న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్‌లో శిక్షణ శిబిరం ఉంది. భారత్‌తో సిరీస్ తర్వాత బిగ్‌బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్‌లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment