
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయం తీవ్రతకు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంపై వివాదం కూడా నెలకొంది. అయితే జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై మొదటిసారి పెదవి విప్పాడు. అతను గాయం మరింత పెద్దది కాకూడదనే కారణంతోనే జాగ్రత్త పడుతున్నామని వెల్లడించాడు.
తొందర ప్రదర్శించి బరిలోకి దిగితే రోహిత్‌కు మరింత సమస్య ఎదురు కావచ్చని రవిశాస్త్రి అన్నాడు. ‘బీసీసీఐ వైద్య బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ టీమ్ తమ నివేదికను సెలక్టర్లకు అందజేసింది. అందులో మా పాత్ర ఏమీ లేదు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గాయానికి విశ్రాంతి అవసరమని, తొందరపడి ఆడే ప్రయత్నం చేస్తే అతను మళ్లీ తనను తాను గాయపర్చుకునే ప్రమాదం ఉందని ఆ నివేదికలో ఉంది. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిని కాను. అతడిని పక్కన పెట్టడంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.