గ్రేటర్లో కింగ్మేకర్ ఎవరో..?
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ఈసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందనేది హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ సొంతంగా గెలిచింది మూడు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందనే ఆందోళనతో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమావేశాలు ముమ్మరం చేశారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్ (సనత్ నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), మాధవరం కృష్ణారావు (కూకట్ పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం) లు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తీగల, తలసాని లాంటి నాయకుల వెంట ఉన్న కేడర్ పూర్తిగా వచ్చిందా.. వాళ్లు ఏ మాత్రం ప్రభావం చూపుతారనే దానిపైనే గ్రేటర్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
శివారులే కీలకం..
గ్రేటర్ వార్డుల పునర్విభజన తర్వాత కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాలు కీలకం కానున్నాయి. సైబరాబాద్ పరిధిలో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోతీగల కృష్ణారెడ్డికి మంచి పట్టు ఉంది. ఆయన టీఆర్ఎస్లో చేరాక.. ఆయన కేడర్ ఏ మాత్రం వెంట వచ్చిందనే విషయం ఫలితాల్ని బట్టి చెప్పవచ్చు. కోర్ సిటీ విషయానికి వస్తే.. పాతబస్తీ అంతా ఎంఐఎం రాజ్యం. అక్కడ ఇతర పార్టీల జెండాలు ఎగరడం కష్టమే. ఇన్నాళ్లుగా మజ్లిస్ పార్టీ ఎక్కువగా అధికార పార్టీలతో బాగానే కలుస్తోంది. అలా చూస్తే ఈసారి అధికార టీఆర్ఎస్ వెంట నడిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నాయకులు కూడా మజ్లిస్తో కాస్త సన్నిహితంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనేనా?
గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే ప్రధానపోటీ ఉంటుందని చెప్పవచ్చు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీతో ఇప్పటికే కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రస్తుతం నగరంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పలేం. ప్రస్తుతం ఆ పార్టీ కాస్త గడ్డు కాలంలో ఉందనే చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది కేవలం చేవెళ్ల స్థానం మాత్రమే. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బరిలో దిగుతుంది. ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చూడాలి. .
గత ఎన్నికల వివరాలు..
2007లో తొలిసారి జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక 2009లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ఎంబీటీ1, ప్రజారాజ్యం 1, ఇతరులు ముగ్గురు గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎంఐఎంతో కాంగ్రెస్ చేతులు కలిపింది. చెరో రెండున్నరేళ్లు పాలించే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ క్రమంలోనే తొలి రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున బండ కార్తీకరెడ్డి, అనంతర్ ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మేయర్ అయ్యారు.
రాజ్యాంగ ఉల్లంఘనే..
కాల పరిమితి ముగిసిన గ్రేటర్ పరిధిలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది. 2014 డిసెంబరు 3 తో జీహెచ్‌ఎంసీ పాలకమండలి కాలవ్యవధి ముగిసింది. దీనికి ఒకరోజు ముందు పాలకవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో 186 జారీచేసింది. స్పెషల్ ఆఫీసర్ల కాల వ్యవధి 2015 మే నెలతో ముగిసింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఆ వ్యవధి కూడా దాటిపోయింది. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికలపై ఎలాంటి స్పష్టత లేదు.
- దివిటి రాజేష్