సమయం వచ్చేసింది... డీఆర్‘ఎస్’కు
పెరుగుతున్న మాజీల మద్దతు
ఆసీస్ పర్యటనలో నష్టపోతున్న భారత్
న్యూఢిల్లీ: తన దాకా వస్తే కానీ అసలు బాధేమిటో తెలియదంటారు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనకు తోడు అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలతో జట్టు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా అక్కడ అంపైర్ నిర్ణయ పునఃస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్) ఉంటోంది. కానీ ఎందుకో ఆది నుంచీ డీఆర్‌ఎస్‌కు భారత క్రికెట్ బోర్డు బద్ద వ్యతిరేకి. రెండు దేశాలకు సమ్మతి అయితేనే ఈ పద్ధతి అమల్లో ఉంటుంది.
కాబట్టి భారత్ ఆడే టెస్టు సిరీస్‌ల్లో డీఆర్‌ఎస్ కనిపించదు. అయితే తాజా పర్యటనలో పలు నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. జరిగిన రెండు టెస్టుల్లో కనీసం ఐదు సార్లు డీఆర్‌ఎస్ లేని కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో మాజీ ఆటగాళ్లు కొందరు ఈ పద్ధతికి మద్దతుగా గళం విప్పుతున్నారు. ఎంతగా పోరాడినప్పటికీ అంపైరింగ్ తప్పిదాలతో జట్టు ఓడిపోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని అమలు పరిచేందుకు ఇదే సరైన సమయమని వారు అంటున్నారు.
ఇక అంగీకరించాల్సిందే
‘జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం కూడా డీఆర్‌ఎస్ పద్ధతికి మద్దతు ఇవ్వక తప్పదు. ఓసారి రెండు టెస్టులను గమనించండి. భారత్ పోరాడినా కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లు వెనుదిరగాల్సి వచ్చింది. ధావన్, పుజారా, అశ్విన్ నిర్ణయాల్లో డీఆర్‌ఎస్ ఉండి ఉంటే తప్పకుండా రెండు టెస్టుల్లోనూ విజయం సాధించే అవకాశం ఉండేది. అయితే వ్యక్తిగతంగా ఈ పద్ధతిలో వంద శాతం కచ్చితత్వం ఉంటుందని చెప్పలేను. అయినా 90 శాతం ఉన్నా ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కదా.’
-హర్భజన్ సింగ్ (స్పిన్నర్)
నేను వ్యతిరేకం కాదు
‘సాంకేతికంగా ఎలాంటి పద్ధతితోనైనా కచ్చిత నిర్ణయాలు వస్తే వాటిని స్వాగతించాల్సిందే. నేను డీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదు. అయితే వంద శాతం కచ్చిత నిర్ణయాలు రావాలంటే ఈ పద్ధతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హాట్‌స్పాట్ లేక హాక్‌ఐ ద్వారా ఎల్బీను పరిశీలించడంపై నమ్మకం ఉంచలేకపోతున్నాను. ఈ రెండు విషయాలు డీఆర్‌ఎస్ పద్ధతిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది.’
-వీవీఎస్ లక్ష్మణ్ (మాజీ టెస్టు ఆటగాడు)
భారత్‌కే ఎందుకు అభ్యంతరం
‘డీఆర్‌ఎస్‌కు ఐసీసీ గుర్తింపునిచ్చింది. అన్ని జట్లూ దీన్ని అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక్క భారత్ మాత్రమే ఎందుకు దూరంగా ఉంటున్నట్టు? బ్రిస్బేన్ టెస్టులో చాలా నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. డీఆర్‌ఎస్ ఉంటే కచ్చితంగా అవి మనకు అనుకూలంగానే వచ్చేవి’-అజహరుద్దీన్ (మాజీ కెప్టెన్)