట్లో ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆడగలనంటూ ముంబై యాజమాన్యానికి చెప్పాను. ప్రతీ రోజూ ఫిట్నెస్ మెరుగవుతుండటంతో మళ్లీ బరిలోకి దిగాను. బాగుంటేనే ప్లే ఆఫ్స్ ఆడతానని, లేదంటే తప్పుకుంటానని కూడా వారికి స్పష్టం చేశాను. నా గాయం గురించి, ప్లే ఆఫ్స్‌లో ఆడటం, ఆస్ట్రేలియాకు వెళ్లడం గురించి ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు అంటే నేను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. ముందు జాగ్రత్త కోసమే... కండరాల గాయం నుంచి తాను చాలా వరకు కోలుకున్నా... మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని రోహిత్ వెల్లడించాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే ఆస్ట్రేలియాకు వెళ్లి టెస్టులు ఆడతానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు నా గాయం తీవ్రత చాలా వరకు తగ్గింది. అయితే మరింత ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నా. టెస్టు ఫార్మాట్లో ఆడాలంటే నా వైపు నుంచి ఎలాంటి లోపం ఉండకూడదని భావించే ఇప్పుడు ఎన్సీఏకు వచ్చా. పూర్తిగా మెరుగయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే 11 రోజుల వ్యవధిలో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న వన్డే, టి20 సిరీస్‌ల కోసం తొందరపడలేదు. మరో 25 రోజులు నేను శ్రమిస్తే టెస్టులు ఆడగలనని నమ్ముతున్నా. ఇది చాలా సులువైన నిర్ణయం. బయటివారికి ఇది ఎందుకు అంత కష్టంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు’ అని రోహిత్ చెప్పాడు. ఒక్కసారిగా ఫలితాలు రావు... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కవని రోహిత్ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు. ‘మరో జట్టుతో రోహిత్ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్‌గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు. పొలార్డ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్‌రైజర్స్‌కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్ చేసి వికెట్లు తీయగల బౌలర్ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్‌ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం’ అని రోహిత్ విశ్లేషించాడు. -
ఇటు ఇషాంత్... అటు సాహా!
బెంగళూరు/సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి నెల రోజుల ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. జట్టులోని ఇద్దరు కీలక సభ్యులు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న ఇషాంత్ శర్మ బుధవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధన చేయగా... సిడ్నీలో సాహా తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉంటే అతను వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరతాడు. ద్రవిడ్, సునీల్ జోషి సమక్షంలో... ఐపీఎల్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం ఇషాంత్ పొత్తికడుపు కండరాల గాయంతో తప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతను ఎన్సీఏలోనే ఉంటూ గాయానికి చికిత్స పొందుతున్నాడు. ఫిట్‌గా మారితే నవంబర్ 18 నుంచి ఇషాంత్ బౌలింగ్ చేయవచ్చని ఎన్సీఏ గతంలోనే బీసీసీఐకి సమాచారం అందించింది. బోర్డు వైద్యులు, ట్రయినర్ పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం బుధవారం అతను మైదానంలోకి దిగాడు. రెండు వేర్వేరు స్పెల్‌లలో కలిపి సుమారు రెండు గంటల పాటు ఇషాంత్ బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి అక్కడే ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌ను భారత అండర్–19 జట్టు కోచ్, మాజీ పేసర్ పారస్ మాంబ్రే పర్యవేక్షించాడు. పూర్తి రనప్, వేగంతో ఇషాంత్ బౌలింగ్ చేశాడని, ఎక్కడా కొంచెం కూడా అతను ఇబ్బంది పడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. బ్యాటింగ్ ప్రాక్టీస్... ఐపీఎల్లో కండరాల గాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సాహా... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే జట్టుతో పాటు అతనూ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బుధవారం సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు నువాన్ సెనెవిరత్నే, దయానంద గరాని నెట్స్‌లో విసిరిన బంతులను సాహా ఎదుర్కొన్నాడు. రెండు టి20లకు బుమ్రా, షమీ దూరం! ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్లు షమీ, బుమ్రాలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. డిసెంబర్ 11 నుంచి గులాబీ బంతితో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రధాన జట్టు మొత్తం బరిలోకి దిగే అవకాశం ఉండగా... అంతకుముందు డిసెంబర్ 6 నుంచి జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా షమీ, బుమ్రా ఆడాలని జట్టు కోరుకుంటోంది. అయితే 6, 8 తేదీల్లో ఆసీస్‌తో భారత్ రెండు టి20లు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టి20లనుంచి తప్పించైనా సరే... ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించడంపైనే జట్టు ఎక్కువ దృష్టి పెట్టింది. మూడు వన్డేలు, తొలి టి20 తర్వాత ఈ ఇద్దరు పేసర్లు టెస్టు సిరీస్ కోసమే సిద్ధం కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే జరిగితే చివరి రెండు టి20ల్లో చహర్, నటరాజన్, సైనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
‘మాస్టర్... అతని విద్యార్థి’
సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల సమయముంది. దానికి ముందు టీమిండియా వన్డే, టి20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే టెస్టులకు ఉన్న ప్రాధాన్యత వల్ల కావచ్చు అప్పుడే వాటి కోసం మన ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. పైగా ఐపీఎల్ కారణంగా ఇప్పటి వరకు మన ఆటగాళ్లంతా తెల్ల బంతితో సాధన చేస్తూనే వచ్చారు. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించి బీసీసీఐ మంగళవారం ఒక వీడియోను పోస్ట్ చేసింది. జట్టు టాప్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు మరో పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎరుపు, గులాబీ బంతులతో బౌలింగ్ చేయడం ఇందులో కనిపించింది. వీరిద్దరు కెప్టెన్ కోహ్లి, కేఎల్ రాహుల్ సహా ఇతర బ్యాట్స్‌మెన్‌కు సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేశారు. ‘మాస్టర్... అతని విద్యార్థి’ అంటూ షమీ, సిరాజ్‌ల బౌలింగ్‌పై బీసీసీఐ వ్యాఖ్య జోడించింది. కోహ్లి కూడా ‘టెస్టు క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లను ఇష్టపడతాను’ అంటూ కామెంట్ చేయడం టీమిండియా సన్నాహాల గురించి చెబుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఈ నెల 27న ఆస్ట్రేలియాతో తొలివన్డే ఆడుతుంది. (చదవండి: మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు) The master and his apprentice When @MdShami11 and Siraj bowled in tandem at #TeamIndia's nets. Fast and accurate! 🔥🔥 pic.twitter.com/kt624gXp6V — BCCI (@BCCI) November 17, 2020 Love test cricket practice sessions ❤️💙 pic.twitter.com/XPNad3YapF — Virat Kohli (@imVkohli) November 17, 2020 -
‘పుజారా.. ఈసారి అంత ఈజీ కాదు’
మెల్బోర్న్: ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారాకు సవాల్ తప్పదని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌నుకైవసం చేసుకుని చరిత్ర సృష్టంచగా అందులో పుజారా ప్రధాన భూమిక పోషించాడు. కాగా, ఇప్పుడు మాత్రం పుజారాకు తమ బౌలర్లు ఆ చాన్స్ ఇవ్వరని మెక్‌గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. ఒక స్పోర్ట్స్ చానల్‌తో మాట్లాడిన మెక్‌గ్రాత్.. ‘పుజారా టీమిండియా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడు. నిలకడైన బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోతాడు. పరుగులు చేయనప్పుడు ఒత్తిడిని అనుభవించడు. ఆధునిక యుగంలో ఇది ప్రత్యేకమైనది, ఇక్కడ ఒక తొలి ఓవర్ తర్వాత పరుగులు చేయాలనుకునే బ్యాట్స్ మెన్ ఉన్నారు. పుజారాకు ఆ మనస్తత్వం లేదు. (ఇక్కడ చదవండి: చరిత్రను రిపీట్ చేస్తాం: పుజారా) ఇది చివరిసారి అతనికి సహాయపడింది అని మెక్‌గ్రాత్ అన్నాడు. అతను ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదు, ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. అతను ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే కష్టపడాల్సి ఉంటుంది.ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్ తప్పదు’ అని అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా , 521 పరుగులతో మొత్తం 74.42 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆసీస్‌కు కలిసి వస్తుందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి జట్టులో లేకపోతే అది కచ్చితంగా సిరీస్‌పై ప్రభావం చూపిస్తుందన్నాడు. -
టీమిండియా ప్రాక్టీస్ షురూ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఐపీఎల్ ముగిశాక దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో ఆటగాళ్లు అవుట్డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా పంచుకుంది. సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. టీమిండియా కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మూడు ఫార్మాట్లకు (టెస్టు, వన్డే, టి20) చెందిన భారత ఆటగాళ్లందరూ ఒకేసారి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్ నటరాజన్ తెల్లబంతులతో టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు. పుజారా, కోహ్లి క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్‌తో భారత్ 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు ఆడనుంది. -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్‌లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్‌కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్‌లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్‌ను ఓడించిన భారత్‌ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్‌కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
హలో ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత క్రికెట్ బృందం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ప్రత్యేక విమానంలో దుబాయ్నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. టీమిండియా సభ్యులతో పాటు ఐపీఎల్లో ఆడిన ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, కమిన్స్ తదితరులు కూడా గురువారమే స్వదేశం చేరారు. వీరందరిని స్థానిక అధికారులు సిడ్నీ ఒలింపిక్ పార్క్ ప్రాంతానికి పంపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటీన్ కోసం వీరంతా అక్కడి పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఉన్న ‘పుల్‌మ్యాన్’ హోటల్లో బస చేశారు. క్రికెటర్ల కోసమే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక రగ్బీ టీమ్ న్యూసౌత్‌వేల్స్ బ్లూస్ జట్టును అక్కడినుంచి తరలించారు. హోటల్లో ఆటగాళ్లను మినహా ఎలాంటి అతిథులను అనుమతించడం లేదు. ‘పుల్‌మ్యాన్’ హోటల్లో విరాట్ కోహ్లి కోసం ప్రత్యేక పెంట్ హౌస్ సూట్‌ను కేటాయించారు. క్వారంటీన్ సమయంలోనే జట్టు ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రం అధికారులు అనుమతినిచ్చారు. ఆటగాళ్లు సాధన చేయాల్సిన బ్లాక్‌టౌన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ పార్క్‌ను కూడా బయో బబుల్ సెక్యూరిటీలో సిద్ధం చేశారు. ప్రాక్టీస్ కోసం మాత్రమే క్రికెటర్లు తమ హోటల్ గదులు వీడి బయటకు రావాల్సి ఉంటుంది. టీమిండియా సభ్యులలో కొందరి కోసం పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు వచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. రహానే, అశ్విన్ తమ కుటుంబాలతో అక్కడికి వెళ్లారు. కొత్త జెర్సీలతో... ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్‌ల కోసం భారత జట్టు పాత రోజులను గుర్తుకు తెచ్చే (రెట్రో) రంగు జెర్సీలతో బరిలోకి దిగనుందని సమాచారం. ఇది 1992 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ధరించిన కిట్‌ను పోలి ఉంది. -
పాపే నా అదృష్టం : గెడ్డం తీసేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్‌బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు. పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్‌లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు. అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పితృత్వ సెలవు మంజూరు కాగా నటరాజన్ మాత్రం తన ముద్దుల పాపాయిని చూసేందుకు మూడునెలలు ఆగాల్సి వస్తోంది. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు పలువురు నటరాజన్‌ను అభినందనలు ముంచెత్తారు. కాగా భుజం గాయం కారణంగా చాన్స్ మిస్ అయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో నటరాజన్ భారత టీ 2020 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!) -
తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. తొలి టెస్టు ఆడాక భారత్‌కు పయనమవుతాడు. అయితే అన్ని ఫార్మాట్లకు ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి గాయంతో ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. కేవలం టి20లకే ఎంపికైన సంజూ సామ్సన్ను ఇప్పుడు వన్డే జట్టులోనూ ఆడతాడు. నేడు జరిగే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భార్య ప్రసవం ఉండటంతో... టీమిండియా సారథి విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె డెలివరీ తేదీ జనవరిలో ఉంది. దీంతో అనుష్క ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు. ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది. రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్ 27, 29, డిసెంబర్ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు. ఆసీస్‌కు ‘హిట్‌మ్యాన్’... ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్టులాడేందుకు ఈ నెలాఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడు. రోహిత్ చేరిక, ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇదే విషయాన్ని మేం సెలక్షన్ కమిటీకి తెలియజేశాం. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునేందుకే అతనికి పరిమిత ఓవర్ల సిరీస్‌కు విశ్రాంతినిచ్చాం. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోని పునరావాస శిబిరంలో ఉన్న ఇషాంత్ శర్మతో కలిసి రోహిత్ అక్కడికి పయనమవుతాడు. గాయం దాచిన వరుణ్... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. అతన్ని టి20ల కోసం ఎంపిక చేయగా... భుజం గాయంతో అక్కడికి వెళ్లడం లేదు. ఐపీఎల్ సందర్భంగా గాయమైన సంగతిని వరుణ్ దాచి పెట్టాడని బీసీసీఐ గుర్రుగా ఉంది. అతని భుజానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాగా అతని స్థానంలో ‘యార్కర్ స్పెషలిస్ట్’, తమిళనాడు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ నటరాజన్‌ను ఎంపిక చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న వృద్ధిమాన్ సాహాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నెట్‌బౌలర్‌గా కమలేశ్ నాగర్కోటి అక్కడికి వెళ్లడం లేదు. అతన్ని ఎన్సీఏకు పంపుతున్నారు. -
సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో కష్టమే
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘బయో బబుల్’లోకి ప్రవేశించి 75 రోజులైంది. మరో ఐదు రోజులు కలుపుకుంటే 80 రోజులవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం అతను బయలుదేరాల్సి ఉంది. అక్కడా బయో బబుల్‌లో గడపాల్సి ఉండగా, జనవరి 19న పర్యటన ముగుస్తుంది. ఇదే విషయంపై కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో ఉండాల్సి రావడం చాలా కష్టమని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇండోర్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ప్రైవేట్ బీచ్‌లలో సరదాలు కొంత వరకు ఒత్తిడిని తప్పించగలవేమో తప్ప పూర్తిగా కాదని అతను అన్నాడు. ‘బయో బబుల్’లో జరిగే సిరీస్‌ల వ్యవధిని తగ్గించే విషయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ‘బయో బబుల్‌లో సహచరులతో కలిసి గడపడం, మంచి సాహచర్యం ఉండటంతో ఆరంభంలో బాగానే అనిపించింది. కానీ ఇది సుదీర్ఘంగా కొనసాగడమే సమస్య. రాన్రానూ అంతా కఠినంగా అనిపిస్తోంది. వినోదం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా... మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయం గురించి కూడా సీరియస్‌గా ఆలోచించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో సిరీస్‌ల వ్యవధి తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన వాతావరణంలో 80 రోజుల పాటు ఉంటూ మరో ప్రత్యామ్నాయం లేకుండా, భిన్నంగా కనిపించకుండా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చాలా కష్టం. ఇది మానసికంగా మాపై ప్రభావం చూపిస్తుంది’ అని కోహ్లి విశ్లేషించాడు.