దాదాపు పదహారేళ్ల క్రితం... 21 ఏళ్ల కుర్రాడికి అది కేవలం ఎనిమిదో అంతర్జాతీయ మ్యాచ్. ఉరకలెత్తే ఉత్సాహం మినహా తగినంత అనుభవం లేదు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి ఆ మ్యాచ్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లాగే చూశాడు. కానీ మైదానంలో ఆ రోజు అతనికి జీవితకాలం మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఒకటి కాదు, రెండు కాదు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు! వేసిన ప్రతి బంతినీ భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సిక్సర్‌గా మలుస్తుంటే ఆ మొహం రంగులు మారుతూ వాడిపోయింది. ఆ దెబ్బ నుంచి మానసికంగా కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. బ్రాడ్ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా సగటు క్రికెట్ అభిమానులందరికీ ఆ మ్యాచ్ మాత్రమే గుర్తుకొస్తుంది.
ఎప్పటికీ ఆ కాళరాత్రి వెంటాడుతూ ఉంటే మరో ఆటగాడి కెరీర్ ఎన్ని ఆటుపోట్లకు గురయ్యేదో! కానీ స్టూ్టవర్ట్ బ్రాడ్ మాత్రం నిరాశ చెందలేదు. ఉవ్వెత్తున మళ్లీ పైకి లేచి, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ఆరు సిక్సర్ల దెబ్బ నుంచి కోలుకొని టెస్టుల్లో ఆరు వందల వికెట్లు సాధించే వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు.
‘ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. సహజంగానే నేనూ చాలా బాధపడ్డాను. అయితే వాస్తవానికి అది నాకు మరో రూపంలో మేలు చేసింది. పట్టుదలగా నిలబడి పోరాడేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి నన్ను మానసికంగా దృఢంగా మార్చింది. ఈ రోజు ఆ స్థాయికి చేరానంటే నాటి మ్యాచ్ కూడా కారణం. చాలా మంది క్రీడాకారుల జీవితాల్లో ఇలాంటి రోజులు ఉంటాయి. అయితే మీరు ఎంత తొందరగా దానిని వెనక్కి తోసి పైకి దూసుకుపోగలరనేది ముఖ్యం.
తండ్రి క్రిస్ బ్రాడ్‌తో స్టువర్ట్
ఆటలో ఆనందించే రోజుల కంటే బాధపడే రోజులే ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించగలిగితే మీరు గొప్ప రోజులు చూస్తారనేది నా నమ్మకం. ఇది నా విషయంలో నిజమైంది’... రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ‘ఆరు సిక్సర్ల’ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. టెస్టు క్రికెట్‌లో అతను సాధించిన ఘనత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాడ్ గణాంకాలు చూస్తే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. 17 ఏళ్ల కెరీర్‌లో 167 టెస్టు మ్యాచ్‌లు... 604 వికెట్లు...అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంతో అతను ఇప్పుడు ఆటను సగర్వంగా ముగించాడు.
బ్యాటర్ నుంచి బౌలర్‌గా...
స్టూవర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. జాతీయ జట్టుకు 25 టెస్టులు, 34 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే తండ్రి కారణంగా అతనికేమీ క్రికెట్‌పై అమాంతం ఆసక్తి పెరగలేదు. చిన్నప్పటి నుంచి బ్రాడ్ హాకీని ఇష్టపడ్డాడు. వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ లీసెస్టర్‌షైర్ టీమ్‌కు గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ యువ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహం, ఇతర మిత్రుల కారణంగా క్రికెట్ వైపు మళ్లాడు.
తండ్రిలాగే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా స్కూల్, కాలేజీ దశలో రాణిస్తూ వచ్చిన అతను లీసెస్టర్‌షైర్ బెస్ట్ యంగ్ బ్యాట్స్‌మన్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఇక్కడా అతని కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. అయితే కాలేజీలు మారుతూ వచ్చిన దశలో బ్యాటర్‌గా కంటే పేస్ బౌలర్‌గా మంచి ప్రతిభ ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు. ఒకే విభాగంలో దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో పూర్తిగా బౌలింగ్ వైపు మళ్లిన అతను చివరకు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలవడం విశేషం.
ఫ్యామిలీతో స్టువర్ట్
సీనియర్ స్థాయికి...
ఇంగ్లండ్ యువ క్రికెట్ జట్టును లయన్స్ పేరుతో పిలుస్తారు. ఆ టీమ్‌లో స్థానం దక్కడం అంటే మున్ముందు సీనియర్ టీమ్‌కు సిద్ధమైనట్లే లెక్క. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో బ్రాడ్ ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్ యువ జట్లతో జరిగిన సిరీస్‌లలో రాణించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై మరింత నమ్మకం ఉంచింది. భవిష్యత్తు కోసం ఎంపిక చేసే 25 మంది సభ్యుల డెవలప్‌మెంట్ గ్రూప్‌లో కూడా బ్రాడ్‌కు చోటు దక్కింది.
జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ బృందానికి శిక్షణ ఇస్తున్నప్పుడు బ్రాడ్ ప్రతిభతో పాటు అతను కష్టపడే తత్త్వం, బౌలింగ్‌లో ప్రత్యేకత సెలక్టర్లను ఆకర్షించాయి. ఫలితంగా 20 ఏళ్ల వయసులో తొలి ఇంగ్లండ్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం (టి–20ల్లో) చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత వన్డేల్లోనూ అడుగు పెట్టగా, మరి కొద్ది రోజులకే టెస్టు అవకాశం కూడా వెతుక్కుంటూ రావడం మూడు ఫార్మాట్‌లలో ఇంగ్లండ్ రెగ్యులర్ ఆటగాడిగా బ్రాడ్ స్థాయి పెరిగింది.
తండ్రితో బ్రాడ్ చిన్నప్పటి ఫోటో
పదునైన పేసర్‌గా....
కెరీర్ ఆరంభంలో మొహంలో ఇంకా వీడని పసితనపు ఛాయలు, రంగుల జుట్టుతో అమాయకత్వం దాటని ఆటగాడిగా అతను కనిపించేవాడు. కానీ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌లో చరిత్రలో అత్యంత భీకరమైన ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు బ్రాడ్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. బౌలింగ్ సత్తాతో పాటు మొండి పట్టుదల, ఒక్కసారిగా ప్రత్యర్థిపై ఆధిపత్యం మొదలైతే ఆగని అతని తత్త్వం బ్రాడ్‌ను ప్రత్యేకంగా మార్చాయి.
కెరీర్‌లో 100వ టెస్టు ఆడే సమయానికే బ్రాడ్ ఒకే స్పెల్‌లో ఐదేసి వికెట్లు సాధించిన ఘనతను ఏడుసార్లు నమోదు చేశాడు. పాకిస్తాన్‌తో 3–0తో ఘన విజయంలో కీలక పాత్ర, విండీస్, న్యూజిలాండ్‌లపై లార్డ్స్‌లో ఏడేసి వికెట్ల ప్రదర్శన, దక్షిణాఫ్రికా గడ్డపై ఆరు వికెట్ల ఇన్నింగ్స్, మాంచెస్టర్‌లో భారత్‌ను 6 వికెట్లతో కుప్పకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సమరం... ఇలా బ్రాడ్ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలు ఉన్నాయి. అతని సహజ నాయకత్వ లక్షణాలు బ్రాడ్‌ను టి20ల్లో కెప్టెన్‌గా పనిచేసే అవకాశం కల్పించాయి.
యాషెస్‌లో అద్భుతం...
టెస్టు క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ చిరకాల సమరం ఇరు జట్లు ఆటగాళ్ల కెరీర్‌ను నిర్దేశిస్తుందనేది వాస్తవం. హీరోలుగా మారినా, జీరోలుగా మారినా ఈ సిరీస్‌తోనే సాధ్యం. ఇలాంటి సిరీస్‌లో బ్రాడ్ తన ప్రత్యేకత ప్రదర్శించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించి యాషెస్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
2009–2023 మధ్య కాలంలో 40 యాషెస్ టెస్టులు ఆడిన బ్రాడ్ 153 వికెట్లతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2009 ఓవల్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత బ్రిస్బేన్, లీడ్స్, చెస్టర్ లీ స్ట్రీట్‌లలో ఆరేసి వికెట్లు...ఇలా యాషెస్‌లో మధుర జ్ఞాపకాలెన్నో. అయితే బ్రాడ్ కెరీర్‌లో అత్యుత్తమ క్షణం 2015 యాషెస్‌లో వచ్చింది. సొంత మైదానం ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 8 ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టిన తీరుకు హ్యట్సాఫ్. ఆ స్పెల్‌లో ఒక్కో బంతి ఒక్కో అద్భుతం. ఆ సమయంలో బ్రాడ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అతని కెరీర్‌లో బెస్ట్ పోస్టర్‌గా నిలిచిపోయాయి.
ఆస్తమాను అధిగమించి...
బ్రాడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో కోణం కూడా దాగి ఉంది. 2015లో అతను బయటకు చెప్పే వరకు దీని గురించి ఎవరికీ తెలీదు. బ్రాంకో పల్మనరీ డిస్‌ప్లాజియా (అస్తమా) అనే శ్వాసకోస వ్యాధితో అతను చిన్నతనంలో బాధపడ్డాడు. మూడు నెలల ముందుగా ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టడంతో అతని ఊపిరితిత్తులో ఒకటి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. అయితే మందులతో పాటు క్రమశిక్షణ, ఆహార నియమాలతో అతను దీనిని అధిగమించగలిగాడు. ఒక పేస్ బౌలర్ ఇలాంటి సమస్యను దాటి రావడం అరుదైన విషయం. పుట్టిన సమయంలో తన ప్రాణాలు కాపాడిన జాన్ పేరును తన పేరు మధ్యలో చేరుస్తూ స్టూవర్ట్ జాన్ బ్రాడ్‌గా మార్చుకొని అతను కృతజ్ఞత ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment