ఫామ్‌పై ఆందోళన లేదు
ఎప్పుడూ బాధ్యతగానే ఆడాను
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య
చెన్నై: ఇటీవలి కాలంలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి నుంచి అభిమానులు ఆశిస్తున్న మెరుపులు లేవన్నది నిజం. గతేడాది ఆసీస్ పర్యటనలో బాగానే రాణించినా ఆ తర్వాత మాత్రం తన బ్యాట్ ద్వారా అందరినీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’పై కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే తన ఫామ్‌పై మాత్రం ఎలాంటి ఆందోళన లేదని ఈ టెస్టు కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు కోసం తానెప్పుడూ బాధ్యతగానే ఆడినట్టు గుర్తుచేశాడు... మున్ముందు కూడా సహజ శైలి లోనే ఆడతానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది భారత టెస్టు జట్టు ఎక్కువగా మ్యా చ్‌లు ఆడకున్నా... వన్డేల్లోనూ అతడి ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరిలో చివరి శతకం సాధించాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రాబో యే శ్రీలంక పర్యటన గురించి కోహ్లి చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే....
ప్రతిసారీ నూరుశాతం: ఓ బ్యాట్స్‌మన్‌గా నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఆడాను. ప్రతిసారీ జట్టు గెలుపు కోసమే నూటికి నూరు శాతం ప్రయత్నించాను. అందుకే నా బ్యాటింగ్ మెరుగుకు అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడి కోచింగ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడడంతో నాకు మంచి శిక్షణ లభించినట్టయ్యింది.దూకుడే బలం: ఫామ్‌ను అందుకోవడానికి నా దూకుడైన బ్యాటింగ్‌ను మార్చుకోవాలని అనుకోవడంలేదు. వాస్తవానికి దూకుడే బోర్డు నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు కారణమని అనుకుంటున్నాను.
లంక పర్యటన: శ్రీలంక పర్యటన నా కెప్టెన్సీలో తొలి పూర్తిస్థాయి టెస్టు సిరీస్. అందుకే చాలా ఉద్వేగంగా ఉంది. జట్టు ఆటగాళ్లు సరైన దృక్పథంతో ఆడితే లంకలో విజయం సాధిస్తాం.పేసర్లూ కీలకమే: ఓపెనర్‌గా మురళీ విజయ్ జట్టుకు నిలకడైన ఆరంభాలను అందిస్తున్నాడు. అశ్విన్, మిశ్రాలతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ ఆలోచనలు జట్టుకు ఉపయోగపడతాయి. అలాగే పేసర్లు కూడా లంక పర్యటనలో కీలకం కానున్నారు.