![HMDA Layout in pratap singaram full details here](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/pratap-singaram-realestate.jpg.webp?itok=S8HLuLqY)
అందుబాటులోకి 133 ఎకరాల పట్టాభూమి, 18 ఎకరాల అసైన్డ్ భూమి
ఇటీవల వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే ప్లాట్ల మార్కింగ్, రోడ్ల నిర్మాణం పూర్తి
రైతులకు ప్లాట్ల కేటాయింపు.. త్వరలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్‌ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.
వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు
వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్‌ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు..
వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్‌ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్‌లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.
త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ..
ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్‌వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.
చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
డేటా సెంటర్ కోసం కృషి
ప్రతాప సింగారంలోని హెచ్‌ఎండీఏ వెంచర్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా.
– మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారం
తూర్పు వైపు అభివృద్ధికి దోహదం..
హెచ్‌ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్‌ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం.
– జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం
Comments
Please login to add a commentAdd a comment