ఆటను ఆస్వాదించేకాలం కెరీర్‌లో కొనసాగుతానని కొందరు, ప్రపంచకప్ గెలిచేదాకా విశ్రమించను, వీడ్కోలు చెప్పనని ఇంకొందరు భీషి్మంచుకు కూర్చుంటారు క్రికెట్లో! టీనేజ్‌లోనే అరంగేట్రం చేసినా... ఆటపై తనివితీరని ప్రేమో లేదంటే వ్యామోహమో గానీ కొందరైతే 36 నుంచి 38 ఏళ్లదాకా సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన వారూ ఉన్నారు.
కానీ ఆస్ట్రేలియన్ బ్యాటర్ పకొవ్‌స్కీది విచిత్రమైన పరిస్థితి. అతను అరంగేట్రం చేసింది క్రికెట్ ప్రపంచానికే కాదు... ఆస్ట్రేలియా దేశంలోనే సరిగ్గా తెలియదు. కానీ ఇంతలోనే 26 ఏళ్లకే రిటైరవడం ద్వారా వార్తల్లో సంచలన వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చాడు. అతను 2021 జనవరిలో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు.
ఒకే ఒక టెస్టు.. టీమిండియాతో
భారత్‌తో సిడ్నీలో ఆడిన టెస్టే మొదటిది... ఇప్పుడు అదే ఆఖరుది! నిజం... అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడింది ఒకే ఒక టెస్టు మాత్రమే! తర్వాత వన్డే సంగతే ఎరుగడు. టీ20 ఆడింది లేదు. పకోవ్‌స్కీ పేరుకు టాపార్డర్ ప్లేయర్ అయినప్పటికీ ‘కన్‌కషన్’ (స్పృహ తప్పడం) ప్లేయర్‌గా స్థిరపడ్డాడు.
72 పరుగులు
మైదానంలో తరచూ తలకు దెబ్బలు తగిలించుకొని నెలల తరబడి సిరీస్‌లకే దూరమవడం అతని కెరీర్‌లో నిత్యకృత్యం. భారత్‌పై ఆడిన టెస్టులో ఒక అర్ధసెంచరీ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లకే పరిమితమైన ఈ అరుదైన క్రికెటర్ 72 పరుగులు చేశాడంతే!
విక్టోరియా తరఫున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన తను 2350 పరుగులు చేశాడు. మరీ విడ్డూరం ఏమిటంటే... నేటి తరం క్రికెటర్లలో ఆసీస్‌లోని సుప్రసిద్ధ బిగ్‌బాష్ లీగ్ సహా ఏ స్థాయిలోనూ టీ20 క్రికెట్ ఆడని ఏకైక క్రికెటర్ బహుశా ఇతనొక్కడే ఉంటాడేమో!
Comments
Please login to add a commentAdd a comment