కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు.
షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది.
చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
Comments
Please login to add a commentAdd a comment