బెంగళూరు/సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి నెల రోజుల ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. జట్టులోని ఇద్దరు కీలక సభ్యులు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న ఇషాంత్ శర్మ బుధవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధన చేయగా... సిడ్నీలో సాహా తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉంటే అతను వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరతాడు.
ద్రవిడ్, సునీల్ జోషి సమక్షంలో...
ఐపీఎల్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం ఇషాంత్ పొత్తికడుపు కండరాల గాయంతో తప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతను ఎన్‌సీఏలోనే ఉంటూ గాయానికి చికిత్స పొందుతున్నాడు. ఫిట్‌గా మారితే నవంబర్ 18 నుంచి ఇషాంత్ బౌలింగ్ చేయవచ్చని ఎన్‌సీఏ గతంలోనే బీసీసీఐకి సమాచారం అందించింది. బోర్డు వైద్యులు, ట్రయినర్ పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం బుధవారం అతను మైదానంలోకి దిగాడు. రెండు వేర్వేరు స్పెల్‌లలో కలిపి సుమారు రెండు గంటల పాటు ఇషాంత్ బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి అక్కడే ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌ను భారత అండర్–19 జట్టు కోచ్, మాజీ పేసర్ పారస్ మాంబ్రే పర్యవేక్షించాడు. పూర్తి రనప్, వేగంతో ఇషాంత్ బౌలింగ్ చేశాడని, ఎక్కడా కొంచెం కూడా అతను ఇబ్బంది పడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
బ్యాటింగ్ ప్రాక్టీస్...
ఐపీఎల్‌లో కండరాల గాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సాహా... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే జట్టుతో పాటు అతనూ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బుధవారం సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు నువాన్ సెనెవిరత్నే, దయానంద గరాని నెట్స్‌లో విసిరిన బంతులను సాహా ఎదుర్కొన్నాడు.
రెండు టి20లకు బుమ్రా, షమీ దూరం!
ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్లు షమీ, బుమ్రాలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. డిసెంబర్ 11 నుంచి గులాబీ బంతితో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రధాన జట్టు మొత్తం బరిలోకి దిగే అవకాశం ఉండగా... అంతకుముందు డిసెంబర్ 6 నుంచి జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా షమీ, బుమ్రా ఆడాలని జట్టు కోరుకుంటోంది. అయితే 6, 8 తేదీల్లో ఆసీస్‌తో భారత్ రెండు టి20లు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టి20లనుంచి తప్పించైనా సరే... ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించడంపైనే జట్టు ఎక్కువ దృష్టి పెట్టింది. మూడు వన్డేలు, తొలి టి20 తర్వాత ఈ ఇద్దరు పేసర్లు టెస్టు సిరీస్ కోసమే సిద్ధం కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే జరిగితే చివరి రెండు టి20ల్లో చహర్, నటరాజన్, సైనీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇటు ఇషాంత్... అటు సాహా!
Published Thu, Nov 19 2020 5:02 AM | Last Updated on Thu, Nov 19 2020 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment