city outskirts
-
శివార్లలో బీఆర్టీఎస్ సేవలు!
► అనువైన మార్గాల గుర్తింపుపై సీటీసీ, ఆర్టీసీ అధ్యయనం ► ఇన్నర్రింగ్రోడ్డులోనూ అహ్మదాబాద్ తరహా ప్రయోగం ► మెట్రో ఫీడర్ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులను విముక్తులను చేసేందుకు బీఆర్టీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) నోడల్ ఏజెన్సీ అయిన ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (సీటీఎస్) తెరపైకి తెచ్చిన బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) సేవలు అందించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివార్లలోని అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్పీసింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రణాళిక రూపొందించేందుకు సీటీఎస్, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. వేగం..భద్రత అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్సు ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (బీఆర్టీఎస్)ను అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ సీటీఎస్ అధికారులు సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీఆర్టీఎస్ బస్సుల కోసం ప్రత్యేకంగా సిటీలోని మీడియన్ డివైడర్‌కు కుడి, ఎడమవైపున 3.5 మీటర్ చొప్పున ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాలి. ఈ లేన్లలోకి ఇతర వాహనాలు రాకపోవడం వల్ల ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. తక్కువ చార్జీలోనే సురక్షితంగా సమయానికి ముందే గమ్యస్థానానికి చేరడం వల్ల ఈ సేవలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఇతర వాహన చోదకులు కూడా వీటివైపు మళ్లే అవకాశముంది. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లకు, కార్యాలయాలు చేరేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేక కారిడార్‌లో బస్సులను నడపడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడటం బీఆర్టీఎస్ ముఖ్యోద్దేశమ’ని సీటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఓఆర్ఆర్తో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 418 కిలోమీటర్ల మేర బీఆర్టీఎస్ సేవలు విస్తరించాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివారుల్లో ప్రాంతాల్లోనూ బీఆర్టీఎస్ సేవలను విస్తరించాలన్న అంశం చర్చకు రావడంతో ఆవైపుగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో... నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నందున అక్కడ పక్కా ప్రణాళికతో ముందుకెళితే ట్రాఫిక్ కష్టాలను నియంత్రించవచ్చునని, బీఆర్టీఎస్ సేవల ద్వారా ఆర్టీసీకి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలుగుతామన్నారు. సిటీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునే అవకాశమున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శివారు ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వెడల్పు అంతటా ఒకేలా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా జనసముర్ధమున్న ప్రాంతాలను గుర్తించే పనిలో సీటీఎస్ సిబ్బంది నిమగ్నమైంది. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది ప్రాంతాలను గుర్తించారు. మరో రెండు నెలల్లో బీఆర్టీఎస్ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
గ్రేటర్లో కింగ్‌మేకర్ ఎవరో..?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఈసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందనేది హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ సొంతంగా గెలిచింది మూడు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందనే ఆందోళనతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్ (సనత్ నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), మాధవరం కృష్ణారావు (కూకట్ పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం) లు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తీగల, తలసాని లాంటి నాయకుల వెంట ఉన్న కేడర్ పూర్తిగా వచ్చిందా.. వాళ్లు ఏ మాత్రం ప్రభావం చూపుతారనే దానిపైనే గ్రేటర్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శివారులే కీలకం.. గ్రేటర్ వార్డుల పునర్విభజన తర్వాత కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాలు కీలకం కానున్నాయి. సైబరాబాద్ పరిధిలో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోతీగల కృష్ణారెడ్డికి మంచి పట్టు ఉంది. ఆయన టీఆర్ఎస్లో చేరాక.. ఆయన కేడర్ ఏ మాత్రం వెంట వచ్చిందనే విషయం ఫలితాల్ని బట్టి చెప్పవచ్చు. కోర్ సిటీ విషయానికి వస్తే.. పాతబస్తీ అంతా ఎంఐఎం రాజ్యం. అక్కడ ఇతర పార్టీల జెండాలు ఎగరడం కష్టమే. ఇన్నాళ్లుగా మజ్లిస్ పార్టీ ఎక్కువగా అధికార పార్టీలతో బాగానే కలుస్తోంది. అలా చూస్తే ఈసారి అధికార టీఆర్ఎస్ వెంట నడిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నాయకులు కూడా మజ్లిస్‌తో కాస్త సన్నిహితంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనేనా? గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే ప్రధానపోటీ ఉంటుందని చెప్పవచ్చు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీతో ఇప్పటికే కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రస్తుతం నగరంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పలేం. ప్రస్తుతం ఆ పార్టీ కాస్త గడ్డు కాలంలో ఉందనే చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది కేవలం చేవెళ్ల స్థానం మాత్రమే. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బరిలో దిగుతుంది. ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చూడాలి. . గత ఎన్నికల వివరాలు.. 2007లో తొలిసారి జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక 2009లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ఎంబీటీ1, ప్రజారాజ్యం 1, ఇతరులు ముగ్గురు గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎంఐఎంతో కాంగ్రెస్ చేతులు కలిపింది. చెరో రెండున్నరేళ్లు పాలించే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ క్రమంలోనే తొలి రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున బండ కార్తీకరెడ్డి, అనంతర్ ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మేయర్ అయ్యారు. రాజ్యాంగ ఉల్లంఘనే.. కాల పరిమితి ముగిసిన గ్రేటర్ పరిధిలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది. 2014 డిసెంబరు 3 తో జీహెచ్ఎంసీ పాలకమండలి కాలవ్యవధి ముగిసింది. దీనికి ఒకరోజు ముందు పాలకవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో 186 జారీచేసింది. స్పెషల్ ఆఫీసర్ల కాల వ్యవధి 2015 మే నెలతో ముగిసింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఆ వ్యవధి కూడా దాటిపోయింది. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికలపై ఎలాంటి స్పష్టత లేదు. - దివిటి రాజేష్ -
అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీయువకులు అరెస్ట్
హైదరాబాద్ : నగర శివారులోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన నగరం శివారులోని జవహర్‌నగర్ యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ముగ్గురు యువతులు, ఆరుగురు యువకులు ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే కార్లను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. యువతీయువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు యువతులు పక్క రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.