స్టువర్ట్ బ్రాడ్.. ఆసీస్ కు బ్యాడ్
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకుని చెత్త రికార్డు మూట గట్టుకున్న స్టువర్ట్ బ్రాడ్.. నేడు ప్రపంచ నంబర్ వన్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై తొలి ఓవర్ నుంచే దాడి చేశాడు. తాను వేసిన 9.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. అంతే కాకుండా బ్రాడ్ విసిరిన 57 బంతుల్లో 50 బంతులు డాట్ పడ్డాయి. రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు అంతే. ఈ దెబ్బకు ఆసీస్ 18.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.
ఇంతటి ఉత్తమ గణాంకాలు నమోదు చేస్తానని బ్రాడ్ కూడా ఊహించి ఉండడేమో. కసి అంటే అలా ఉండాలి. చెత్త రికార్డులు మూట గట్టుకున్నా.. ఉత్తమ గణాంకాలు నమోదు చేయగల బౌలర్గా నేడు మరో రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలి వికెట్ పడగొట్టడంతోనే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ ఆనందంలోనే అతడు మరో ఏడు వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. నేటి మ్యాచ్ లో ఆసీస్ కు బ్యాడ్గా నిలిచాడని చెప్పవచ్చు.
-దివిటి రాజేష్