layout
-
ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు.. వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ.. ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..డేటా సెంటర్ కోసం కృషి ప్రతాప సింగారంలోని హెచ్ఎండీఏ వెంచర్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. – మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారంతూర్పు వైపు అభివృద్ధికి దోహదం.. హెచ్ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. – జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం -
లేఅవుట్‌కు రూ.20 లక్షల రైతుబంధు
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో రైతుబంధు పక్కదారి పట్టింది. సాగుకు నోచుకోని లేఅవుట్లు, వెంచర్లు, గుట్టలు, రాళ్లురప్పలు, కంచెలు ఉన్న వేలాది ఎకరాలకు కూడా పెట్టుబడి సాయం అందింది. ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 38, 39, 40 సర్వేనంబర్లలోని 33 ఎకరాల లేఅవుట్‌కు రైతుబంధు అందింది. ఇందులో కొంత వ్యవసాయభూమి కూడా ఉంది. రైతు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి పేరిట ఐదేళ్లుగా ఈ వెంచర్‌కు రూ. 20 లక్షలు రైతుబంధు పేరిట జమ అయిన విషయం బయటకు పొక్కింది. పోచారానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు విచారించి ఇది వాస్తవమేనని తేల్చారు. మోత్కుపల్లి యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షలు రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కీసర ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఘట్కేసర్ తహసీల్దార్ రైతు యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షల రికవరీ పేరిట నోటీసులు జారీ చేశారు. నగర శివారులో ఇలా.. నగర శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 28,162 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. అయితే ఏటా ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం కింద 66,519 ఎకరాలకు రూ. 39.92 కోట్లు విడుదల అవుతున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం ఆధారంగా రూ. 33.25 కోట్లు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే మిగతావి సాగు భూములు కావని, వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్, బీడు భూములనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 4,45,428 ఎకరాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో రూ.345.36 కోట్ల చొప్పున ఏడాదిలో రెండు పర్యాయాలు ప్రభుత్వం చెల్లిస్తోంది. రంగారెడ్డి జిలాల్లో సీజన్ల వారీగా సాగవుతున్న భూములకు రూ.222.71 కోట్లు సరిపోతుందని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం అదనంగా రూ.117 కోట్లు మేర లేఅవుట్లు, రాళ్లు, రప్పలు, గుట్టలు, కంచెలు ఉన్న భూములకు చెల్లిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. -
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
ఐదేళ్లలో పేదలే ధనవంతులు
మంగళగిరి: ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడంతో రానున్న ఐదేళ్లలో పేదలు ధనవంతులు కావడం ఖాయమని, దీంతో టీవీ–5, ఏబీఎన్, ఈనాడు అధినేతలు ఏడవడం, చంద్రబాబు కుళ్లి కుళ్లి చావడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో పేదలు ఉండకూడదని, సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పారు. రాజధాని ప్రాంతం జీవం లేకుండా ఉందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూసినా చంద్రబాబు రైతుల ముసుగులో కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అయినా రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని, 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఇక్కడ 25 ఊర్లు, 50 వేలకు పైగా నివాసాలు, రెండు లక్షలకు పైగా జనాభా వస్తుందని తెలిపారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని, ఇది వారి స్వర్గమని, వారి సామాజిక వర్గం మాత్రమే ఉండాలని చంద్రబాబు, ఒక వర్గం మీడియా సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, కోట్ల రూపాయలు న్యాయవాదులకు ఫీజులు కట్టారని, వారి నగ్న స్వరూపాన్ని ఇది బట్టబయలు చేసిందని తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడూ పేదల పక్షాన పోరాటం చేసి అన్ని సౌకర్యాలతో అమరావతిలో ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. రాజధానిలో రైతులు లేరని, చంద్రబాబు, ఆయన అనుచరులు భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ పేదల ఇళ్లకు శంకుస్థాపన జరుగుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే రామోజీరావు పడుకోవడం, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 గుక్కపట్టి ఏడవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, సీఎం ప్రోగ్రామ్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ పరిశీలన
పీలేరు : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను రాయచోటి ఆర్డీఓ రంగస్వామి పరిశీలించారు. దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ జగనన్న కాలనీ, ఆటో నగర్లో ఆక్ర మణలు జరిగినట్లు కొత్తపల్లెకు చెందిన దేవేంద్రరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఆర్డీఓ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను ఆటో నగర్‌లోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇది వరకే దిన్నెమీద గంగమ్మ లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వీఆర్వో హేమంత్ నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఆసిఫ్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ స్థలాలను పరిశీలించారు. అలాగే మండలంలో ల్యాండ్ కన్వర్షన్ స్థలాలు పరిశీలించారు. పీలేరు పంచాయతీ సర్వే నెంబరు 42లో 3.60 ఎకరాలు, ముడుపులవేములలో సర్వే నెంబరు 405/3లో ఒక ఎకరా, బోడుమల్లువారిపల్లెలో సర్వే నెంబరు 731లో ఒక ఎకరా, 715లో రెండు ఎకరాలు, 711లో 90 సెంట్లు, 636లో 83 సెంట్లు, 639లో 1.84 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఆర్ఐలు రాజశేఖర్, భార్గవి, సర్వేయర్ దేవి పాల్గొన్నారు. -
అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ సిగలో మరో దిగ్గజ సంస్థ మణిహారంగా చేరనుంది. దేశంలో అతి పెద్ద డేటాసెంటర్‌ను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రముఖ సంస్థ అదానీ మధురవాడ సమీపంలో డేటా సెంటర్ పార్కుతో పాటు బిజినెస్ పార్కు, ఐటీ సంస్థ, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన లే అవుట్ ప్లాన్‌కు వీఎంఆర్డీఏ అనుమతులు మంజూరు చేయడంతో కీలక అడుగు పడింది. డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ నిర్మాణాలకు మధురవాడ సర్వే నంబర్ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. 20 ఏళ్ల పాటు ప్రభుత్వం విద్యుత్ ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం సంస్థ ఏకంగా రూ.14,634 కోట్లను వెచ్చించనుంది. ఫలితంగా 24,990 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అనుగుణంగా వైజాగ్ టెక్ పార్కు పేరుతో తనకు అనుబంధంగా 100 శాతం సబ్సిడరీ సంస్థను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను అదానీ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఏడేళ్లు రూ.14,634 కోట్లు అదానీ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఐటీ పాలసీ ప్రకారం అన్ని విధాల సహకారాలు అందించేందుకు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ), కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీతో పాటు ఏపీఐఐసీని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు (ఎంవీ) డేటా సెంటర్ పార్కు పూర్తి చేయాలని, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల కాలంలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం రూ.14,634 కోట్ల భారీ పెట్టుబడులతో అదానీ సంస్థ తమ ప్రాజెక్టును విశాఖలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 100 శాతం సబ్సిడరీతో వైజాగ్ టెక్ పార్క్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని 13 నవంబరు 2021న అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతిని పరిశీలించేందుకు అదానీ కంపెనీ ప్రతినిధులు మధురవాడలో పర్యటించారు. ప్రత్యక్ష, పరోక్షంగా 24,990 మందికి ఉపాధి దేశంలోనే మొట్టమొదటి మెగా డేటా సెంటర్ ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. డేటా సెంటర్‌తో పాటు ఏర్పాటు కానున్న ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్‌వల్ల రానున్న ఏడేళ్ల కాలంలో ఏకంగా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే కంపెనీ హామీనిచ్చింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్ల కాలంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్ పార్కులో 1,240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్ పార్కులో 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా మొత్తంగా 24,990 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. లే–అవుట్ అనుమతులు వచ్చాయి మధురవాడలో ఏర్పాటు కానున్న అదానీ డేటా సెంటర్లో నిర్మాణాల కోసం లే–అవుట్ ప్లాన్‌కు వీఎంఆర్డీఏ అనుమతినిచ్చింది. భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు పలుసార్లు కేటాయించిన భూమిని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సెంటర్ ఏర్పాటు కోసం రూ. 14,634 కోట్ల పెట్టుబడులు సంస్థ పెట్టనుంది. తద్వారా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ హామీనిచ్చింది. – యతిరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..
పుట్టపర్తి...జిల్లా కేంద్రం కావడం.. విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో టీడీపీ నాయకులు కొందరు కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో 1992లో ఏర్పాటైన ఉజ్వల ఫౌండేషన్‌పై కన్నేసిన కొందరు పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో పార్కులు, పార్కింగ్ స్థలాలనూ విక్రయిస్తున్నారు. దీంతో ఉజ్వల ఫౌండేషన్‌లో కాటేజీలు కొనుగోలు చేసిన వారు ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మరోవైపు వీటన్నింటికీ ‘పల్లె’ అనుచరులే కారణమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించడంతో పాటు సొంతపార్టీ నేతలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) ఏర్పాటు కాకముందు సుడా (సత్యసాయి అర్భన్ డెవలప్మెంట్ ) ఉండేది. 1992లో సుడా పరిధిలోని 6.25 ఎకరాల్లో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేఅవుట్ వేశారు. ఇందులో 150 కాటేజీల నిర్మాణం చేపట్టారు. దీంతో దేశ విదేశాల్లోని సత్యసాయి భక్తులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఈ–2’ కాటేజీని ఢిల్లీకి చెందిన డింపుల్ అరోరా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆమె అందులోనే నివాసం ఉంటున్నారు. ఇలా 1992 నుంచి లేఅవుట్లో కాటేజీలు అమ్ముతూ వచ్చిన ఉజ్వల ఫౌండేషన్ మిగిలిన కాటేజీలను చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి విక్రయించింది. అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సినప్పుడల్లా చెన్నై నుంచి అతను పుట్టపర్తి రావడం ఇబ్బందిగా మారడంతో నాలుగైదేళ్ల కిందట రవి అనే వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం రవి కోవిడ్‌తో మరణించారు. దీంతో కొన్నిరోజులుగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రవి స్నేహితుడైన గోవర్దన్‌రెడ్డి చెన్నైకి వెళ్లి సుబ్రహ్మణ్యంను కలిసి కొత్తగా పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకున్నారు. అక్రమాలకు ఊతం.. పవర్ఆఫ్ అటార్నీ పొందిన గోవర్ధన్‌రెడ్డి తన మామ, పుట్టపర్తి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డికి నమ్మినబంటు శ్రీరామిరెడ్డితో కలిసి ఉజ్వల ఫౌండేషన్‌లో ఖాళీగా ఉన్న స్థలాల కబ్జాకు ప్లాన్ వేశారు. లేఅవుట్లోని చిల్ట్రన్పార్కు, పార్కింగ్ ఏరియా, సెక్యూరిటీ, లైబ్రరీకి కేటాయించిన స్థలాలను ఇష్టానుసారంగా విక్రయించాడు. దీంతో లేఅవుట్‌కు చెందిన ఉమ్మడి స్థలాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ఈ–2’ కాటేజీలో ఉంటున్న డింపుల్ అరోరా 15 రోజుల కిందట ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న గోవర్దన్‌రెడ్డి తన మామ శ్రీరామరెడ్డి సాయంతో డింపుల్ అరోరాపై బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఈ–2 కాటేజీ పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో ఏకంగా పునాది వేశారు. దీంతో డింపుల్ ఆరోరా ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. పుట్టపర్తి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పుడా వైస్ చైర్మన్లతో కమిటీ నియమించి...వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. రచ్చకెక్కిన వర్గవిభేదాలు.. ఉజ్వల ఫౌండేషన్ వ్యవహారంతో టీడీపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి వస్తున్నట్లు తెలుసుకున్న ఆపార్టీ నేతలు కొత్త చెరువులో పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ‘గో బ్యాక్ జేసీ’ అంటూ పల్లె అనుచరులు, ‘స్వాగతం జేసీ’ అంటూ జేసీ అనుచరులు నినాదాలు చేశారు. టికెట్ వచ్చేది పల్లెకే అంటూ పల్లె వర్గీయులు, మీకు టికెట్ వచ్చేంత సీన్ లేదని జేసీ వర్గీయులు వాదులాడుకున్నారు. మాటా మాటా పెరిగి ఒక దశలో తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. జేసీకి కలిసివచ్చిన ‘ఉజ్వల’ టీడీపీకి చెందిన ‘పల్లె’, జేసీ విభేదాలతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో అధికార పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాభవం కోల్పోతున్నానని పల్లె రఘునాథ రెడ్డి ఆందోళనలో ఉన్నారు.‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ’ జేసీ ప్రభాకర్ రెడ్డి పల్లెపై ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్నారు. పల్లెకు టికెట్ రానీయనంటూ బాహాటంగానే శపథం పూనారు. పుట్టపర్తి నియోజకవర్గానికి టీడీపీ తరఫున సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ తెప్పించుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అనుచర వర్గాన్ని తయారుచేసి పల్లెకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉజ్వల’ అక్రమాలను జేసీ అందిపుచ్చుకున్నారు. పల్లె అక్రమాలపై జేసీ లొల్లి.. కొన్నాళ్లుగా పల్లె రఘునాథరెడ్డిపై గుర్రుగా ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉజ్వల ఫౌండేషన్‌లో అక్రమాలపై స్పందించారు. ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలన్నీ ‘పల్లె’ కనుసన్నల్లోనే జరిగాయని, పల్లె అనుచరుడైన శ్రీరామిరెడ్డి, అతని అల్లుడు గోవర్ధన్‌రెడ్డి కాటేజీలను అక్రమంగా విక్రయించి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ‘ఉజ్వల’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం అనంతపురం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి జేసీని మరూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. జేసీకి నచ్చజెప్పి అనంతపురంలోని తన నివాసానికి పంపించారు. -
వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమికి ఏకంగా హెచ్ఎండీఏ లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌బుక్‌ను రద్దు చేసినా.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్‌ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. అనంతరం వక్ఫ్‌భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్ 429 టీ 0516090202) పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్మెంట్ జారీ చేశారు. వివాదాస్పదమని తేలినా.. పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్‌పై కూడా రాసి పెట్టారు. ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. చాలాసార్లు ఫిర్యాదు చేశాం వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎ.శ్రీనివాస్‌గౌడ్, రావిర్యాల అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే.. కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు. – జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం -
ఎంజీ గ్లూస్టర్ సావీలో కీలక మార్పులు.. ధర తగ్గనుందా?
MG Motors Glooster Saavy ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో కటింగ్ టెక్నాలజీ అందించే లక్ష్యంతో ఇటీవల రిలయన్స్ జియోతో జట్టు కట్టిన ఎంజీ మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైఎండ్ లగ్జరీ వెహికల్‌గా ఉన్న గ్లూస్టర్లో మరో మార్పు చేసింది. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీ ఎంజీ మోటార్స్ సంస్థ ఎలాగైనా భారత మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఎంజీ హెక్టార్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉండగా గ్లూస్టర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ కేటగిరిలో ఉంది. గ్లూస్టర్లో సూపర్, స్మార్ట్, షార్ప్, సావీ వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఇందులో సూపర్, షార్ప్ వేరియంట్లు సెవన్ సీటర్లుగా ఉన్నాయి. సావీ పూర్తి లగ్జరీ కారుగా సిక్స్ సీట్ లే అవుట్తోనే మార్కెట్లో కొససాగుతోంది. ఆగస్టు 9న ఇండియన్ మార్కెట్ డిమాండ్‌కి తగ్గట్టుగా సేవీ సీటింగ్ లేవుట్‌లో మార్పులు చేసింది. సెవన్ సీటర్ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సావీ వేరియంట్లోనూ ఏడుగురు కూర్చునేలా మార్పులు చేసింది. సెవన్ సీటర్ సావీ కారుని ఆగస్టు 9న మార్కెట్లో విడుదల చేయనుంది. హై ఎండ్ మోడల్ ఎంజీ మోటార్ ఇండియాకు సంబంధించి గ్లూస్టర్ సావీనే హై ఎండ్ మోడల్. ఇందులో అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ సాయంతో ఈ కారును డ్రైవ్ చేయడం పార్క్ చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ స్పీడ్‌తో పాటు డిమాండ్‌ను బట్టి ఫోర్ డ్రైవింగ్‌ను సైతం అందిస్తోంది. ఇక సెవన్ డిఫరెంట్ టెర్రైన్ డ్రైవింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 సీటర్ గ్లూస్టర్ సావీ ధర రూ. 44.59 లక్షలుగా ఉంది. సెవన్ సీటర్ లే అవుట్ ధర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. -
బినామీల ‘బడా’ దోపిడీ!
► రాజధాని గ్రామాల లేఔట్ల పనుల టెండర్లలో గోల్మాల్ ► నెక్కల్లు, శాఖమూరు లేఔట్లలో మౌలిక సదుపాయాలకు రూ.666.18 కోట్లతో టెండర్ ► బడా సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ ► బినామీలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడ ► మిగతా 27 గ్రామాల లేఔట్లకు రూ.13,500 కోట్లతో అంచనాలు సిద్ధం సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించిన ప్లాట్లకు మౌలిక సదుపాయాల పనులను బినామీలకు కట్ట బెట్టి భారీ ఎత్తున కమీషన్లు నొక్కేయడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. గుంటూరు జిల్లా నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు ఇచ్చిన లేఔట్(జోన్–1)లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.666.18 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో ఈ నెల 5న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులు సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్బ్రిడ్జ్–సెమ్బ్‌కార్ప్), ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ వంటి బడా సంస్థలకే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఆ సంస్థలకు పనులు దక్కాక తమ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగం. ఇదే రీతిలో మిగతా 27 గ్రామాల లేఔట్లకు మౌలిక సదుపాయాలను కల్పించే పనులను రూ.13,500 కోట్లతో చేపట్టి, కమీషన్లు దండుకోవడానికి వ్యూహం రచించారు. ఈ మేరకు అంచనాలు సిద్ధం చేసినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలకు నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఔట్లు ఏర్పాటు చేసింది. ఉండవల్లి, పెనుమాక మినహా మిగతా 27 గ్రామాల రైతులకు లేఔట్లలో ఇప్పటికే ప్లాట్లు కేటాయించారు. ఆ లేఔట్లకు రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు, భూగర్భ విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్ కేబుల్ లైన్లు, వరద నీటి కాలువలు, సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించా లని సర్కారు నిర్ణయించింది. తొలుత నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయిం చిన లేఔట్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లోనే తిరకాసు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేవలం బడా కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు.. ► 2007–08 నుంచి 2016–17 వరకూ ఇదే రకమైన (ఇండస్ట్రియల్ పార్కులు, టౌన్‌షిప్‌లు, సెజ్‌లు, ఐటీ పార్క్‌లు, రోడ్లు, ఎయిర్‌ఫీల్డ్స్, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరా, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లువంటి పనులు) ఏటా రూ.111.03 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి ఉం డాలి. జాయింట్ వెంచర్లలో ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన వారు ఇదే రీతిలో పనులు పూర్తి చేసి ఉండాలి. ► గత పదేళ్లలో ఏటా రూ.293 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ఉండాలి. ► గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లపాటు వరుసగా లాభాలు గడించి ఉండాలి. బ్యాంకుల్లో రూ.74 కోట్ల నగదు నిల్వలు ఉండాలి. ► గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్), ఎస్డీఆర్ (స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చర్) అమలు చేసి ఉండకూడదు. ► గత పదేళ్లలో ఏటా కనీసం రూ.12,420 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రహదారులు, సీసీ రోడ్ల పనులు చేసి ఉండాలి. వంద మీటర్ల వ్యాసార్ధంతో తాగునీరు, మురుగునీటి పైపులైన్ వ్యవస్థ ఏటా కనీసం 27.50 కి.మీ.లు వేసి ఉండాలి. 200 మీటర్లు, అంతకన్నా ఎక్కువ వ్యాసార్ధంతో కూడిన హెచ్డీపీఈ పైపులైన్ వ్యవస్థను ఏటా కనీసం ఎనిమిది వేల మీటర్లు వేసి ఉండాలి. విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ పనులు కనీసం 180 కి.మీ. పూర్తి చేసి ఉండాలి. ఏటా రోజుకు 3 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించి ఉండాలి. ► గత పదేళ్లలో ఆర్థికమాంద్యం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది. దేశీయ కాంట్రాక్టు సంస్థలు ఎస్డీఆర్, సీడీఆర్ అమలు చేశాయి. భారీ ఎత్తున పనులు చేసిన దాఖలాలు లేవు. వీటిని పరిశీలిస్తే బడా సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. నెక్కల్లు గ్రామ పంచాయతీ లేఔట్ -
చెయ్యాలా?మానాలా?
పంచాయతీల పరిధిలో అనేక అనధికారిక లే అవుట్లు క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలోనే జీఓ నం: 12 విడుదల స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రక్రియకు జంకుతున్న పలువురు కార్యదర్శులు క్రమబద్ధీకరిస్తున్న చోట దళారుల హవా మండపేట : ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావం’డన్న చందాన ఉంది సర్కారు తీరు. పంచాయతీల పరిధిలోని అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు జీఓ నం: 12 విడుదల చేసిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన మార్గదర్శకాలపై స్పష్టతను విస్మరించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఏం చేయా లో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమబద్ధీకరిస్తే ఏం కొంప మునుగుతుందోనని అధికశాతం మంది కార్యదర్శులు వెనుకడుగేస్తుండగా, కొందరు కార్యదర్శులు ధైర్యంగా క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు స్థలయజమానుల నుంచి కాసులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 604 అనధికారిక లే అవుట్లు లే అవుట్లు వేసేటప్పుడు నిబంధనల మేరకు 33 అడుగుల రోడ్డు, 10 శాతం కామన్ సైట్లను పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయించాలి. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సదుపాయం యాజమాన్యమే కల్పించాలి. నిబంధనల అతిక్రమణ జరిగిన లేఅవుట్లను అనధికారిక లే అవుట్లుగా గుర్తిస్తారు. జిల్లావ్యాప్తంగా 604 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి. రాజమండ్రి డివిన్లోలో 156, కాకినాడ డివిజన్లో 177, అమలాపురం డివిజన్లో 170, పెద్దాపురం డివిజన్లో 101 అనధికారిక లేఅవుట్లను గుర్తించారు. పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించేందుకంటూ అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలో ప్రభుత్వం జీఓ నం:12ను విడుదల చేసింది. అనధికారిక లే అవుట్లలో రిజిస్ట్రేష¯ŒSశాఖ నిర్ధారించిన విలువలో 14 శాతం అపరాధ రుసుముగా వసూలు చేయవచ్చని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాల స్థాయిని బట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ కు రూ.ఐదు వేల వరకు, తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.మూడు వేల వరకు ఫీజు వసూలు చేయొచ్చంది. లిఖితపూర్వక ఆదేశాలు కరువు.. కాగా 14 శాతం అపరాధ రుసుము వసూలు చేసిన లే అవుట్లలో రోడ్ల విభజన తదితర నిబంధనల అమలుపై స్పష్టత లేకపోవడం, లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు సూచనలు చేయకపోవడం కార్యదర్శులను అయోమయానికి గురిచేస్తోంది. పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర వసతులు కల్పించాల్సి ఉండటంతో ఈ అపరాధ రుసుం సరిపోక పోగా పంచాయతీకి అదనపు భారం పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఓ ప్రకారం చేయమని సూచించడమే తప్ప లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం లేదని కార్యదర్శులంటున్నారు. జీఓలో స్పష్టత లేకపోవడంతో తర్వాత ఏం ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనతో క్రమబద్ధీకరణకు ఎక్కువమంది కార్యదర్శులు ముందుకు రావడం లేదు. భారీగా దళారుల వసూళ్లు, అధికారులకు వాటాలు.. జిల్లాలో కొందరు కార్యదర్శులు మాత్రం14 శాతం అపరాధ రుసుంతో క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. మండపేట, అనపర్తి, రాజమండ్రి రూరల్ తదితర ప్రాంతాల్లో పలు లే అవుట్లను క్రమబద్ధీకరించినట్టు సమాచారం. ఇదే అదనుగా దళారులు క్రమబద్ధీకరణ చేయిస్తామంటూ లే అవుట్లలోని స్థలాలు కొన్న వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోం ది. జీఓపై స్పష్టత ఇవ్వడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్ చార్జి డీపీఓ పద్మను వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
లే అవుట్ లు
జిల్లాలో అడ్డగోలుగా ‘ప్లాట్ల’ దందా రూ. కోట్లలో సర్కారు ఖజానాకు గండి నిజామాబాద్, కామారెడ్డిల్లో లేఅవుట్ లేని ప్లాట్ల విక్రయాలు పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది అండదండలతో.. పట్టింపులేని అధికార యంత్రాంగం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ‘మాయ’ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం మళ్లీ జోరందుకుంటోంది. ఇంతకాలం మందకొడిగా సాగ గా... ఇటీవల మళ్లీ లేఅవుట్ల దందా మొదలైంది. కొంత పెట్టుబడి... నేతల అండ ఉంటే చాలు వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా మారిపోతున్నాయి. వ్యవసా య పొలాలను నివేశన స్థలాలుగా మారుస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది చేయి తడిపి రూ.లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు నిజామాబాద్, కామారెడ్డి, సదాశివనగర్లతో పాటు నిజామాబాద్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ప్లాట్లు చేస్తున్నారు. బైపాస్‌రోడ్డు ప్రారంభం కావడంతో ఈ రోడ్డు చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వెలుస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలతో మధ్య తరగతి వాసులను ఆకట్టుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్మును రూ.కోట్లలో ఎగ్గొడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో అధికారులు ‘అమ్యామ్యాలు’ పుచ్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న భూములను వ్యవసాయ క్షేత్రాలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు.. నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల శివారులతో పాటు జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నా కనీస చర్యలు లేవు. గతేడాది జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు సానుకూలంగా స్పందించడం కామారెడ్డి ప్రాంతంలో ఈ వ్యాపారానికి తెర తీసినట్లయ్యింది. కామారెడ్డి-హైదరాబాద్ మధ్యన ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కామారెడ్డి చుట్టూ అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. నిజామాబాద్-కామారెడ్డి మధ్యన జాతీయ రహదారి పొడువునా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నచోట కూడ లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లకు తెరతీశాయి. నిజామాబాద్ నగర శివారులో ఓ బడానేత అండదండలతో అక్రమ నిర్మాణాలే కాదు అక్రమ వెంచర్లు కూడ వెలిశా యి. ఇలా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 22 చోట్ల స్థిరాస్తి వ్యాపారం కోసం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయగా పంచాయతీ, నగర/పట్టణ పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 1200 ఎకరాలకు పైగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు అధికారవర్గాల అంచనా. నిబంధనలను పాటించని వ్యాపారులు... ప్లాట్ల వ్యాపారం చేస్తున్న వారు కనీస నిబంధనలను పాటించడం లేదు. లేఅవుట్ వేసేందేకు ముందుగా పంచాయతీ ఆమోదం, నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాల్సి ఉంది. లేఅవుట్ వేస్తున్న భూమిని భూ మార్పిడి కింద (వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు గాను భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్మును రుసుము కింద చెల్లించాలి. పదెకరాల్లో లేఅవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే... రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని అనుమతి పొందాలి. లేఅవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టీలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. అనుమతి పొందిన లేఅవుట్లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వే యాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది. కానీ ఎక్కడా వీటిని పాటించడం లేదు. రూ.కోట్లలో ఎగవేస్తున్నరియల్ ఎస్టేట్ వ్యాపారులు... జిల్లాలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆరు నెలల్లో దాదాపు 200 పైగా లేఅవుట్లు వెలిశాయి. ఈ భూమి ఎకరాకు కనీసం రూ.30 లక్షల వంతున విలువ రూ.300 కోట్లు. ఇందులో 10 శాతం రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యాపారులు, అధికారులు కూడబలుక్కొని రూ.30 కోట్ల వరకు ఎగవేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లే అవుట్లలో 10 శాతం స్థలాన్ని కూడా వదల్లేదు. కొన్నింటికీ గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం లేవు. ♦ నిజామాబాద్ శివారులో గ్రామీణ మండలం పరిధిలోని వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా సుమారు 50 ఎకరాల్లో అక్రమంగా 10 దాకా లేఅవుట్లు వెలిశాయి. అందులో చాలా వాటికి నగరపాలక సంస్థ, పంచాయతీల ఆమోదం లేదు. ♦ కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణ శివారులో జాతీయ రహదారికి ఇరువైపులా లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అటు మున్సిపాలిటీ, ఇటు సంబంధిత పంచాయతీ ఆమోదం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్న సీఎం హామీతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. ♦ నిజామాబాద్ - డిచ్పల్లి బైపాస్ రోడ్డులో నిజామాబాద్‌లో బ్రిడ్జిని ఆనుకుని ఓ వెంచర్ వెలిసింది. ఈ వెంచర్లో పూర్తిగా కాల్వను ఆనుకుని చేశారు. పట్టాభూమిలోనే ప్లాట్లు ఏర్పాటు చేశామని చెప్తున్నా డీటీసీపీ నిబంధనలు తుంగలో తొక్కారు. రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లే దు. జిల్లా వ్యాప్తంగా ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. -
ప్లాటు పాట్లు
విజయనగరం మున్సిపాలిటీ: అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని సొంతిల్లు నిర్మించుకుకోవాలనే తపనతో రియల్ ఎస్టేట్లలో స్థలా లు(ప్లాటు) కొనుగోలు చేస్తున్న పేద, మద్య తరగతి ప్రజలు ఇప్పుడు పాట్లు పడుతున్నారు. ఏవి అధికారిక లే అవుట్లో..ఏవి అనధికారకంగా వెలిసిన లే అవుట్లో తెలియక కొనుగోలు చేసిన వారి పరిస్థితి ప్రస్తుతం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మా రింది. అనధికారికంగా వెలసిన లేవుట్లను నివారించి..సదరు యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయంలో చేతులెత్తేసి... ఆ లేవుట్లలో కొనుగోలు చేసిన భూముల్లో (ప్లాట్లలో) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమంటూ తెగేసి చెబుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారిక లెక్కల ప్రకారం అధికారికంగా వేసిన లే అవుట్లు 2463.76 ఎకరాల్లో 263 ఉండగా..అనధికారికంగా వేసిన లేవుట్లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయి. గత ఏడాది విజెలెన్స్ అధికారులు కేవలం డెంకాడ మండల పరిధిలో16 అక్రమ లే అవుట్లు గుర్తించి, వాటి ద్వారా రూ.12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క మండలంలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడితే జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. వాస్తవానికే పంట భూములను లే అవుట్లుగా మార్చాలంటే ముందుగా సదరు ధృవపత్రాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి ల్యాండ్ కన్వర్జేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం లే అవుట్ మొత్తం విలువలో 9 శాతం ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అలా ఆర్డీఓ కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న తరువాత ఏ గ్రామ పంచాయతీలో లే అవుట్ వేస్తున్నారో సదరు పంచాయతీ అనుమతి పొందాలి. అనుమతి ఇచ్చే ముందు సదరు లే అవుట్లో ప్లాట్‌కు తగిన రహదారి, వీధి దీపాలు, నీటి సౌకర్యాలు ఉన్నాయా లేవా..అన్నది పరిశీలించిన అనంతరం ఆ లేవుట్‌లో 10 శాతం భూమిని పంచాయతీకి అప్పగించాలి. అయితే ఇవేవీ చేయకుండానే పలువురు యజమానులు లే అవుట్ వేయటంతో పాటు వాటిని విక్రయాలు జరిపి చేతులు దులుపుకు న్నారు. ప్రస్థుతం ఇటువంటి లే అవుట్లలో నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ చర్యలకు అవకాశం ఉన్నా ప్రయోజనం శూన్యంః ఇలా ప్రజలను మభ్యపెట్టి అనధికారిక లే అవుట్లలో భూములు విక్రయించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారం జిల్లాలో సాగుతుండగా.. అప్పట్లో అధికారుల ఉదాసీన వైఖరితో అటువంటి లే అవుట్ల వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు. అనంతర కాలంలో నిబంధనలకు విరుద్ధమైన లే అవుట్లో భూములు కొనుగోలు చేశామని కోనుగోలు దారులు గుర్తించి లోకాయుక్తను ఆశ్రయించగా.. సదరు కమిషనర్ అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అనధికారిక లే అవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు ప్రారంభించగా... వారి అడ్రస్‌లు సక్రమంగా లేక ఆ నోటీసులు అందకుండా పోయాయి. జిల్లాలో వందల సంఖ్యలోనే అక్రమ లేవుట్లు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్లపై అటు ఉడా అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఏళ్ల తరబడి దృష్టి సారించిన దాఖలాలు లేవు.లేవుట్లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఆసరాగా తీసుకుంటున్న అక్రమార్కులు కొద్ది పాటి భూమిని కొనుగోలు చేసి పక్కనే ఉన్న ప్రభుత్వ బంజరు భూములు, చెరువులు, గుంతలను కలుపుకుని లే అవుట్ వేసేస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనల మేరకు లే అవుట్లో పది శాతం భూమిని అప్పగించకుండా, కన్వర్షన్ రుసుం చెల్లించకుండా లే అవుట్లు వెలుస్తున్నాయి. ఇవేవీ తెలియని ప్రజలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా డబ్బులు ఉన్నప్పుడే రెండు ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే మంచిదన్న ఆత్రుతతో వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అక్రమ లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అనుమతులిచ్చేది లేదు అనధికారిక లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేది లేదు. అది నిబంధనలకు విరుద్ధం. అనధికారిక లే అవుట్లు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుందామంటే వారెక్కడున్నారో తెలియని పరిస్థితి. గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. -ఎస్.సత్యనారాయణరాజు, జిల్లా పంచాయతీ అధికారి. విజయనగరం. -
క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!
-
ఎకరాలో లే అవుట్!
⇒ హెచ్ఎండీఏ లే-అవుట్ల నిబంధనల్లో సడలింపులు ⇒ ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలో లే-అవుట్ల నిబంధనలను సడలిస్తూ శుక్రవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిననుసరించి ఇకపై ఎకరా స్థలం ఉన్నా లే-అవుట్ వేసుకోవచ్చు. అయితే పదెకరాల లోపు స్థలం ఉంటే లే అవుట్ చార్జీలను మాత్రం అధికంగా వసూలు చేయనున్నారు. 1-5 ఎకరాల లోపు స్థలం ఉంటే 75 శాతం, 5-10 ఎకరాల స్థలం వుంటే 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తారు. -
వాజ్‌పేయి లేఔట్లో సమస్యల తిష్ట
సాక్షి, బళ్లారి : నగరంలోని బుడా లేఔట్లలో (బళ్లారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) సమస్యలు తిష్ట వేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఇళ్లు కట్టించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. బుడాకు అధ్యక్షుడు, కమిషనర్, పలువురు అధికారులు లేఔట్లు, నగరాభివృద్ధి కోసం పని చేస్తారు. ఇటీవల బళ్లారిలోని బుడా పరిధిలో వేసిన లేఔట్లలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉండటంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. నగర శివార్లలోని అటల్ బిహారీ వాజ్‌పేయి బుడా కాలనీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆ కాలనీలో నీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ఇళ్ల నిర్మాణాల కోసం వేలాది రూపాయలు నీటి కోసం వెచ్చిస్తున్నారు. ఐదేళ్ల లోపు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు పెట్టిన బుడా అధికారులు రెండు సంవత్సరాలైనా నీటి వసతి కల్పించడంలో ఎందుకు దృష్టి పెట్టడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చిన్న ఇళ్లు నిర్మాణం చేపట్టేందుకు కూడా కనీసం రూ.50 వేలు నీటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. ప్లాట్లు అమ్మేసి కోట్లాది రూపాయలు బుడాకు ఆదాయం సమకూర్చుకున్న పాలకులు, అధికారులు నీటి వసతి కల్పించడంపై దృష్టి పెట్టక పోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. లైఔట్కు సంబంధించి కార్పొరేషన్ అధికారులు తమకేమీ దాఖలాలు అందలేదని, వాజ్‌పేయి లేఔట్ సంగనకల్లు పంచాయతీ పరిధిలోకి చేర్చారని చెప్పడం గమనార్హం. కాలనీలో నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్య వెంటాడుతోందని కాలనీలో ఇంటిని నిర్మించుకుంటున్న టీ.మాధవరావు వాపోయాడు. ఇంటి నిర్మాణం కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేసిన ప్లాట్లుకే సరైన సదుపాయాలు కల్పించకపోతే ఇక ప్రైవేటు లేఔట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
భూమాయలో పడొద్దు
- కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త - అనుమతులు లేని లేఔట్లతో అప్రమత్తం తిరుపతి తుడా: అదిగో మెడికల్ హబ్.. ఇక్కడ ఐఐటీ.. పక్కనే పాకశాస్త్ర కళాశాల.. దగ్గర్లో హైకోర్టు బెంచ్.. టూరిజం హబ్.. అంటూ హోరెత్తుతున్న ప్రచారాలతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో గడిచిన రెండు నెలలు గా స్థిరాస్తి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్నం టుతున్నాయి. ఈ నేపథ్యంలో భూములు, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు రికార్డులన్నీ సక్రమంగా సరిచూసుకోకపోతే మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్టే. మాయమాటలతో ముంచేసేందుకు బ్రోకర్లు సిద్ధంగా ఉన్నారు. కొనుగోలుదారుల ఆరాటాన్ని.. అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి టోకరా వేసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఖాళీ స్థలం.. భవనం.. అపార్ట్మెంట్లోని ఫ్లాట్.. ఏదైనా సరే కొనుగోలు చేసేవారికి తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యాంకుమార్ సూచనలు ఇవీ.. భూమి ఎక్కడుందో చూసుకోకుండా కొనుగోలు చేయకూడదు. ప్రతి భూమికి సంబంధించి ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్), లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఈసీ తీసుకున్నప్పుడు నేరుగా పరిశీలించుకోవాలి. మధ్యవర్తులు తెచ్చి చూపించే ఈసీలను నమ్మకూడదు.భూమి యాజమాన్య హక్కులు చూసుకోవాలి. అది పట్టానా? ప్రయివేటుదా..? ప్రభుత్వానిదా..? ఆ భూమి ఉన్నట్లు తెలిపిన సర్వే నంబరు క్షేత్రస్థాయిలో ఉందా.. లేదా...? తెలుసుకోవాలి. ఇరుగు పొరుగు సర్వే నంబర్లను రికార్డులో చేర్చి ఫలానా సర్వే నంబరు అదేనంటూ బుకాయించే ప్రమాదం కూడా ఉంది. కాగితాల్లో సర్వే నంబరు చూసి నమ్మడం కంటే సంబంధిత సర్వే నంబరును ప్రభుత్వ సర్వేయర్ ద్వారా నిర్ధారించుకోవాలి. ఆక్రమించిన భూములేమో నిర్ధారించుకోవాలి. నిషేధిత భూముల జాబితా(ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్- బదిలీ నిషేధిత భూమి)లో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ వివరాలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉంటాయి. ఆర్ఎస్ఆర్ (రీ సర్వే రిజిస్టర్)లో ఏ కేటగిరి భూమో తెలుస్తుంది. ప్రభుత్వానిదైతే అసైన్డ్ భూములు, వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు, వక్ఫ్, క్రిస్టియన్ మైనారిటీ, నీటి పారుదల శాఖలకు చెందినవేమో చూసుకోవాలి.భూమి సర్వే నంబరు ప్రకారం అడంగల్ చూసుకోవాలి. పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదైందో లేదో చూడాలి. ఏ గ్రామానికి సంబంధించిన భూమి. క్రయ విక్రయాల వివరాలు మీ సేవలో పొందవచ్చు. ఇంటి స్థలం అయితే దస్తావేజులను పరిశీలించుకోవాలి. స్థలం అసైన్మెంటు (ఇంటి నంబరు, ఇరుగుపొరుగు ఇళ్ల వివరాలు) చూడాలి. పట్టణాలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రణాళికా విభాగాల్లో దస్తావేజులు సరైనవో కాదో నిర్ధారించుకోవాలి. గ్రామ పరిధిలో నివేశన స్థలాలైతే గ్రామ కంఠంలో ఉందా? ప్రభుత్వ గ్రామ కంఠంలో ఉందా?ప్రైవేటు కంఠమా? చూసుకోవాలి. ఏ స్థలం రికార్డులైనా తారుమారు చేయడానికి, నకిలీలు రూపొందించడానికి అవకాశం ఉంది. పోటీకి వస్తారని కొందరు రహస్యంగా కొనుగోలు చేయడం పరిపాటిగా జరుగుతోంది. ఆయా భూముల ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నగరపాలక సంస్థలు, పురపాలక పరిధిలో మాస్టర్ ప్లాన్‌లో ఉందా.. లేదా..? చూసుకోవాలి.తుడా పరిధిలో ప్లాట్లు అనుమతి పొందిన లేఔట్లా.. కాదా..? చూసుకోవాలి. తనఖా పెట్టిన ఆస్తిని కూడా విక్రయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సంబంధిత ప్లాటుపై తీసుకున్న రుణం చెల్లించారా లేదా తెలుసుకోవాలి.అపార్టుమెంట్ అయితే అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం జరిగిందా లేదో చేసుకోవాలి.సామాజిక అవసరాల (పార్కులు, ఆట స్థలాలు, రోడ్లు, పారిశ్రామిక అవసరాలు)కు సంబంధించిన భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతుం టాయి. వాటిని కనిపెట్టాలి. -
సిటీలో శ్రీవరి
నెల్లూరులోని మాగుంట లేఅవుట్ ధనవంతుల నివాసాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాంతం పేరు చెప్పగానే భారీ అపార్టుమెంట్లు, లేటెస్ట్ మోడళ్ల బిల్డింగ్లు గుర్తుకు వస్తాయి. ఇంతటి ఖరీదైన ప్రాంతంలోనూ ఇప్పటికీ వ్యవసాయం జరుగుతోంది. నగరానికి పచ్చతోరణంగా ఓ రైతు వరి సాగుచేస్తున్నాడు. ఇదే ప్రత్యేకతైతే ఇంతకంటే విశేషమేమిటంటే శ్రీవరిసాగు. అందులో భాగంగా వినూత్నరీతిలో క్రికెట్ పిచ్‌ల తరహాలో నారుమళ్లను సిద్ధం చేయడం అటుగా వెళుతున్న వారిని ఆకర్షిస్తోంది. కొందరైతే పొలం వద్ద ఆగి మరీ వివరాలు ఆరా తీసి వెళుతున్నారు. - సాక్షి, నెల్లూరు (ఫొటో : ముత్యాల వెంకటరమణ) -
పచ్చధనమని..?
హుజూర్నగర్, న్యూస్‌లైన్: గ్రీన్‌ల్యాండ్ పై అక్రమార్కుల కన్నుపడింది. దాదాపు 30 ఏళ్ల నుంచి వివిధ వెంచర్ల ద్వారా పంచాయతీకి చెందాల్సిన భూములు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. హుజూర్నగర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు వివిధ లే అవుట్ల ద్వారా సంక్రమించిన స్థలాలు కనిపించకుండా పోయాయి. 1982 నుంచి 2011 వరకు పట్టణంలో 137, 187, 188, 190, 191, 203, 204, 205, 206, 207, 208, 211, 212, 285, 292, 300, 302, 478 తదితర సర్వే నంబర్లలో 46 వెంచర్ల ద్వారా లేఅవుట్ రూపంలో గ్రామ పంచాయతీకి సుమారు 60వేల చదరపు గజాల స్థలాలను కేటాయించారు. కాగా ఆయా స్థలాలు నిబంధనల ప్రకారం సంబంధిత పంచాయతీ ఈఓల పేరుమీద అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. కానీ, ఈ స్థలాలను కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ద్వారా గ్రామ పంచాయతీ అధికారి పేరు మీద అగ్రిమెంట్ చేయకుండా సంబంధిత స్థల యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఈ స్థలాలు విక్రయించుకునేందుకు ఆయా స్థలాల యజమానులకు వెసులుబాటు కలిగింది. ఈ విషయంలో పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు మధ్యవర్తులుగా గ్రామ పంచాయతీ ఈఓ, ప్లాట్ యజమానుల మధ్య అవగాహన కుదిర్చి స్థలాలను విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్లాట్లను ఆయా ప్లాట్ల వెంట ఉన్న వారు పంచాయతీ అధికారులతో అవగాహన కుదుర్చుకుని కబ్జాలు చేశారు. కబ్జాకు గురైన స్థలాలివిగో... 204 సర్వే నంబర్లో గ్రామ పంచాయతీకి లేఅవుట్ కింద 450 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా అప్పటి ఈఓ పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి సదరు యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఆ యజమాని గత ఏడాది ఈ ప్లాట్‌ను అమ్ముకున్నాడు. అదేవిధంగా 208 సర్వే నంబర్లోని ప్లాట్ నెం.45లో 203 చదరపు గజాలను కూడా గత ఏడాదే అమ్మారు. సర్వే నెం.298/అ, 298/ఆ, 298/ఉ, 298/ఇ, 298/ఊ, 298/అ1లలో గ్రామ పంచాయితీ లే అవుట్ కింద130, 131, 132, 133, 134, 143, 144, 129, 145 నంబర్ ప్లాట్లను మొత్తం 2268 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాలు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా ప్రస్తుతం బీనామీ పేర్లతో ఉంచారు. వీటిని ఏ క్షణంలో నైనా విక్రయించేందుకు సదరు బినామీలు సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కాస్త నగర పంచాయతీగా మారడంతో ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు మధ్యవర్తులు అదేపనిగా విక్రయాలు, కబ్జాలు చేయిస్తూ చక్రం తిప్పుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే 1982 నుంచి 2011 వరకు గ్రామ పంచాయితీకి కేటాయించిన లే అవుట్ భూముల అన్యాక్రాంతంపై గత ఏడాది అఖిలపక్ష నాయకులు విచారణ జరపాలని కోరుతూ నగర పంచాయతీ కమిషనర్‌కు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసి ఆందోళన కూడా చేశారు. అయినా వాటిపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరపలేదు. ఇప్పటికైనా వాటిపై విచారణ చేపట్టకుంటే ఆందోళన చేపట్టేందుకు అఖిలపక్షం నాయకులు సిద్ధమవుతున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్నాం : నగర పంచాయతీ కమిషనర్ పంచాయతీ లే అవుట్ స్థలాల కబ్జా విషయంపై రికార్డులు తనిఖీ చేస్తున్నామని హుజూర్నగర్ నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డి తెలిపారు. హుజూర్నగర్ పంచాయతీగా ఉన్నకాలంలో అన్యాక్రాంతమైన ప్లాట్లను గుర్తిస్తున్నామన్నారు. త్వరలోనే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.