divity rajesh
-
60 ఏళ్లలో ఎత్తుపల్లాలెన్నో..
(సాక్షి వెబ్ ప్రత్యేకం) గాడ్ ఫాదర్స్ లేరు... వారసత్వం అంతకన్నా లేదు. అయినా ఒక్కో పునాది రాయి వేసుకుంటూ స్వయంకృషితో పైకెదిగి మెగాస్టార్ గా నీరాజనాలు అందుకున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసిన కొణిదెల శివశంకర వరప్రసాద్ నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. ప్రస్థానం చెన్నైలోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో 'పునాది రాళ్లు' సినిమాలో తొలిసారి నటించాడు. కానీ 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. 'పసివాడి ప్రాణం' చిత్రంలో తొలిసారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేశాడు. 2007 నుంచి అంటే ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు చిటికేసినా.. స్టెప్పులు వచ్చేస్తాయని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాడు. అనంతరం గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. బప్పీలహరి అందించిన సంగీతానికి చిరంజీవి స్టెప్పులు తోడవడంతో గ్యాంగ్ లీడర్ బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. తారస్థాయికి.. 9వ దశకం చివరిలో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని ఉంది' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 2002లో ఇంద్ర, 2003లో ఠాగూర్ సినిమాలు తారాపథంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాయి. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. అనంతరం వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిట్ టాక్ వచ్చినా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కానీ, ఏ పుట్టిన రోజున కూడా తన సినిమా విడుదల కాలేదు. రాజకీయ రంగప్రవేశం 2008 ఆగస్టు 26న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరు (ప్రజారాజ్యం), పతాకాన్ని ఆవిష్కరించారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణమైన ఫలితాలు చూసింది. 294 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా.. కేవలం 18 చోట్ల మాత్రమే గెలవగలిగారు. స్వయంగా చిరంజీవి కూడా రెండుచోట్ల పోటీ చేసినా, ఒకచోట.. అదీ తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2011 ఫిభ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ ఆ స్థాయి ప్రభావాన్ని రాజకీయాల్లో మాత్రం చూపించలేక పోయాడు. కథను బట్టే డైరెక్టర్ చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా 150వ సినిమా ప్రకటన వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పూరీ చెప్పిన ఆటోజానీ కథలో సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపాడు. కథను బట్టే డైరెక్టర్ తప్ప.. దర్శకుడిని బట్టి కథ కాదన్నాడు. సత్కారాలు 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న సేవా సౌకర్యాలు. నాలుగేళ్లు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి. -దివిటి రాజేష్. -
గ్రేటర్లో కింగ్‌మేకర్ ఎవరో..?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఈసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందనేది హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ సొంతంగా గెలిచింది మూడు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందనే ఆందోళనతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్ (సనత్ నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), మాధవరం కృష్ణారావు (కూకట్ పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం) లు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తీగల, తలసాని లాంటి నాయకుల వెంట ఉన్న కేడర్ పూర్తిగా వచ్చిందా.. వాళ్లు ఏ మాత్రం ప్రభావం చూపుతారనే దానిపైనే గ్రేటర్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శివారులే కీలకం.. గ్రేటర్ వార్డుల పునర్విభజన తర్వాత కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాలు కీలకం కానున్నాయి. సైబరాబాద్ పరిధిలో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోతీగల కృష్ణారెడ్డికి మంచి పట్టు ఉంది. ఆయన టీఆర్ఎస్లో చేరాక.. ఆయన కేడర్ ఏ మాత్రం వెంట వచ్చిందనే విషయం ఫలితాల్ని బట్టి చెప్పవచ్చు. కోర్ సిటీ విషయానికి వస్తే.. పాతబస్తీ అంతా ఎంఐఎం రాజ్యం. అక్కడ ఇతర పార్టీల జెండాలు ఎగరడం కష్టమే. ఇన్నాళ్లుగా మజ్లిస్ పార్టీ ఎక్కువగా అధికార పార్టీలతో బాగానే కలుస్తోంది. అలా చూస్తే ఈసారి అధికార టీఆర్ఎస్ వెంట నడిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నాయకులు కూడా మజ్లిస్‌తో కాస్త సన్నిహితంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనేనా? గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే ప్రధానపోటీ ఉంటుందని చెప్పవచ్చు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీతో ఇప్పటికే కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రస్తుతం నగరంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పలేం. ప్రస్తుతం ఆ పార్టీ కాస్త గడ్డు కాలంలో ఉందనే చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది కేవలం చేవెళ్ల స్థానం మాత్రమే. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బరిలో దిగుతుంది. ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చూడాలి. . గత ఎన్నికల వివరాలు.. 2007లో తొలిసారి జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక 2009లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ఎంబీటీ1, ప్రజారాజ్యం 1, ఇతరులు ముగ్గురు గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎంఐఎంతో కాంగ్రెస్ చేతులు కలిపింది. చెరో రెండున్నరేళ్లు పాలించే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ క్రమంలోనే తొలి రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున బండ కార్తీకరెడ్డి, అనంతర్ ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మేయర్ అయ్యారు. రాజ్యాంగ ఉల్లంఘనే.. కాల పరిమితి ముగిసిన గ్రేటర్ పరిధిలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది. 2014 డిసెంబరు 3 తో జీహెచ్ఎంసీ పాలకమండలి కాలవ్యవధి ముగిసింది. దీనికి ఒకరోజు ముందు పాలకవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో 186 జారీచేసింది. స్పెషల్ ఆఫీసర్ల కాల వ్యవధి 2015 మే నెలతో ముగిసింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఆ వ్యవధి కూడా దాటిపోయింది. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికలపై ఎలాంటి స్పష్టత లేదు. - దివిటి రాజేష్ -
స్టువర్ట్ బ్రాడ్.. ఆసీస్ కు బ్యాడ్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకుని చెత్త రికార్డు మూట గట్టుకున్న స్టువర్ట్ బ్రాడ్.. నేడు ప్రపంచ నంబర్ వన్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై తొలి ఓవర్ నుంచే దాడి చేశాడు. తాను వేసిన 9.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. అంతే కాకుండా బ్రాడ్ విసిరిన 57 బంతుల్లో 50 బంతులు డాట్ పడ్డాయి. రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు అంతే. ఈ దెబ్బకు ఆసీస్ 18.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఇంతటి ఉత్తమ గణాంకాలు నమోదు చేస్తానని బ్రాడ్ కూడా ఊహించి ఉండడేమో. కసి అంటే అలా ఉండాలి. చెత్త రికార్డులు మూట గట్టుకున్నా.. ఉత్తమ గణాంకాలు నమోదు చేయగల బౌలర్‌గా నేడు మరో రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ పడగొట్టడంతోనే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ ఆనందంలోనే అతడు మరో ఏడు వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. నేటి మ్యాచ్ లో ఆసీస్ కు బ్యాడ్‌గా నిలిచాడని చెప్పవచ్చు. -దివిటి రాజేష్