శివార్లలో బీఆర్‌టీఎస్ సేవలు!
Published Mon, Feb 27 2017 11:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
► అనువైన మార్గాల గుర్తింపుపై సీటీసీ, ఆర్టీసీ అధ్యయనం
► ఇన్నర్‌రింగ్‌రోడ్డులోనూ అహ్మదాబాద్ తరహా ప్రయోగం
► మెట్రో ఫీడర్ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
సాక్షి, సిటీబ్యూరో:
ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులను విముక్తులను చేసేందుకు బీఆర్‌టీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) నోడల్ ఏజెన్సీ అయిన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (సీటీఎస్) తెరపైకి తెచ్చిన బస్సు ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) సేవలు అందించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివార్లలోని అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌పీసింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రణాళిక రూపొందించేందుకు సీటీఎస్, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.
వేగం..భద్రత
అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్సు ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (బీఆర్‌టీఎస్)ను అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏ సీటీఎస్ అధికారులు సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీఆర్‌టీఎస్ బస్సుల కోసం ప్రత్యేకంగా సిటీలోని మీడియన్ డివైడర్‌కు కుడి, ఎడమవైపున 3.5 మీటర్ చొప్పున ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాలి. ఈ లేన్లలోకి ఇతర వాహనాలు రాకపోవడం వల్ల ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. తక్కువ చార్జీలోనే సురక్షితంగా సమయానికి ముందే గమ్యస్థానానికి చేరడం వల్ల ఈ సేవలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఇతర వాహన చోదకులు కూడా వీటివైపు మళ్లే అవకాశముంది.
మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లకు, కార్యాలయాలు చేరేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేక కారిడార్‌లో బస్సులను నడపడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడటం బీఆర్‌టీఎస్ ముఖ్యోద్దేశమ’ని సీటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఓఆర్‌ఆర్‌తో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 418 కిలోమీటర్ల మేర బీఆర్‌టీఎస్ సేవలు విస్తరించాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివారుల్లో ప్రాంతాల్లోనూ బీఆర్‌టీఎస్ సేవలను విస్తరించాలన్న అంశం చర్చకు రావడంతో ఆవైపుగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
శివారు ప్రాంతాల్లో...
నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నందున అక్కడ పక్కా ప్రణాళికతో ముందుకెళితే ట్రాఫిక్ కష్టాలను నియంత్రించవచ్చునని, బీఆర్‌టీఎస్ సేవల ద్వారా ఆర్టీసీకి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలుగుతామన్నారు. సిటీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునే అవకాశమున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శివారు ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు వెడల్పు అంతటా ఒకేలా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా జనసముర్ధమున్న ప్రాంతాలను గుర్తించే పనిలో సీటీఎస్ సిబ్బంది నిమగ్నమైంది. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది ప్రాంతాలను గుర్తించారు. మరో రెండు నెలల్లో బీఆర్‌టీఎస్ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement